తనయుడు: హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అమ్మా! | Son Comments On Mother Second Marriage | Sakshi
Sakshi News home page

తనయుడు: హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అమ్మా!

Jun 17 2019 8:16 AM | Updated on Jun 17 2019 9:05 AM

Son Comments On Mother Second Marriage - Sakshi

‘‘అసలు ఇలాంటి ఒక నోట్‌ రాసేముందు నేను ఎంతగానో ఆలోచించాను. ఆధునిక సమాజంలో కూడా ఒక మహిళ రెండో పెళ్లి చేసుకుంటే వింతగా చూసే మనస్తత్వంలో మనం ఉన్నాం. ఎవరైతే అనుమానం, జాలి, వంటి భావనలు కలిగి ఉంటారో దయచేసి అటువంటి వాళ్లు ఈ పోస్టు వంక చూడకపోవడమే మంచిది. ఇది మా అమ్మ పెళ్లి గురించి.’’

కేరళకు చెందిన గోకుల్‌ శ్రీధర్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ప్రారంభ వాక్యాలే పైన మీరు చదివినవి. వితంతువు, భర్త వదిలేసిన లేదా భర్తను వదిలేసిన స్త్రీ రెండో పెళ్లి చేసుకోవడాన్ని ఆమె సంతానం హర్షిస్తుందనడానికి తార్కాణంగా నిలిచిన పోస్ట్‌ అది. ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది.

తల్లిదండ్రులు మాత్రమేనా?!
దైవభూమిగా పేరుగాంచిన కేరళలోని కొల్లాంకు చెందిన గోకుల్‌ శ్రీధర్‌ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే వారిద్దరు తనకు తల్లిదండ్రులే ఉంటున్నారే తప్ప.. భార్యభర్తలుగా మెలగడం లేదని అర్థం చేసుకోవడానికి.. ఆ చిట్టి గుండెకు కొంత సమయం పట్టింది. తన భవిష్యత్తు కోసం.. భర్త పెట్టే చిత్రహింసలను సైతం చిరునవ్వుతో భరించే తల్లి ఆవేదన.. పెరిగి పెద్దవుతున్న కొద్దీ అర్థం చేసుకోసాగాడు. కేవలం తన కారణంగా.. స్త్రీని ఒక బొమ్మలా భావించే తండ్రి మూర్ఖత్వానికి అమ్మ జీవితం బలైపోతుందనే అపరాధ భావన... గోకుల్‌కు మనశ్శాంతి లేకుండా చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం అతడి మానసిక సంఘర్షణకు తెరపడింది. హింసించే భర్త నుంచి విముక్తి పొందిన తన తల్లి.. రెండో పెళ్లి చేసుకోవడంతో గోకుల్‌ సంతోషంగా ఉన్నాడు. ఈ క్రమంలో తన తల్లి గురించి అతడు ఫేస్‌ బుక్‌లో రాసుకొచ్చిన మాటలు.. బిడ్డ భవిష్యత్తు కోసం ఒక తల్లి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశాయి.

రక్తం కారుతున్నా అమ్మ లెక్కచేయలేదు
‘‘అమ్మ.. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమె తన వైవాహిక జీవితంలో ఎంతో హింసను భరించింది. భర్త కొట్టే దెబ్బలకు ఒక్కోసారి నుదుటి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండేది. అయినా ఆమె ముఖంలో బాధ కంటే భయమే ఎక్కువగా ఉండేది. ‘ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు?’ అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. ‘నీ కోసమే నాన్నా.. నువ్వు బాగుండాలంటే ఇవన్నీ భరించక తప్పదు’ అన్న ఆమె మాటలు నన్నెంతో అపరాధ భావానికి గురిచేసేవి. ఒకరోజు అమ్మతో కలిసి నేను కూడా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి వచ్చేసాను. మేము ఇల్లు విడిచిన నాడే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా మాటపై అమ్మ పెళ్లి చేసుకున్నాక.. ‘అమ్మా.. కొత్త భాగస్వామి సాన్నిహిత్యంలో నువ్వు సంతోషంగా ఉండాలి. శుభాకాంక్షలు’ అంటూ.. గోకుల్‌ తన తల్లి, ఆమె రెండో భర్త ఫొటోను సగర్వంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అమ్మ గొప్పదనం, ఆమె త్యాగం ఎరిగిన వాళ్లంతా ప్రస్తుతం గోకుల్‌ తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. అతడి మనస్తత్త్వాన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది.

– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement