సిటీ బస్సుల్లో గ్రిల్స్
- మహిళా ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీ దృష్టి
- సికింద్రాబాద్-కోఠి మార్గంలో లేడీస్ స్పెషల్
- మహిళా భద్రతా కమిటీ సూచనల అమలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డు పెట్టే దిశగా సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా సిటీ బస్సుల్లో పురుషులు, మహిళలకు మధ్య గ్రిల్స్ ఏర్పాటు చేయనుంది. మహిళల భద్రత కోసం ఏర్పాటైన పూనం మాలకొండయ్య కమిటీ సిఫార్సుల మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది.
ఈ క్రమంలో సికింద్రాబాద్-అఫ్జల్‌గంజ్ మధ్య నడిచే 8ఎ రూట్‌లోని 11 బస్సుల్లో ప్రత్యేకంగా గ్రిల్స్ ఏర్పాటు చే యనున్నారు. సాధారణంగా పురుషులు, యువకులు వెనుక నుంచి బస్సులోకి ఎక్కినప్పటికీ... బాగా ముందుకు చొచ్చుకు వెళ్లడం, కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగామహిళా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం వంటివి జరుగుతున్నాయి.
ఇలాంటివి నిరోధించేందుకు గ్రిల్స్ ఉపకరిస్తాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి 8ఎ రూట్‌లోని బస్సులలో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ బస్సుల్లోని అనుభవాలను పరిగణనలోకి తీసుకొని నగరంలోని మిగతా రూట్‌లకు విస్తరిస్తారు. దశల వారీగా గ్రేటర్‌లోని 1,050 రూట్‌లలో, 3,850 బస్సులలో గ్రిల్స్ అందుబాటులోకి తీసుకు రానున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
లేడీస్ స్పెషల్ బస్సుల పెంపు
సికింద్రాబాద్ నుంచి కోఠి మధ్య రాకపోకలు సాగించే 86 నెంబర్ రూట్‌లో 8 లేడీస్ స్పెషల్ బస్సులను కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్ర వేళల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి రాంనగర్, వీఎస్‌టీ, నారాయణగూడ మార్గంలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం గ్రేటర్‌లోని వివిధ రూట్లలో సుమారు 65 లేడీస్ స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే మహిళా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ నుంచి సెక్రెటేరియట్‌కు, దిల్‌సుఖ్‌నగర్ నుంచి నాంపల్లికి, కుషాయిగూడ, ఈసీఐఎల్ నుంచి లకిడీకాఫూల్, సెక్రెటేరియట్ మార్గాల్లో, సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్ మీదుగా ఖైరతాబాద్ వరకు, సికింద్రాబాద్-మెహదీపట్నం, సికింద్రాబాద్, కోఠి వంటి ప్రధాన రూట్‌ల నుంచి హైటెక్ సిటీ వరకు లేడీస్ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ బస్సులకు మహిళా ప్రయాణికుల స్పందన కూడా అనూహ్యంగా ఉంది. ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న 86 రూట్‌తో పాటు, మరిన్ని రూట్‌లకు కూడా లేడీస్ స్పెషల్ బస్సులను విస్తరించే అవకాశం ఉంది.