
'రాష్ట్రపతి పాలన ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన ప్రభుత్వాధికారుల నియామకాలు జరుపుతున్నారని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య కొంతకాలంగా నియామకాల రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రిన్సిపల్ సెక్రటరీగా రాజేంద్ర కుమార్ను నియమిస్తూ జారీ చేసిన కేజ్రీవాల్ ఆదేశాలను నజీబ్ జంగ్ తిరస్కరిస్తూ లేఖ రాయడంతో ఆయన ఈ వివాదంపై మంగళవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి సిసోడియా మీడియాతో మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీని లెఫ్టినెంట్ గవర్నర్ నియమించినప్పుడు తాము అంగీకరించామని, అయితే, ఆయన అంతటితో ఆగకుండా తమను సంప్రదించకుండా.. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వేరే మార్గాల ద్వారా ప్రభుత్వాధికారులను నియమిస్తున్నారని చెప్పారు. ఆయన నేరుగా ప్రభుత్వాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, అయినదానికి కానిదానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే వారిని బెదిరిస్తున్నారని ఈవిషయాలన్నీ రాష్ట్రపతికి విన్నవించామని చెప్పారు. ఇదిలా ఉండగా, తాజా వివాదాల నేపథ్యంలో తమ ప్రధాన కార్యదర్శితో సహా మిగితా కార్యదర్శులందరితో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు కార్యదర్శులంతా ఆ సమావేశానికి రావాలని సిసోడియా ఆదేశించారు. ఇదిలా ఉండగా, అంతకు ముందే నజీబ్ జంగ్ రాష్ట్రపతిని, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే.