Ladies Special
-
హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. లేడీస్ స్పెషల్ ట్రిప్‌లో భాగంగా.. లేడీస్ స్పెషల్ బస్సులను మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ క్రమంలో.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. లేడీస్ స్పెషల్ బస్సును ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్ మీదుగా కొండాపూర్‌కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇదిలా ఉంటే.. నగరంలో మహిళల ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు. గతంలోనూ ఆర్డినరీ బస్సులు సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో తిరుగుతుండేవి. కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. నగరవాసులు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అదే సమయంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయానికి బాగా గండికొట్టింది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో నగరవాసులు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రకరకాల స్కీమ్‌ల్ని తీసుకొస్తున్నారు. మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023 -
ఇండస్ట్రీ కళకళ.. లేడీస్ స్పెషల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘లేడీస్ స్పెషల్’ అంటూ కొత్త పోస్టర్స్‌తో ఇండస్ట్రీ కళకళలాడింది. ఆయా చిత్రబృందాలు వారి సినిమాల్లోని కథానాయికల పో స్టర్స్ను రిలీజ్ చేశాయి. ఆ పో స్టర్స్ పై ఓ లుక్ వేయండి. ఫారిన్ అన్విత ఫారిన్ వీధుల్లో ఎంచక్కా హ్యాపీగా వాక్ చేస్తున్నారు మిస్ అన్వితా రవళి శెట్టి. ఆమె సంతోషానికి గల కారణాలను వేసవిలో థియేటర్స్‌లో చూడాల్సిందే. అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. అన్వి త కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శకుంతల ప్రేమ ప్రముఖ కవి కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపోందిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సమంత కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే బుధవారం నుంచి సమంత ‘ఖుషి’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి చేరువలో.. ఉమెన్స్ డే రోజున ‘మ్యాన్’ సినిమాను అనౌన్స్ చేశారు హన్సిక. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపోందు తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మద్రాస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇగోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘వేటాడాలి. లేకపో తే మరొకరు మనల్ని వేటాడతారు. ఒక నిజానికి మనం దగ్గరవుతున్నామంటే అర్థం ప్రమాదానికి కూడా చేరువ అవుతున్నట్లే లెక్క’’ అని ఈ సినిమా గురించి పేర్కొన్నారు హన్సిక. మిస్ భైరవి ‘రామబాణం’ కోసం భైరవిలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు డింపుల్ హయతి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపోందుతున్న ‘రామబాణం’లో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పో స్టర్‌ను రిలీజ్ చేసి, భైరవి పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొ ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. గీత సాక్షిగా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపోందిన చిత్రం ‘గీత సాక్షిగా’. లాయర్ పాత్రలో చిత్రా శుక్లా నటించిన ఈ చిత్రకథ మరో తార చరిష్మా చుట్టూ తిరుగుతుంది. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా రూపోందిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి చిత్రా శుక్లా లుక్‌ని రిలీజ్ చేశారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించారు. చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించారు. ఇవే కాదు.. మహిళా దినోత్సవానికి మరికొందరు తారల కొత్త పో స్టర్స్ కూడా విడుదలయ్యాయి. -
లేడీస్ స్పెషల్ మార్కెట్
మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో...మహిళలే నిర్వహించే స్పెషల్ మార్కెట్‌ను బుధవారం చందానగర్‌లో ప్రారంభిస్తున్నారు. దీన్ని పింక్మార్కెట్గా పిలుస్తారు. ఈ తరహా మార్కెట్ నగరంలోనే మొదటిదని అధికారులు పేర్కొన్నారు. పురుషులు ఇక్కడ వస్తువులు కొనొచ్చు కానీ...విక్రయించొద్దు. మహిళల కోసమే ప్రత్యేక టాయిలెట్లు, ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలి: మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను..మహిళలే విక్రయించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ మార్కెట్‌ను బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్స్‌పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీలో స్వయం ఉపాధి గ్రూపుల ఉత్పత్తులను ఈ పింక్ మార్కెట్లో విక్రయిస్తారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్ బస్టాప్ సమీపంలో ప్రధాన రహదారి వెంట దీన్ని నెలకొల్పారు. స్వయం ఉపాధి గ్రూపులకు చేయూతనిచ్చేందుకు ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశామని వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. ప్రత్యేకతలు... స్వయం ఉపాధి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మాత్రమే పింక్ మార్కెట్లో విక్రయిస్తారు. ఈ మార్కెట్‌ను గ్రూపు మహిళలు నిర్వహిస్తారు. గ్రూపుల మహిళలు ఉత్పత్తి చేసిన జూట్ బ్యాగ్స్, ఇస్తార్లు, మిల్లెట్స్, తినుబండారాలు, సబ్బులు, షాంపూలు, రీసైక్లింగ్ టైల్స్, బోర్డ్స్, పాత జీన్స్‌తో చేసి బ్యాగ్‌లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మహిళలు నిర్వహించే ఈ పింక్మార్కెట్లో పురుషులు కూడా కొనుగోలు చేయవచ్చు. పింక్ టాయిలెట్లు ... పింక్ మార్కెట్లోనే ఓ పక్క మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్లను మహిళలు మాత్రమే ఉపయోగించుకోవాలి. రద్దీగా ఉండే చందానగర్‌లో ఈ టాయిలెట్లు మహిళలకు సౌకర్యవంతంగా ఉండనున్నాయి. జీహెచ్ఎంసీలో మొదటిది... జీహెచ్ఎంసీ పరిధిలో మొదటిసారిగా చందానగర్‌లో పింక్ మార్కెట్‌ను నెలకొల్పాం. స్వయం ఉపాధి గ్రూపుల ఆర్థిక స్వాలంబన కోసం ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. ఇక్కడ లభించే స్పందన చూసి మరికొన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్తాం. రద్దీ ప్రాంతాలలో టాయిలెట్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కామన్ టాయిలెట్లకు వెళ్లేందుకు మహిళలు ఇష్టపడకపోవడంతో వారి కోసం ప్రత్యేక టాయిలెట్లు పింక్ మార్కెట్లో ఏర్పాటు చేశాం. – హరిచందన,వెస్ట్ జోనల్ కమిషనర్ -
లేడీస్ స్పెషల్
-
మెట్రోలో లేడీస్ స్పెషల్
సాక్షి, బెంగళూరు: ట్రాఫిక్ పద్మవ్యూహంతో కూడిన బెంగళూరు నగరంలో మెట్రో రైల్ నిత్యం వేల మంది ప్రజలను సకాలంలో గమ్యం చేరుస్తోంది. మూడు బోగీలు మాత్రమే ఉన్న మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా బోగీలు లేకపోవడంతో కిక్కిరిసిన బోగీల్లో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మెట్రో రైళ్లల్లో మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలంటూ గతకొద్ది కాలంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మెట్రో సంస్థ బీఎంఆర్సీఎల్ ఒక్కో మెట్రో రైలుకు మహిళల కోసం అదనంగా ఒక బోగీని అమర్చాలని నిర్ణయించింది. అదనపు బోగీల్లో ఒకటి కేటాయింపు కొత్త మెట్రో బోగీల నిర్మాణం, అనుసంధాన ప్రక్రియను బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మూడు బోగీల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా ప్రయోగాత్మకంగా ఒక రైలుకు అమర్చి పరీక్షించనున్నారు. వీటిì పనితీరు, మహిళల స్పందన పరిశీలించిన అనంతరం ఈ ప్రయోగం విజయవంతమైతే జూన్ నెల నుంచి అన్ని రైళ్లకు అదనంగా మూడు బోగీలను అమర్చడానికి బీఎంఆర్సీఎల్ నిర్ణయించుకుంది. అందులో ఒక బోగీ మహిళలకే ప్రత్యేకంగా కేటాయిస్తారు. రెండు రోజులు క్రితం బీఎంఆర్సీఎల్ ఎండీ మహేంద్ర జైన్ బీహెచ్ఈఎల్ సంస్థకు వెళ్లి ప్రస్తుతం తుది దశలోనున్న మెట్రో బోగీలను పరిశీలించారు. విమానాశ్రయ మార్గంలో వినూత్న వసతులు నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో ద్వారా ఎయిర్‌పోర్టు చేరుకునే ప్రయాణికులకు నమ్మ మెట్రో అనేక ప్రయోజనాలు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎయిర్పోర్ట్ నిర్వాహకుల నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి మెట్రోలోనే చెక్ ఇన్ సదుపాయం కల్పించనున్నారు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. ఇక విమానాల రాకపోకల సమయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే డిజిటల్ డిస్ప్లే కూడా అందుబాటులోకి రానుంది. అదనపు లగేజీని రవాణాకు ప్రత్యేక బోగి ఏర్పాటు చేసే ఆలోచన కూడా నమ్మమెట్రో వద్ద ఉంది. దీని వల్ల విమానయానం చేయాలనుకునే వారు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తారని తద్వారా సంస్థకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమని అధికారులు భావిస్తున్నారు. జనవరి చివర్లో బోగీలు వస్తాయి ‘జనవరి నెలాఖరునాటికి బోగీలను అందించనున్నట్లు బీహెచ్ఈఎల్ సంస్థ తెలిపింది. బోగీలు అందిన వెంటనే మెట్రోరైలుకు అమర్చి రెండు నెలల పాటు బోగీల పనితీరు, మహిళల నుంచి స్పందన పరిశీలిస్తాం. తరువాత వీలైనంత త్వరగా మిగిలిన అన్ని రైళ్లకు అదనపు బోగీలను అమర్చుతాం’ –మహేంద్ర జైన్, బీఎంఆర్సీఎల్ ఎండీ -
హంసనాదమో పిలుపో...
ఖాళీ సమయంలో ఏవో ఒక ట్యూన్లు చేసుకోవడం నాకు అలవాటు. ఆ విధంగా హంసనాదం రాగంలో నేను ట్యూన్ చేసి పెట్టుకున్నాను. ఆ రాగంలో తెలుగు సినిమాలలో చాలా చాలా తక్కువ పాటలు ఉన్నాయి. జంధ్యాలగారు లేడీస్ స్పెషల్ సినిమా తీస్తున్న సమయంలో నన్ను ఆ చిత్రానికి సంగీతం స్వరపరచమన్నారు. అప్పటికి పాటలు ఇంకా సిద్ధం కాలేదు. ఏదైనా ట్యూన్ వినిపించమని అడిగారు నన్ను. నా దగ్గర హంసనాదం రాగంలో ఒక ట్యూన్ సిద్ధంగా ఉందని చెప్పి, వినిపించాను. ఆయన వెంటనే అంగీకరించారు. వేటూరిగారిని పిలిచి ట్యూన్ వినిపించారు. ఈ ట్యూన్ వినగానే, రెండు గంటల్లో ‘హంసనాదమో పిలుపో’పాట రాసి ఇచ్చేశారు. ‘హంసనాదం’ రాగం పేరుతోనే పాట ప్రారంభించారు. త్యాగరాజు ఈ రాగంలో ‘బంటురీతి కొలువియ్యవయ్య రామా’ కీర్తన రచించాడు. అందుకే ఈ పాటలో కూడా ఎక్కడో ఒకచోట ఆ పదాలు వచ్చేలా చూడమని వేటూరి గారు నాకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే పాటలో ఒకచోట ‘బంటురీతి కొలువీయవయ్య రామా’ అని పాడించాను. హంస చేసే నాదం ఎంతో లాలనగా, ప్రేమగా, మృదువుగా ఉంటుంది. ప్రేయసిని పిలిచే పిలుపులో ఆ లాలన ఉండాలి. అందుకే హంసనాదమో పిలుపో అన్నారు. సంసారం సుఖవీణ వీణ తొలి కీర్తన... సంసారమంటే వీణా నాదంలాగ మృదుమధురంగా ఉండాలన్నారు. నా ప్రాణహారాల విరులల్లనా... ప్రాణాలను పూలమాలికలా చేయడం అని చెప్పడం వేటూరిగారికే చెల్లుతుంది. కనులకే కదా స్వయంవరం... ఎంత అందమైన వాక్య విన్యాసం. కిసలయధ్వనే శ్రుతిలయలు... చిగురుటాకులు చేసే ధ్వనులు శృతిలయల వంటివి, సంసార జీవితం చిగురుటాకులు తొడుగుతున్నప్పుడే, దంపతులు శృతిలయలుగా కలిసిపోవాలి... అని వైవాహిక జీవితాన్ని నిర్వచించారు. గృహిణితో కదా ఇహంపరం... కలయికే సదా మనోహరం... అని గృహస్థాశ్రమాన్ని నిర్వచించారు. నాకు ఎంతో నచ్చిన పాట, నాకు మంచి పేరు తెచ్చిన పాట, పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న పాట ఇది. – సంభాషణ: డా. వైజయంతి -
8న లేడీస్ స్పెషల్
♦ మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా ♦ విమెన్ స్పెషల్ స్లాట్లు అందుబాటులోకి తెచ్చిన ఆర్టీఏ సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అద్భుతమైన విజయాలను సాధిస్తున్న మహిళలు డ్రైవింగ్‌లో మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇప్పటికీ డ్రైవింగ్ విషయంలో ఇతరులపైనే ఆధారపడి ఉన్నారు. డ్రైవింగ్‌లో అనుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ లైసెన్స్ తీసుకునే విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 20,62,541 మంది మగవారు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉంటే మహిళలు 1,23,437 మంది మాత్రమే ఉన్నారు. సొంతంగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లేందుకు, స్లాట్ నమోదు చేసుకొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ‘మహిళా డ్రైవింగ్ లైసెన్స్ మేళా’కు శ్రీకారం చుట్టింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలకు లెర్నింగ్ లైసెన్సులు అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్లాట్ నమోదు చేసుకోవచ్చు... మార్చి 8న సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్‌పేట్, మెహదీ పట్నం, బహదూర్‌పురా ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలు మాత్రమే లెర్నింగ్ లైసెన్సు తీసుకొనేలా స్లాట్స్ (సమయం+ తేదీ) ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ కేంద్రాల్లో మహిళా ఎంవీఐలు, మహిళా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి లెర్నింగ్ లైసెన్సులకు హాజరయ్యే మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కార్యాలయాలు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్, కూకట్పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్లాట్స్ అందుబాటులో లేనప్పటికీ ఆ రోజు లెర్నింగ్ లైసెన్సుతో పాటు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. -
సిటీ బస్సుల్లో గ్రిల్స్
మహిళా ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీ దృష్టి సికింద్రాబాద్-కోఠి మార్గంలో లేడీస్ స్పెషల్ మహిళా భద్రతా కమిటీ సూచనల అమలు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డు పెట్టే దిశగా సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా సిటీ బస్సుల్లో పురుషులు, మహిళలకు మధ్య గ్రిల్స్ ఏర్పాటు చేయనుంది. మహిళల భద్రత కోసం ఏర్పాటైన పూనం మాలకొండయ్య కమిటీ సిఫార్సుల మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో సికింద్రాబాద్-అఫ్జల్‌గంజ్ మధ్య నడిచే 8ఎ రూట్లోని 11 బస్సుల్లో ప్రత్యేకంగా గ్రిల్స్ ఏర్పాటు చే యనున్నారు. సాధారణంగా పురుషులు, యువకులు వెనుక నుంచి బస్సులోకి ఎక్కినప్పటికీ... బాగా ముందుకు చొచ్చుకు వెళ్లడం, కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగామహిళా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి నిరోధించేందుకు గ్రిల్స్ ఉపకరిస్తాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి 8ఎ రూట్లోని బస్సులలో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ బస్సుల్లోని అనుభవాలను పరిగణనలోకి తీసుకొని నగరంలోని మిగతా రూట్లకు విస్తరిస్తారు. దశల వారీగా గ్రేటర్‌లోని 1,050 రూట్లలో, 3,850 బస్సులలో గ్రిల్స్ అందుబాటులోకి తీసుకు రానున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. లేడీస్ స్పెషల్ బస్సుల పెంపు సికింద్రాబాద్ నుంచి కోఠి మధ్య రాకపోకలు సాగించే 86 నెంబర్ రూట్లో 8 లేడీస్ స్పెషల్ బస్సులను కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్ర వేళల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి రాంనగర్, వీఎస్టీ, నారాయణగూడ మార్గంలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం గ్రేటర్‌లోని వివిధ రూట్లలో సుమారు 65 లేడీస్ స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే మహిళా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ నుంచి సెక్రెటేరియట్‌కు, దిల్సుఖ్నగర్ నుంచి నాంపల్లికి, కుషాయిగూడ, ఈసీఐఎల్ నుంచి లకిడీకాఫూల్, సెక్రెటేరియట్ మార్గాల్లో, సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్ మీదుగా ఖైరతాబాద్ వరకు, సికింద్రాబాద్-మెహదీపట్నం, సికింద్రాబాద్, కోఠి వంటి ప్రధాన రూట్ల నుంచి హైటెక్ సిటీ వరకు లేడీస్ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులకు మహిళా ప్రయాణికుల స్పందన కూడా అనూహ్యంగా ఉంది. ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న 86 రూట్‌తో పాటు, మరిన్ని రూట్లకు కూడా లేడీస్ స్పెషల్ బస్సులను విస్తరించే అవకాశం ఉంది. -
హ్యాపీ హ్యాపీగా.. లేడీస్ స్పెషల్
లేడీస్ స్పెషల్.. ఫలక్‌నుమా టు లింగంపల్లి ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు కాదు ఎక్కే రైలు ఇంకో జీవితానికి రూటు! అదో మినీ లోకం.. ఎంత దగ్గరి ప్రయాణమైనాసరే దూరంగా ఉన్న ప్రపంచానికి కిటికీ తెరుస్తోంది. మెట్రోసిటీల్లోని బిజీ జీవితాల్లో లేని తీరికను ఈ జర్నీ చెంతచేరుస్తోంది. హైదరాబాద్‌లో ఈ బాధ్యతను ఎమ్ఎమ్టీఎస్ మోసుకొని తిరుగుతోంది. లేడీస్ కోసం స్పెషల్‌గా మాతృభూమి అనే పేరుపెట్టుకొని మరీ సర్వీస్ ఇస్తోంది. ఆ ట్రావెలింగ్ గురించే ఈ స్టోరీ.. లోకల్ ట్రైన్లో జర్నీ అంటే జనాలు బాగా కనెక్ట్ అయ్యేది ముంబైలోనే! అక్కడి ఏ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి కిందకు చూసినా సరే.. ప్లాట్‌ఫాం మీద ఆగిన లోకల్ ట్రైన్ ద్వారాలు లిప్త పాటులో కొన్ని వందల మందిని అక్కున చేర్చుకుంటాయి.. కొన్ని వందల మందిని తమ ఒళ్లోంచి దింపేస్తుంటాయి. వేగమే తప్ప లొల్లిలేని ఈ క్రమం గొప్ప జీవన సత్యాన్ని చెప్పకుండా చూపిస్తుంది. అందుకేనేమో కేవలం ఈ ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ ఆధారంగా ముంబై లైఫ్ స్టైల్‌ను 60 సెకన్లలో అవగతం చేసిన షార్ట్ ఫిల్మ్స్ అనేకం చాలా మందికి ఫేవరేట్స్‌గా నిలిచాయి. కోసుల దూరాన్ని ఉదయం ఆరిటింకే మొదలుపెట్టి.. కంపార్ట్మెంట్లను కూరలు తరుక్కునే వంట గదులుగా.. ఉప్పోసను వెళ్లగక్కుకొనే ఫ్రెండ్షిప్ సెంటర్స్‌గా.. కూరగాయలు దొరికే అంగడిగా.. రబ్బరు గాజులు, రిబ్బన్ పూలు అమ్మే ఫ్యాన్సీ స్టోర్స్‌గా.. ఒక్కటేంటి సమస్తం అందుబాటులోకి తెచ్చి ఆ రద్దీలోనే బతుకు మెళకువలు నేర్పి సాయంత్రం ఆరు గంటలకల్లా ఆ ప్రయాణాన్ని ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిల్చి ఇంటికి చేరుస్తుంది. ఇది ముంబై లోకల్‌ట్రైన్ విండో మనకు చూపించే అక్కడి జీవన చిత్రం! హైదరాబాద్ సిటీ వేగాన్ని కూడా మెల్లమెల్లగా ఎమ్ఎమ్టీఎస్.. రానున్న మెట్రోరైల్‌తో కలసి సౌకర్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది. దీనికి మూవింగ్ ఎగ్జాంపుల్ ‘మాతృభూమి’ లేడీస్ స్పెషల్! ఫలక్‌నుమా టు లింగంపల్లి నాలుగేళ్ల కిందట అచ్చంగా ఆడవాళ్ల కోసమే మొదలైన ఈ ఎమ్ఎమ్టీఎస్ సర్వీస్.. ఫలక్‌నుమాలో ఉదయం 8.30 గంటలకు తొలికూత పెడుతుంది. వయా ఉప్పుగూడ, మలక్‌పేట, కాచిగూడ, సికింద్రాబాద్, హైటెక్ సిటీ.. గమ్య స్థానం లింగంపల్లి చేరే వరకు తొమ్మిదిన్నరవుతుంది. ప్రయాణం గంటే అయినా తోటివారితో పెనవేసుకునే ఆత్మీయానుబంధాలు జీవిత కాలం మిగిలిపోతాయి. గీతమ్స్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదివే సాయిప్రియ ఫలక్‌నుమాలో ఉంటున్న తన తండ్రిని చూడాలనుకున్నప్పుడల్లా ఈ మాతృభూమి లేడీస్ స్పెషలే ఎక్కుతుంది. ‘ఎవ్రీ వీకెండ్ మా డాడీని చూడటానికి ఫలక్‌నుమా వస్తుంటా. శనివారం సాయంత్రం కాలేజ్ అయిపోగానే మాతృభూమి క్యాచ్ చేస్తా. మళ్లీ సోమవారం ఉదయం ఇదే ట్రైన్ పట్టుకొని రిటర్న్ అవుతా. ఫలక్‌నుమా నుంచి నా డెస్టినేషన్ వెళ్లడానికి చాలా ఎమ్ఎమ్టీఎస్ సర్వీసులు ఉన్నాయి. కానీ మగవాళ్ల తోపులాటల మధ్య ఆ ట్రైన్స్ ఎక్కడం నరకం. వాటిల్లో లేడీస్ కంపార్ట్మెంట్స్ ఉన్నా అందులోకీ మగవాళ్లు జొరబడ్తారు. అందుకే పీక్ అవర్స్‌లో ఈ లేడీస్ స్పెషల్ చాలా రష్‌గా ఉన్నా దీనినే ప్రిఫర్ చేస్తా. బోగీకో లేడీకానిస్టేబుల్ ఎస్కార్ట్‌గా ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా డెస్టినేషన్ చేరుతాం. ఈ రోజుల్లో లేడీస్‌కి అత్యంత అవసరం ఈ భద్రతే కదా! అందరూ లేడీసే ఉంటారు కాబట్టి హడావుడిలో ఏ బోగీ ఎక్కినా భయం ఉండదు. అంతేకాదు నేను ఫ్రీక్వెంట్‌గా చేసే ఈ జర్నీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. డియరెస్ట్ వన్స్గా మారినవారూ ఉన్నారు’ అని చెప్పింది మాతృభూమి ప్రయాణం గురించి. వర్కింగ్ విమెన్ శాతం పెరుగుతుంది కాబట్టి ఈ లేడీస్ స్పెషల్ ట్రైన్ సంఖ్య పెంచితే బాగుంటుందని ఆ అమ్మాయి అభిప్రాయం. ఇంట్లో ఉన్నట్టే ఉంటది.. అలివేలు అనే ఓ అమ్మ రోజూ ఫలక్‌నుమా నుంచి కాచిగూడకు వెళ్తుంది. అక్కడ ఓ మర్వాడీ ఇంట్లో వంటచేస్తుంటుంది. ఆమె తన ప్రయాణంలో భద్రత కోసం ఈ మాతృభూమినే ఎంచుకుంది. కారణం.. ‘అందరూ ఆడోళ్లుండే ఈ రైల్లో నిమ్మళంగా పోవచ్చు. మీదికెళ్లి పోలీసులు కూడా ఉంటరు.. మొగోళ్లను ఎక్కనియ్యకుండ స్ట్రిక్టుగుంటరు. ఏ డబ్బాల ఎక్కినా మనింట్ల ఉన్నట్టే ఉంటది నాకైతే. సాయంత్రం కొలువు నుంచి వచ్చేటప్పుడైతే ఈళ్లందరితో మాట్లాడితే పొద్దంత పడ్డ కష్టం తుడిచినట్టే పోతది’ అని చెప్తుంది. సేఫ్ అండ్ హ్యాపీ.. గాయత్రి అనే సాఫ్ట్వేర్ ప్రయాణికురాలిదీ ఇలాంటి అనుభూతే! ‘నేను యూజువల్‌గా మాతృభూమినే క్యాచ్ చేస్తా. ఇందులో జర్నీ సేఫే కాదు హ్యాపీ కూడా! ఉదయం చూడాలి.. భలే ఉంటుంది.. కొంత మంది లలితాసహస్ర నామాలు, విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తుంటారు.. కొంతమంది తమ మనసులో బాధనంతా పక్కవాళ్లతో వెళ్లబోసుకుంటుంటారు. మాలాంటి సాఫ్ట్వేర్స్ అయితే మా ల్యాప్‌టాప్‌తో టైమ్‌పాస్ చేస్తుంటాం. కొంతమంది పుస్తకాలు చదువుకుంటారు. ఇందులో చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాం కదా.. ఈ ట్రైన్లో నాకు చాలామందే ఫ్రెండ్స్ ఉన్నారు. పొద్దున ఎనిమిదిన్నరకే ఎక్కుతాం కాబట్టి ట్రైన్లో అందరం కలిసి టిఫిన్ షేర్ చేసుకుంటూ తింటాం. ఇలాంటి మంచి మంచి ఎక్స్‌పీరియెన్స్ ఎన్నో.. ఈ ట్రైన్లో’ అని లేడీస్ స్పెషల్ జర్నీని వివరించింది గాయత్రి. గమ్యం.. ఈ మాటల ప్రయాణం అంతలోకే లింగంపల్లి చేరుకుంది. ఈలోపు ఎన్నో మజిలీలు.. ఎందరో ప్రయాణికులు.. స్టూడెంట్స్.. వెజిటేబుల్ వెండర్స్... అత్తగారింట్లో ఉన్న బిడ్డను చూడ్డానికి వెళ్లే తల్లులు.. హాస్పిటల్లో ఉన్న బంధువులను పరామర్శించడానికి బయలుదేరిన శ్రేయోభిలాషులు.. వీళ్లందరినీ గమ్యం చేర్చేందుకు పట్టాల మీద అలుపులేని పరుగుతో మాతృభూమి. మాటలు కరువై పక్కనే ఉంటున్నా.. మనుషులు అలికిడి పట్టని నాగరీకులకు ఓ ఆత్మీయ వేదికగా సాగుతున్న ఈ ప్రయాణం శుభప్రదం కావాలి! -
లేడీస్ స్పెషల్‌గా ‘పెన్ ట్యాక్సీ’!
సాక్షి, చెన్నై : మహిళలకు భద్రత కల్పించే రీతిలో ఓ సంస్థ పెన్(మహిళ) ట్యాక్సీని ప్రవేశ పెట్టింది. తొలి విడతగా మూడు ట్యాక్సీలను రాజధాని నగరంలో రోడ్డెక్కించారు. ఈ ట్యాక్సీల్లో మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో పురుషులను మహిళలు అధిగమిస్తున్నా, ఈ సమాజంలో వారికి భద్రత మాత్రం లేదు. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా, శిక్షలు ఎంత కఠినం చేసినా, అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. అదే సమయంలో మహిళలకు భద్రత కల్పించే విధంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. రైళ్లల్లో ప్రత్యేక బోగీలను కేటాయించారు. బస్సుల్లో ప్రత్యేక సీట్లూ ఉన్నాయి. అయితే, ప్రైవేటు వాహనాల్లో మహిళల కోసం ప్రత్యేకత అన్నది మాత్రం లేదు. దీంతో కొందరి చర్యల కారణంగా ప్రైవేటు వ్యవస్థ మీద మచ్చ పడుతూ వస్తున్నది. కొందరు ప్రైవేటు వాహనదారులకు ఒంటరి మహిళలు చిక్కితే చాలు, వారి అఘాయిత్యానికి బలి కావాల్సిన దుస్థితి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ లేడీస్ స్పెషల్ అంటూ పెన్(మహిళ) ట్యాక్సీని ప్రవేశ పెట్టింది. పెన్ ట్యాక్సీ: మహిళ కోసం మహిళలు నడిపే ట్యాక్సీని ఆ సంస్థ ప్రవేశ పెట్టింది. నగర శివారుల్లోని ఐటీ తదితర సంస్థ ల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను, సుదూర ప్రాం తాల నుంచి వచ్చే ఒంటరి మహిళలను పరిగణనలోకి తీసుకుని ఈ ట్యాక్సీలను రోడ్డెక్కించారు. తొలి విడతగా గురువారం మూడు ట్యాక్సీలను ప్రవేశ పెట్టారు. షేర్ ఆటో తరహాలో ఈ ట్యాక్సీలు ఉన్నా, కేవలం మహిళలను మాత్రమే ఇందులో ఎక్కించుకుంటారు. ఉదయం నగరంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ దినకరన్, సినీ నటి రమ్య కృష్ణ ఈ ట్యాక్సీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ట్యాక్సీలకు లభించే ఆదరణ ఆధారంగా విస్తరించబోతున్నారు. ఈ ట్యాక్సీలను నడిపే అవకాశం తమకు రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ మహిళా డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఈ ట్యాక్సీల ద్వారా అటు డ్రైవర్లకు, ఇటు మహిళా ప్రయాణికులకు పూర్తి స్థాయిలో భద్రత దక్కుతుందన్న ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సురక్షితంగా ప్రయాణం చేయడానికి వీలుందని,త్వరలో తమ సంస్థ ద్వారా మహిళలకు పెద్ద సంఖ్యలో డ్రైవింగ్ శిక్షణను ఇచ్చి, ఈ ట్యాక్సీసేవల్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. -
లేడీస్ స్పెషల్