సాక్షి, న్యూఢిల్లీ: సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితికి చేరిన తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎమ్సీడీ)ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయబోతున్నారని సమాచారం. నిర్వహణలో వైఫల్యం కారణంగా ఉత్తర, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక లోటులో కూరుకుపోయాయని ఆరోపిస్తూ ఆయన లేఖ రాయనున్నట్లు ఓ అధికారి తెలియజేశారు. సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయని, దీంతో వారు వేతనాల కోసం సమ్మెకు దిగారని అనే విషయాన్ని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ సర్కారు ఎమ్సీడీలకు బకాయిలను చెల్లించడం లేదన్న వార్తల్లో సత్యం లేదని సిసోడియా అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లకు చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని చెప్పారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అందువల్లే ఆ కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంలో పడి సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితికి చేరిందన్నారు. ‘తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి నెలా వేతనాల కింద 55 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.
అయితే సిబ్బందేమో మూడు నెలలుగా వేతనాలు రావట్లేదని అంటున్నారు. మూడు నెలలుగా సిబ్బందికి వేతనాల కింద చెల్లించవలసిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయి. బీజేపీకి ఎమ్సీడీని నిర్వహించడం చేతకాకుంటే దానిని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలి. తాము కార్పొరేషన్‌ను లాభాల బాట నడిపించి చూపిస్తాం’ అని మనీశ్ సిసోడియా అన్నారు. తూర్పు ఎమ్సీడీని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ లేఖ రాసే విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు.
తూర్పు ఎమ్సీడీని ప్రభుత్వానికి అప్పగించండి
Published Wed, Apr 1 2015 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement
Advertisement