హంసనాదమో పిలుపో...
ఖాళీ సమయంలో ఏవో ఒక ట్యూన్లు చేసుకోవడం నాకు అలవాటు. ఆ విధంగా హంసనాదం రాగంలో నేను ట్యూన్ చేసి పెట్టుకున్నాను. ఆ రాగంలో తెలుగు సినిమాలలో చాలా చాలా తక్కువ పాటలు ఉన్నాయి. జంధ్యాలగారు లేడీస్ స్పెషల్ సినిమా తీస్తున్న సమయంలో నన్ను ఆ చిత్రానికి సంగీతం స్వరపరచమన్నారు. అప్పటికి పాటలు ఇంకా సిద్ధం కాలేదు. ఏదైనా ట్యూన్ వినిపించమని అడిగారు నన్ను. నా దగ్గర హంసనాదం రాగంలో ఒక ట్యూన్ సిద్ధంగా ఉందని చెప్పి, వినిపించాను.
ఆయన వెంటనే అంగీకరించారు. వేటూరిగారిని పిలిచి ట్యూన్ వినిపించారు. ఈ ట్యూన్ వినగానే, రెండు గంటల్లో ‘హంసనాదమో పిలుపో’పాట రాసి ఇచ్చేశారు. ‘హంసనాదం’ రాగం పేరుతోనే పాట ప్రారంభించారు. త్యాగరాజు ఈ రాగంలో ‘బంటురీతి కొలువియ్యవయ్య రామా’ కీర్తన రచించాడు. అందుకే ఈ పాటలో కూడా ఎక్కడో ఒకచోట ఆ పదాలు వచ్చేలా చూడమని వేటూరి గారు నాకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే పాటలో ఒకచోట ‘బంటురీతి కొలువీయవయ్య రామా’ అని పాడించాను.
హంస చేసే నాదం ఎంతో లాలనగా, ప్రేమగా, మృదువుగా ఉంటుంది. ప్రేయసిని పిలిచే పిలుపులో ఆ లాలన ఉండాలి. అందుకే హంసనాదమో పిలుపో అన్నారు. సంసారం సుఖవీణ వీణ తొలి కీర్తన... సంసారమంటే వీణా నాదంలాగ మృదుమధురంగా ఉండాలన్నారు. నా ప్రాణహారాల విరులల్లనా... ప్రాణాలను పూలమాలికలా చేయడం అని చెప్పడం వేటూరిగారికే చెల్లుతుంది. కనులకే కదా స్వయంవరం... ఎంత అందమైన వాక్య విన్యాసం.
కిసలయధ్వనే శ్రుతిలయలు... చిగురుటాకులు చేసే ధ్వనులు శృతిలయల వంటివి, సంసార జీవితం చిగురుటాకులు తొడుగుతున్నప్పుడే, దంపతులు శృతిలయలుగా కలిసిపోవాలి... అని వైవాహిక జీవితాన్ని నిర్వచించారు. గృహిణితో కదా ఇహంపరం... కలయికే సదా మనోహరం... అని గృహస్థాశ్రమాన్ని నిర్వచించారు. నాకు ఎంతో నచ్చిన పాట, నాకు మంచి పేరు తెచ్చిన పాట, పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న పాట ఇది.
– సంభాషణ: డా. వైజయంతి