రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో త్వరలోనే తమ శాసనసభా పక్ష నాయకుణ్ని నియమిస్తామని
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో త్వరలోనే తమ శాసనసభా పక్ష నాయకుణ్ని నియమిస్తామని ఈ పార్టీ ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని తెలిపింది. ఎల్జీ నుంచి ఇంత వరకు తమకు ఆహ్వానం అందలేదని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ శనివారం విలేరులతో అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అనుకూల పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు. సర్కారు ఏర్పాటుపై తమ ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న మాట నిజమేనని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామన్నారు.
గతంలో సభాపక్ష నేతగా వ్యవహరించిన ఎమ్మెల్యే డాక్టర్ హర్షవర్ధన్ ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్‌చార్జ్ షకీల్ అహ్మద్ ఈ విషయమై శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆప్, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ తన 50 రోజుల పాలనలో అన్నింటా విఫలమైనందున, తాజాగా ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ జడుస్తోందని ఆరోపించారు. ఆప్ కూడా ఎన్నికలకు సిద్ధంగా లేదన్నారు.