మంచి అధికారుల కోసం అన్వేషణ | Arvind Kejriwal may announce power tariff cut, meets Chief Secretary | Sakshi
Sakshi News home page

మంచి అధికారుల కోసం అన్వేషణ

Published Tue, Dec 24 2013 11:34 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

Arvind Kejriwal may announce power tariff cut, meets Chief Secretary

 సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో సామాన్యుడికి దగ్గైరె  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ తన ప్రభుత్వంలో కీలక పదవులను మచ్చలేని అధికారులకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. వీలైనంత తక్కువ సమయంలో తమ హామీలను నెరవేర్చడానికి సమర్థులైన అధికారులను నియమించాలని అనుకుంటున్నారు. తమ ప్రభుత్వంలో పనిచేసేందుకు చురుకైన అధికారులు కావాలని, అలాంటి వారు ముందుకు రావాలని ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. సమర్థులకు ప్రముఖ విభాగాలను అప్పగించాలన్న ఉద్దేశంతో చక్కటి రికార్డు గల అధికారుల కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు. వారితో కలిసి మార్గదర్శక ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. 
 
 ఢిల్లీ ప్రధాన కార్యదర్శి డి.ఎం. స్పోలియాను ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న కేజ్రీవాల్ మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రాజేంద్ర కుమార్‌తోనూ భేటీ అయ్యారు. కరెంటు చార్జీలను 50 శాతానికి తగ్గిస్తామన్న తమ ఎన్నికల హామీని నెరవేర్చడానికి రాజేంద్ర కుమార్ సేవలను కేజ్రీవాల్ ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. కుమార్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజేంద్ర కుమార్ గతంలో విద్యుత్‌శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు. డిస్కమ్‌ల ఆడిటింగ్ కోసం ఆదేశాలు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ విద్యుత్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి.
 
 ఐఐటీలో చదివిన కేజ్రీవాల్, ఆప్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అక్కడ తనతోపాటు చదివి ఐఏఎస్ అధికారులుగా మారిన వారికి కీలక విభాగాలను అప్పగించవచ్చని అంటున్నారు. రాజేంద్ర కుమార్ రూర్కీ ఐఐటీలో విద్యాభ్యాసం చేశారు. ఆయన 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, ఐఐటీ కాన్పూర్‌లో చదివిన ఐఏఎస్ అధికారులు పునీత్ గోయల్, మనీష్ గుప్తాకు కూడా కేజ్రీవాల్ సర్కారులో కీలక పదవులు దక్కవచ్చు. గోయల్ ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్నారు. మనీష్‌గుప్తా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన సంజీవ్‌కుమార్‌కు కూడా కీలకశాఖ అప్పగించే అవకాశముంది. ఇప్పుడాయన మహిళ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. 
 
 అతి పిన్న వయసున్న సీఎం
 సాక్షి, న్యూఢిల్లీ: కేవలం 44 సంవత్సరాలున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అతి పిన్న వయసులో అధిష్టించిన వ్యక్తి కానున్నారు. షీలా దీక్షిత్ 60 సంవత్సరాల వయసులో, సుష్మాస్వరాజ్ 47 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా 57 ఏళ్లకు గద్దెనెక్కారు. సాహిబ్ సింగ్ వర్మ 56 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యా రు. కేజ్రీవాల్ ఢిల్లీకి ఏడో ముఖ్యమంత్రి కానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement