చదువుల తల్లికి ‘సోషల్‌’ వేధింపులు | Girl who sells fish after college becomes online rage | Sakshi
Sakshi News home page

చదువుల తల్లికి ‘సోషల్‌’ వేధింపులు

Published Sat, Jul 28 2018 2:24 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Girl who sells fish after college becomes online rage - Sakshi

శుక్రవారం కొచ్చిలో హానన్‌కు రక్షణగా నిలిచిన పోలీసులు

కొచ్చి: హానన్‌ హమీద్‌ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్‌ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే తను బతకడం కోసం, తన తల్లిని బతికించుకోవడం కోసం తనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్‌ హమీద్‌ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ కేరళ ‘మాతృభూమి’ దిన పత్రిక కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు హానన్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు.

రంగంలోకి పోకిరీలు
హానన్‌ పేరు పత్రికల్లో రావడం సహించలేని  కొందరు వ్యక్తులు ఆమెను సోషల్‌ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. ఫేస్‌ బుక్‌లోకి చొరబడి ఆమె ఫొటోలు, ప్రముఖులతో దిగిన సెల్ఫీలూ, డబ్‌స్మాష్‌ వీడియోలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హానన్‌ నిజాయితీని శంకిస్తూ పోస్ట్‌లు పెట్టి వ్యక్తిగతంగా దాడికి దిగారు. హానన్‌ నిజంగా పేదరాలైతే ఆమె వేలికున్న ఉంగరం ఎక్కడిది? అని ఒకరు, ప్రచారం కోసం ఇదంతా చేస్తోందని మరొకరు. ఇలా నానా రకాలుగా ఆమెను వేధించారు. చివరికి తనకు ఎవ్వరి సాయం అక్కర్లేదనీ, తన మానాన తనను వదిలేయాలని హానన్‌ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అర్థించినా ఈ నీచులు వెనక్కి తగ్గలేదు.

హానన్‌కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్‌ మద్దతు..
ఆకతాయిలు ఓ యువతిని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్‌ తీవ్రంగా స్పందించారు. ‘కేరళ సొర చేపల్లారా.. హానన్‌పై దాడిచేయడాన్ని ఆపండి. మీ చర్యల పట్ల నేను సిగ్గుపడుతున్నా. చెదిరిన తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి పోరాడుతుంటే మీరు మాత్రం రాబందుల్లా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఫేస్‌బుక్‌లో మండిపడ్డారు. హానన్‌ను సోషల్‌మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ పోలీసుల్ని ఆదేశించారు. మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌తో తాను చేయబోయే సినిమాలో హానన్‌కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్‌ గోపి ప్రకటించారు.

ఎంబీబీఎస్‌ చదవాలన్నదే లక్ష్యం..
ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడుకోళలోని అల్‌ అజహర్‌ కాలేజ్‌లో హనన్‌ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఉదయాన్నే చేపల్ని కొనుక్కుని వచ్చి ఫ్రిజ్‌లో దాచడం, కాలేజీకి వెళ్లివచ్చిన వెంటనే వాటిని చంపెక్కరా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మడం ఆమె దినచర్య. ఈ చేపల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పోషిస్తూ హానన్‌ చదువుకుంటోంది. కేవలం చేపలే కాదు.. యాంకరింగ్, ట్యూషన్లు, రేడియో ప్రోగ్రాములు ఒక్కటేమిటీ వీలైన ప్రతివిభాగంలో హానన్‌ పనిచేసింది. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గానూ రాణించింది. ఎప్పటికైనా ఎంబీబీఎస్‌ చదవడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్న హానన్‌ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.  


                 చేపలు అమ్ముతున్న హానన్‌ (ఫైల్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement