మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో...మహిళలే నిర్వహించే స్పెషల్ మార్కెట్‌ను బుధవారం చందానగర్‌లో ప్రారంభిస్తున్నారు. దీన్ని పింక్‌మార్కెట్‌గా పిలుస్తారు. ఈ తరహా మార్కెట్ నగరంలోనే మొదటిదని అధికారులు పేర్కొన్నారు. పురుషులు ఇక్కడ వస్తువులు కొనొచ్చు కానీ...విక్రయించొద్దు. మహిళల కోసమే ప్రత్యేక టాయిలెట్లు, ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
గచ్చిబౌలి: మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను..మహిళలే విక్రయించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ మార్కెట్‌ను బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్స్‌పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీలో స్వయం ఉపాధి గ్రూపుల ఉత్పత్తులను ఈ పింక్ మార్కెట్‌లో విక్రయిస్తారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్ బస్టాప్ సమీపంలో ప్రధాన రహదారి వెంట దీన్ని నెలకొల్పారు. స్వయం ఉపాధి గ్రూపులకు చేయూతనిచ్చేందుకు ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశామని వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు.
ప్రత్యేకతలు...
స్వయం ఉపాధి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మాత్రమే పింక్ మార్కెట్‌లో విక్రయిస్తారు. ఈ మార్కెట్‌ను గ్రూపు మహిళలు నిర్వహిస్తారు. గ్రూపుల మహిళలు ఉత్పత్తి చేసిన జూట్ బ్యాగ్స్, ఇస్తార్లు, మిల్లెట్స్, తినుబండారాలు, సబ్బులు, షాంపూలు, రీసైక్లింగ్ టైల్స్, బోర్డ్స్, పాత జీన్స్‌తో చేసి బ్యాగ్‌లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మహిళలు నిర్వహించే ఈ పింక్‌మార్కెట్‌లో పురుషులు కూడా కొనుగోలు చేయవచ్చు.
పింక్ టాయిలెట్లు ...
పింక్ మార్కెట్‌లోనే ఓ పక్క మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్లను మహిళలు మాత్రమే ఉపయోగించుకోవాలి. రద్దీగా ఉండే చందానగర్‌లో ఈ టాయిలెట్లు మహిళలకు సౌకర్యవంతంగా ఉండనున్నాయి.
జీహెచ్‌ఎంసీలో మొదటిది...
జీహెచ్‌ఎంసీ పరిధిలో మొదటిసారిగా చందానగర్‌లో పింక్ మార్కెట్‌ను నెలకొల్పాం. స్వయం ఉపాధి గ్రూపుల ఆర్థిక స్వాలంబన కోసం ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. ఇక్కడ లభించే స్పందన చూసి మరికొన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్తాం. రద్దీ ప్రాంతాలలో టాయిలెట్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కామన్ టాయిలెట్లకు వెళ్లేందుకు మహిళలు ఇష్టపడకపోవడంతో వారి కోసం ప్రత్యేక టాయిలెట్లు పింక్ మార్కెట్‌లో ఏర్పాటు చేశాం. – హరిచందన,వెస్ట్ జోనల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment