రెండోస్సారి...ఎల్జీ మార్గదర్శకాలే ఫైనల్!
Published Tue, Jan 21 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లపై కోర్టుకెక్కిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు రెండోసారీ చుక్కెదురైంది. లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలే ఫైనల్ అంటూ మొదట ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే ద్విసభ్య ధర్మాసనం కూడా వెలువరించింది. వివరాల్లోకెళ్తే... నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను సవాలుచేస్తూ నగరంలోని ప్రైవేటు స్కూళ్లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాల ప్రకారమే నర్సరీ అడ్మిషన్లు జరుగుతాయని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. విద్యాశాఖ డైరక్టరేట్ త్వరలోనే అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం జనవరి 15 నుంచి నర్సరీ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావలసిఉంది. కానీ ప్రైవేటు స్కూళ్లు కోర్టుకు వెళ్లాయి. నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియపై మార్గదర్శకాలను జారీచేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని స్కూళ్లు వాదించాయి.
ఈ పిటిషన్‌ను మొదట ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దాంతో స్కూళ్లు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. ఈసారి కూడా అదే తీర్పు వెలువడడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది. లెప్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాల ప్రకారం.. అన్ని స్కూళ్లలో మేనేజ్‌మెంట్ కోటాను రద్దు చేయాలి. అన్ని పాఠశాలలు 100 పాయింట్ల ప్రాతిపదికన అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి. వాటిలో అత్యధికంగా 70 పాయింట్లను పాఠశాలకు సమీపంలో నివసించే వారికే అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వాలనే ‘నైబర్‌హుడ్ క్రైటీరియా’కు కేటాయించారు. అంటే స్కూలుకు 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే పిల్లలకు ‘నైబర్‌హుడ్ క్రైటీరియా’ వర్తిస్తుంది. మార్గదర్శకాల ప్రకారం 5 శాతం కోటా స్టాఫ్ పిల్లలు, మనవలు, మనుమరాళ్ల కోసం, 5 శాతం ఆడపిల్లల కోసం, 25 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం రిజర్వ్ చేస్తారు.
Advertisement