ఢిల్లీ లొల్లి కోర్టు మెట్లెక్కింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలిస్తూ, కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ను ...
హైకోర్టులో ఆప్ సర్కారు.. సుప్రీంలో కేంద్రం పిటిషన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ లొల్లి కోర్టు మెట్లెక్కింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలిస్తూ, కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఢిల్లీ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేసింది. మరోవైపు కేంద్ర పరిధిలోని అధికారుల పట్ల అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకోజాలదన్న నోటిఫికేషన్ జారీని అనుమానించాల్సి(సస్పెక్ట్) వస్తోందంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో సస్పెక్ట్ అన్న పదాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
ఈ రెండు పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. హైకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయం లెప్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య సమీకరణాన్ని పూర్తిగా అనిశ్చితిలో పడేసిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మరోపక్క లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ గురువారం హోం శాఖ కార్యదర్శి ఎల్.సి. గోయల్‌ను కలిశారు.