న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే తప్పేమిటంటూ తాను చేసిన వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సమర్ధించుకున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఎల్జీ తమను ఆహ్వానిస్తే సానుకూలంగా స్పందిస్తామని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆప్,కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేలు లేని బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని అవి ప్రశ్నిస్తున్నాయి. ఆప్ ఒక అడుగు ముందుకు వేసి తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తోందని ఆరోపిస్తోంది. ఇలా బీజేపీపై ముప్పేట దాడి జరుగుతున్న తరుణంలో ఆ పార్టీని ఎల్జీ సర్కారు ఏర్పాటుకు ఆహ్వానిస్తే తప్పేమిటని కాంగ్రెస్ సీనియర్ నేత, మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది.
వెంటనే ఆ పార్టీ నాయకులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు.కాగా, ఆమెపై ఉన్న కేసులను కేంద్రం తిరగతోడకుండా ఉండటానికే బీజేపీని షీలా వెనుకేసుకొస్తోందని ఆప్‌తో పాటు ఆమె సొంతపార్టీ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీని తాను వెనుకేసుకురావడంలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజ్యాంగపరమైన నిబంధనల గురించే తాను మాట్లాడానన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ వారిని ఆహ్వానిస్తే.. బీజేపీ తన సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కాంగ్రెస్, ఆప్ సభ్యుల మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అసాధ్యం కదా అని ప్రశ్నించగా అది వారి వ్యవహారమని వ్యాఖ్యానించారు.‘ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సభ్యులను సంపాదించుకోవడం వారి బాధ్యత.. ఆ విషయంతో మనకు ఎటువంటి సంబంధం లేదు.. నేను కేవలం రాజ్యాంగ నిబంధనల గురించే మాట్లాడా..’ అంటూ ఆమె వివరణ ఇచ్చారు. ‘తగినంత సంఖ్యాబలం ఉంటేనే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు.. వారికి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ సంతృప్తి చెందాలి .. లేదంటే ప్రభుత్వ ఏర్పాటు వారివల్ల అయ్యే పని కాదు కదా.. ఇందులో నేను చేయగలిగేది లేదా ఇంకెవరైనా చేయగలిగేది ఏమీ లేదు..’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ ఆహ్వానిస్తే తప్పేమిటని గత బుధవారం షీలాదీక్షిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా తన వ్యాఖ్యలను పార్టీ నాయకులు అపార్థం చేసుకున్నారని ఆమె అన్నారు. ‘ గత ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు మా పార్టీ మద్దతు ఇచ్చింది.. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఆప్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరో ఒకరు మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది తప్పితే వేరే మార్గం లేదు.. అలా జరగని పక్షంలో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికలు జరపాల్సిందే..’నని ఆమె స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత షీలాదీక్షిత్ కేరళ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు తర్వాత ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి ఢిల్లీ వచ్చేశారు. కాగా, రాష్ర్ట రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేనని, అయితే ప్రస్తుతం ఢిల్లీకి యువనాయకత్వం అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా, రాష్ర్టంలో రాష్ట్రపతి పాలనను రద్దుచేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆప్, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీని ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వమని రాష్ట్రపతికి ఎల్జీ లేఖ రాశారు. గత ఫిబ్రవరి 17వ తేదీనుంచి రాష్ర్టపతి పాలనలో ఉన్న నగరంలో ప్రజాసమస్యలు పేరుకుపోతున్నాయని, వెంటనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆ లేఖలో వివరించారు. ప్రస్తుతం 67మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 29 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యులు అవసరమవుతారు.
నేనేం తప్పు మాట్లాడలేదే..
Published Sun, Sep 14 2014 11:30 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement