సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ రాష్ట్రపతికి రాసిన లేఖను ఉపంసహరించుకోవాలన్న డిమాండ్‌తో ఆప్ నేతల ప్రతినిధి బృందం బుధవారం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసింది. అసెంబ్లీని వెంటనే రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని వారు ఎల్జీని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను కొనడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి సంబంధించి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సీడీని కూడా వారు లెప్టినెంట్ గవర్నర్‌కు అందచేశారు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మనీష్ సిసోడియా, కుమార్ విశ్వాస్, ఆశుతోష్‌లతో కూడిన ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసింది.
ఎల్జీతో సమావేశం తరువాత ఆప్ నేత మనీష్ సిసోడియా విలేఖరులతో మాట్లాడారు. తాము స్టింగ్ ఆపరేషన్ సీడీని ఎల్జీకి ఇచ్చి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానించరాదని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 4న రాష్ట్రపతికి రాసిన లేఖను ఉపసంహరించుకోవలసిందిగా తాము ఎల్జీని కోరినట్లు ఆయన చెప్పారు. ఎల్జీ తమ విజ్ఞప్తిని పాటిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవసరమైతే రాష్ట్రపతికి కూడా స్టింగ్ ఆపరేషన్ సీడీని అందచేస్తామని సిసోడియా చెప్పారు.
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తోందని మనీష్ సిసోడియా మరోమారు ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఢిల్లీ సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి ప్రభుత్వం ఢిల్లీవాసులకు భారంగా మారుతుందని, ఈ పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటుచేయడం వారిని మోసగించడమేనని సిసోడియా చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావడం ఇక అసాధ్యమని ఆయన ఆ తరువాత ట్వీట్ చేశారు.
బీజేపీని ఆహ్వానించవద్దు
Published Wed, Sep 10 2014 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement