రేష్మా నిశాంత్
కన్నూర్ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కోర్టు తీర్పుని కొందరు సమర్ధిస్తుండగా పలు హిందూ ధార్మిక సంస్థలు మాత్రం అయ్యప్ప ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డంగా నరికేస్తానని కేరళకు చెందిన సినీ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు కొల్లం తులసి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’)
మరోవైపు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తాననీ, 18 మెట్లెక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటానని కేరళకు చెందిన రేష్మా నిశాంత్ (32) ప్రకటించారు. సుప్రీం కోర్టు 10 నుంచి 50 ఏళ్ల వయసు వారికి శబరిమల ఆలయంలోకి అనుమతి ఇచ్చినందున అయ్యప్ప దర్శనం చేసుకుంటానని ఆదివారం తన ఫేస్‌బుక్ అకౌంట్లో పేర్కొన్నారు. దీంతో పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఎట్టిపరిస్థితుల్లోను అమెను అయ్యప్ప ఆలయానికి వెళ్లనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు.
వీటన్నిటిపై స్పందించిన రేష్మా... మహిళగా పుట్టడం తన తప్పుకాదనీ, కోర్టు అందరికీ సమాన హక్కులుండాలనే మహిళలు శబరిమలకు వెళ్లొచ్చొనే తీర్పునిచ్చిందని తెలిపారు. పవిత్రమైన అయ్యప్ప మండల దీక్ష (41 రోజులు) ధరించినా కూడా అయ్యప్ప దర్శనం చేసుకోకుండా మహిళలను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. తను గతంలో మండల దీక్ష వేసుకున్నప్పుడు రుతుస్రావం అయిన రోజులను మినహాయించి 55 రోజులు దీక్షలో ఉన్నానని గుర్తు చేశారు. ఏదేమైనా శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకుంటానని స్సష్టం చేశారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment