సాక్షి, బెంగళూరు: ట్రాఫిక్ పద్మవ్యూహంతో కూడిన బెంగళూరు నగరంలో మెట్రో రైల్ నిత్యం వేల మంది ప్రజలను సకాలంలో గమ్యం చేరుస్తోంది. మూడు బోగీలు మాత్రమే ఉన్న మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా బోగీలు లేకపోవడంతో కిక్కిరిసిన బోగీల్లో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మెట్రో రైళ్లల్లో మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలంటూ గతకొద్ది కాలంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మెట్రో సంస్థ బీఎంఆర్‌సీఎల్ ఒక్కో మెట్రో రైలుకు మహిళల కోసం అదనంగా ఒక బోగీని అమర్చాలని నిర్ణయించింది.
అదనపు బోగీల్లో ఒకటి కేటాయింపు
కొత్త మెట్రో బోగీల నిర్మాణం, అనుసంధాన ప్రక్రియను బీహెచ్‌ఈఎల్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మూడు బోగీల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా ప్రయోగాత్మకంగా ఒక రైలుకు అమర్చి పరీక్షించనున్నారు. వీటిì పనితీరు, మహిళల స్పందన పరిశీలించిన అనంతరం ఈ ప్రయోగం విజయవంతమైతే జూన్ నెల నుంచి అన్ని రైళ్లకు అదనంగా మూడు బోగీలను అమర్చడానికి బీఎంఆర్‌సీఎల్ నిర్ణయించుకుంది. అందులో ఒక బోగీ మహిళలకే ప్రత్యేకంగా కేటాయిస్తారు. రెండు రోజులు క్రితం బీఎంఆర్‌సీఎల్ ఎండీ మహేంద్ర జైన్ బీహెచ్‌ఈఎల్ సంస్థకు వెళ్లి ప్రస్తుతం తుది దశలోనున్న మెట్రో బోగీలను పరిశీలించారు.
విమానాశ్రయ మార్గంలో వినూత్న వసతులు
నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో ద్వారా ఎయిర్‌పోర్టు చేరుకునే ప్రయాణికులకు నమ్మ మెట్రో అనేక ప్రయోజనాలు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎయిర్‌పోర్ట్ నిర్వాహకుల నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి మెట్రోలోనే చెక్ ఇన్ సదుపాయం కల్పించనున్నారు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. ఇక విమానాల రాకపోకల సమయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే డిజిటల్ డిస్‌ప్లే కూడా అందుబాటులోకి రానుంది. అదనపు లగేజీని రవాణాకు ప్రత్యేక బోగి ఏర్పాటు చేసే ఆలోచన కూడా నమ్మమెట్రో వద్ద ఉంది. దీని వల్ల విమానయానం చేయాలనుకునే వారు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తారని తద్వారా సంస్థకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమని అధికారులు భావిస్తున్నారు.
జనవరి చివర్లో బోగీలు వస్తాయి
‘జనవరి నెలాఖరునాటికి బోగీలను అందించనున్నట్లు బీహెచ్‌ఈఎల్ సంస్థ తెలిపింది. బోగీలు అందిన వెంటనే మెట్రోరైలుకు అమర్చి రెండు నెలల పాటు బోగీల పనితీరు, మహిళల నుంచి స్పందన పరిశీలిస్తాం. తరువాత వీలైనంత త్వరగా మిగిలిన అన్ని రైళ్లకు అదనపు బోగీలను అమర్చుతాం’ –మహేంద్ర జైన్, బీఎంఆర్‌సీఎల్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment