సాక్షి, చెన్నై : మహిళలకు భద్రత కల్పించే రీతిలో ఓ సంస్థ పెన్(మహిళ) ట్యాక్సీని ప్రవేశ పెట్టింది. తొలి విడతగా మూడు ట్యాక్సీలను రాజధాని నగరంలో రోడ్డెక్కించారు. ఈ ట్యాక్సీల్లో మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో పురుషులను మహిళలు అధిగమిస్తున్నా, ఈ సమాజంలో వారికి భద్రత మాత్రం లేదు. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా, శిక్షలు ఎంత కఠినం చేసినా, అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు.
అదే సమయంలో మహిళలకు భద్రత కల్పించే విధంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. రైళ్లల్లో ప్రత్యేక బోగీలను కేటాయించారు. బస్సుల్లో ప్రత్యేక సీట్లూ ఉన్నాయి. అయితే, ప్రైవేటు వాహనాల్లో మహిళల కోసం ప్రత్యేకత అన్నది మాత్రం లేదు. దీంతో కొందరి చర్యల కారణంగా ప్రైవేటు వ్యవస్థ మీద మచ్చ పడుతూ వస్తున్నది. కొందరు ప్రైవేటు వాహనదారులకు ఒంటరి మహిళలు చిక్కితే చాలు, వారి అఘాయిత్యానికి బలి కావాల్సిన దుస్థితి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ లేడీస్ స్పెషల్ అంటూ పెన్(మహిళ) ట్యాక్సీని ప్రవేశ పెట్టింది.
పెన్ ట్యాక్సీ:
మహిళ కోసం మహిళలు నడిపే ట్యాక్సీని ఆ సంస్థ ప్రవేశ పెట్టింది. నగర శివారుల్లోని ఐటీ తదితర సంస్థ ల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను, సుదూర ప్రాం తాల నుంచి వచ్చే ఒంటరి మహిళలను పరిగణనలోకి తీసుకుని ఈ ట్యాక్సీలను రోడ్డెక్కించారు. తొలి విడతగా గురువారం మూడు ట్యాక్సీలను ప్రవేశ పెట్టారు. షేర్ ఆటో తరహాలో ఈ ట్యాక్సీలు ఉన్నా, కేవలం మహిళలను మాత్రమే ఇందులో ఎక్కించుకుంటారు. ఉదయం నగరంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ దినకరన్, సినీ నటి రమ్య కృష్ణ ఈ ట్యాక్సీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ ట్యాక్సీలకు లభించే ఆదరణ ఆధారంగా విస్తరించబోతున్నారు. ఈ ట్యాక్సీలను నడిపే అవకాశం తమకు రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ మహిళా డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఈ ట్యాక్సీల ద్వారా అటు డ్రైవర్లకు, ఇటు మహిళా ప్రయాణికులకు పూర్తి స్థాయిలో భద్రత దక్కుతుందన్న ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సురక్షితంగా ప్రయాణం చేయడానికి వీలుందని,త్వరలో తమ సంస్థ ద్వారా మహిళలకు పెద్ద సంఖ్యలో డ్రైవింగ్ శిక్షణను ఇచ్చి, ఈ ట్యాక్సీసేవల్ని మరింత విస్తృతం చేస్తామన్నారు.
లేడీస్ స్పెషల్‌గా ‘పెన్ ట్యాక్సీ’!
Published Thu, Jun 19 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM
Advertisement