Masarat Farooq: కశ్మీర్‌ లోయకు ట్యూషన్‌ చెబుతోంది | Masarat Farooq: Home tutorials give students a new environment | Sakshi
Sakshi News home page

Masarat Farooq: కశ్మీర్‌ లోయకు ట్యూషన్‌ చెబుతోంది

Published Thu, Jun 16 2022 12:20 AM | Last Updated on Thu, Jun 16 2022 12:20 AM

Masarat Farooq: Home tutorials give students a new environment - Sakshi

తుపాకుల మోతలు.. ఉగ్రవాదదాడులు ఇవి కశ్మీర్‌ అంటే గుర్తుకు వచ్చేది. కాని అక్కడి పిల్లలు చదువుకు చాలా విలువ ఇస్తారు. తరచూ స్కూళ్లకు వచ్చే ‘భయం సెలవులకు’ బాధ పడతారు. వారి భయం పోవాలంటే వాళ్ల ఇళ్లకే వెళ్లి ట్యూషన్‌ చెప్పాలి అని నిశ్చయించుకుంది మస్రత్‌ ఫారూక్‌.

తానే ఒక ఎంట్రప్రెన్యూర్‌గా మారి, లోయ మొత్తం దాదాపు 100 మంది టీచర్లను ఉద్యోగంలోకి తీసుకుంది. వీళ్లు సాయంత్రమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ట్యూషన్‌ చెప్పాలి. మస్రత్‌ ఆలోచన పెద్ద హిట్‌ అయ్యింది. తాజాగా కశ్మీర్‌ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ ఆమెకు ‘కశ్మీర్‌ విద్యారంగంలో తొలి మహిళా ఎంట్రప్రెన్యూర్‌’గా గుర్తింపు ఇచ్చారు.

26 ఏళ్లు మస్రత్‌ ఫరూక్‌కు. కాని కాశ్మీర్‌లోయ అంత ముఖ్యంగా శ్రీనగర్‌ అంతా ఆమెను ‘మాస్టర్‌జీ’ అని పిలుస్తారు. నర్‌వారా నుంచి ఒక తండ్రి ఫోన్‌ చేస్తాడు.. ‘మాస్టర్‌జీ... మా అబ్బాయికి ట్యూషన్‌ కావాలి’... రేషి మొహల్లా నుంచి ఒక తల్లి ఫోన్‌ చేస్తుంది.. ‘మాస్టర్‌జీ... మా పిల్లలకు ట్యూషన్‌ కావాలి’... టాటా బ్రాండ్, బాటా బ్రాండ్‌లాగా నమ్మకానికి, ఫలితాలకు ఒక గ్యారంటీగా మస్రత్‌ ఒక బ్రాండ్‌ అయ్యింది ట్యూషన్‌లకు ఆ అందమైన లోయలో... కలతల నేలలో.

పాఠాలు చెప్పడం ఇష్టం
శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో పుట్టి పెరిగిన మస్రత్‌ పదో క్లాస్‌ చదువుతున్నప్పటి నుంచి ఇరుగు పొరుగు పిల్లలకు ట్యూషన్‌ చెప్పేది. ‘నాకు పాఠాలు చెప్పడం ఇష్టం’ అంటుంది మస్రత్‌. ఇంటర్‌ చదువుతూ, డిగ్రీ చదువుతూ కూడా స్కూళ్లలో పార్ట్‌టైమ్‌ టీచర్‌గా పని చేసింది మస్రత్‌. క్లినికల్‌ సైకాలజీలో ఎం.ఎస్సీ చేసింది. అయితే 2019 అక్టోబర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో శ్రీనగర్‌లో స్కూళ్లు మూతపడ్డాయి.

ఆ సమయంలో పిల్లలు చదువుకు అంతరాయం కలగడం గమనించింది మస్రత్‌. ఆ వెంటనే 2020లో ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ ప్రతిబంధకాలు వచ్చాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినా ఆ క్లాసులు జరిగే సమయంలో పిల్లలు ఏ మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం తన సొంత కజిన్స్‌ చదువు కుంటుపడటం కూడా గమనించింది. ఒక్కోసారి ఉగ్రవాద చర్యల వల్ల కూడా స్కూళ్లు సరిగ్గా నడవవు. బడి దగ్గర పిల్లలు అనే భావన కంటే పిల్లల దగ్గరకే బడి అనే భావన సరైనదని మస్రత్‌ ఒక నిర్ణయానికి వచ్చింది.

ముగ్గురు టీచర్లు... 20 మంది పిల్లలు
విద్య గురు ముఖతా ఉండాలి... టీచర్‌ సమక్షం లో ఉంటూ టీచర్‌ను చూస్తూ నేర్చుకుంటే చదువు సరిగ్గా వస్తుందనేది మస్రత్‌కు తెలుసు. అందుకే స్కూల్‌ ఎలా నడిచినా హోమ్‌ ట్యూషన్లు పిల్లలకు మేలు చేస్తాయని భావించింది. తానొక్కతే అందరికీ చెప్పలేదు కనుక తన ఆధ్వర్యంలో పని చేసే టీమ్‌ ఉండాలనుకుంది. ఒక ముగ్గురు టీచర్లు దొరికితే 20 మంది పిల్లల ఖాతాలు దొరికితే చాలు అనుకుంది.

‘స్మార్ట్‌క్లాసెస్‌ హోమ్‌ ట్యూషన్స్‌’ పేరుతో సంస్థ ప్రారంభించి పత్రికల్లో, సోషల్‌ మీడియాలో యాడ్స్‌ ఇచ్చింది. చాలామంది అప్లికేషన్స్‌ పంపారు. కాని టీచింగ్‌కు ఎవరు పనికి వస్తారో కనిపెట్టడమే మస్రత్‌ విజయానికి కారణం. అలాంటి ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ట్యూషన్లు ఎవరికి చెప్పాలో తాను నిర్ణయించి పంపుతుంది. ఎంతమందికి చెప్తే ఆ మొత్తం నుంచి టీచరు, తాను షేర్‌ చేసుకుంటారు. అదీ ఒప్పందం. కాని వెంటనే స్పందన రాలేదు.

కొన్ని రోజులకు రవూఫ్‌ అనే యూరాలజిస్ట్‌ తన పిల్లలకు ట్యూషన్‌ చెప్పమని కోరాడు. మస్రత్‌ టీచర్‌ని పంపింది. పిల్లలు చదువుకుంటున్న పద్ధతికి ఆ డాక్టరు చాలా ఆనందించాడు. ఊళ్లో తనకు తెలిసిన కాంటాక్ట్స్‌ అందరికీ పదే పదే మస్రత్‌ టీమ్‌ గురించి చెప్పాడు. విద్యార్థులు పెరుగుతూ పోయారు. నేడు శ్రీనగర్‌ అంతా 200 మంది పిల్లలు మూలమూలన సాయంత్రమైతే దీపం వెలిగించి మస్రత్‌ పేరు తలుచుకుంటారు. ఎందుకంటే ట్యూషన్‌ మొదలయ్యేది అప్పుడే కదా. 80 మంది టీచర్లు మస్రత్‌ కింద పని చేస్తున్నారు.

50 వేల వరకూ జీతం
మస్రత్‌ చెప్పడం ‘నా ట్యూషన్ల వల్ల 98 శాతం మార్కులు గ్యారంటీ’ అని. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ పిల్లలకు అలాగే మార్కులు వస్తున్నాయి. క్లాసును బట్టి ఫీజు నిర్ణయించడం వల్ల ఒక టీచరు చెప్పగలిగినన్ని ట్యూషన్లు చెప్పే స్వేచ్ఛ ఉండటం వల్ల తన దగ్గర పని చేస్తున్నవారిలో కొందరు నెలకు 50 వేలు (ఆమె వంతు షేర్‌ పోను) సంపాదిస్తున్నారని మస్రత్‌ చెప్పింది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్‌డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి.

నేను అలాగే చేశాను’ అంటుంది మస్రత్‌. ఆమె ఇప్పుడు శ్రీనగర్‌లో రెండు కంప్యూటర్‌ సెంటర్లు నడుపుతోంది. త్వరలో స్కూల్‌ తెరవాలని అనుకుంటోంది. ఆమె చొరవ వల్ల ఒక వైపు చదువు, మరో వైపు ఉపాధి కలుగుతుండటంతో శ్రీనగర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ నిన్హా ఆమెను తాజాగా సత్కరించారు. అది మస్రత్‌కు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఆన్‌లైన్‌ ట్యూషన్లతో కొందరు సక్సెస్‌ అయ్యారు. నాకు ఆన్‌లైన్‌తో సంబంధమే లేదు. నా విధానం నేరుగా పిల్లలకు విద్యావిధానం’ అని చెబుతున్న మస్రత్‌ త్వరలో మరిన్ని విజయాలు సాధిస్తుంది. ఆమె సామర్థ్యం, ఆత్మవిశ్వాసం అలాంటిది.
 
‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్‌డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement