Alphons Kannanthanam
-
చదువుల తల్లికి ‘సోషల్’ వేధింపులు
కొచ్చి: హానన్ హమీద్ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే తను బతకడం కోసం, తన తల్లిని బతికించుకోవడం కోసం తనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్ హమీద్ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ కేరళ ‘మాతృభూమి’ దిన పత్రిక కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు హానన్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. రంగంలోకి పోకిరీలు హానన్ పేరు పత్రికల్లో రావడం సహించలేని కొందరు వ్యక్తులు ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్‌లోకి చొరబడి ఆమె ఫొటోలు, ప్రముఖులతో దిగిన సెల్ఫీలూ, డబ్స్మాష్ వీడియోలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హానన్ నిజాయితీని శంకిస్తూ పోస్ట్‌లు పెట్టి వ్యక్తిగతంగా దాడికి దిగారు. హానన్ నిజంగా పేదరాలైతే ఆమె వేలికున్న ఉంగరం ఎక్కడిది? అని ఒకరు, ప్రచారం కోసం ఇదంతా చేస్తోందని మరొకరు. ఇలా నానా రకాలుగా ఆమెను వేధించారు. చివరికి తనకు ఎవ్వరి సాయం అక్కర్లేదనీ, తన మానాన తనను వదిలేయాలని హానన్ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అర్థించినా ఈ నీచులు వెనక్కి తగ్గలేదు. హానన్‌కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ మద్దతు.. ఆకతాయిలు ఓ యువతిని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్ తీవ్రంగా స్పందించారు. ‘కేరళ సొర చేపల్లారా.. హానన్‌పై దాడిచేయడాన్ని ఆపండి. మీ చర్యల పట్ల నేను సిగ్గుపడుతున్నా. చెదిరిన తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి పోరాడుతుంటే మీరు మాత్రం రాబందుల్లా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఫేస్బుక్లో మండిపడ్డారు. హానన్‌ను సోషల్‌మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసుల్ని ఆదేశించారు. మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో తాను చేయబోయే సినిమాలో హానన్‌కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపి ప్రకటించారు. ఎంబీబీఎస్ చదవాలన్నదే లక్ష్యం.. ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడుకోళలోని అల్ అజహర్ కాలేజ్‌లో హనన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయాన్నే చేపల్ని కొనుక్కుని వచ్చి ఫ్రిజ్‌లో దాచడం, కాలేజీకి వెళ్లివచ్చిన వెంటనే వాటిని చంపెక్కరా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మడం ఆమె దినచర్య. ఈ చేపల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పోషిస్తూ హానన్ చదువుకుంటోంది. కేవలం చేపలే కాదు.. యాంకరింగ్, ట్యూషన్లు, రేడియో ప్రోగ్రాములు ఒక్కటేమిటీ వీలైన ప్రతివిభాగంలో హానన్ పనిచేసింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ రాణించింది. ఎప్పటికైనా ఎంబీబీఎస్ చదవడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్న హానన్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. చేపలు అమ్ముతున్న హానన్ (ఫైల్). -
‘ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ కల్చర్ లేదు’
న్యూఢిల్లీ : ఇంఫాల్ ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ వివాదంపై పౌర విమానయాన శాఖామంత్రి జయంత్ సిన్హా తొలిసారి స్పందించారు. దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ వీవీఐపీ కల్చర్ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో తీసుకునే భద్రతా చర్యలు ప్రయాణికులు సెక్యూరిటీ కోసమేనని ఆయన తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతేకాక భద్రత కల్పించాల్సిన ముఖ్యవ్యక్తులు విమానశ్రయాలకు వచ్చినపుడు సెక్యూరిటీ స్క్రీనింగ్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఇది వీవీఐపీ కల్చర్ కాదని జయంత్ సిన్హా స్పష్టం చేశారు. వీరు తప్ప మిగిలిన ఎవరినైనా విమానాశ్రయాల్లో ఎవరినైనాన సాధారణ ప్రయాణికుడిగానే అధికారులు చూస్తారని ఆయన తెలిపారు. నా బ్యాగ్‌ను నేను మోసుకుంటూ విమానం ఎక్కుతాను.. వీవీఐపీ కల్చర్ లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల కిందట ఇంఫాల్ విమానాశ్రయంలో ఒక మహిళ.. వీవీఐపీ కల్చర్‌పై కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్‌ను నిలదీయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ రావడంతో.. మిగతా విమాన ప్రయాణికులను నిలిపేశారు. దీంతో మిగిలిన విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. మంత్రి రాకవల్ల ఇబ్బందుల పడ్డవారిలో ఒక మహిళా డాక్టర్ ఉన్నారు. ఆమె అత్యవసరంగా ఒకరికి చికిత్స అందించే క్రమంలో పట్నా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీవీఐపీ కల్చర్ వల్ల ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఆమె.. నేరుగా కేంద్రమంత్రినే ఎయిర్‌పోర్టులో నిలదీశారు. -
పర్యాటక ప్రచారానికి ‘పర్యటన్ పర్వ్’
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్రం బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సొంత దేశంలోని వివిధ ప్రాంతాలను చూడనంత వరకు మన వైవిధ్యం గురించి తెలుసుకోలేమని ప్రధాని మోదీ గత మన్‌కీ బాత్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర పర్యాటక శాఖ ‘పర్యటన్ పర్వ్’ పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొంటాయి. 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, పర్యాటక రంగం ప్రయోజనాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. ఈసారి అక్టోబర్ 5 నుంచి 20 జరిగే ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తామని ఆ శాఖ తెలిపింది. -
మరో కీలక వ్యూహం!
దేశం నలుమూలల విస్తరించేందుకు వ్యూహాలు పన్నుతున్న కాషాయ దళపతి అమిత్ షా.. కేరళపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో సీట్లు గెలవలేకపోయినా.. గణనీయమైన ఓటు బ్యాంక్‌ను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేరళలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తిరువనంతపురం: కేరళ శాసనసభకు 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవచ్చని మొదట అందరూ అంచనా వేశారు. అయితే కేవలం ఒక్క సీటుతోనే పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీట్లురాకపోయినా మంచి ఓటు బ్యాంక్‌ను పార్టీ సాధించింది. మైనారిటీలు, క్రైస్తవులు అధికంగా ఉండే కేరళలో బీజేపీ గత ఎన్నికల్లో హిందుత్వ వాదాన్ని పెద్దగా నెత్తికెత్తుకోలేదు. అయితే దారుణ ఓటమి తరువాత కూడా ఉత్తర భారతంలో అనుసరించిన హిందూ విధానాన్నే కేరళలో అనుసరించాలని బీజేపీ భావిస్తున్నట్లు కనబడుతోంది. కేరళలో తమ పార్టీ మూలాలు బలపడితే.. మొత్తం దక్షిణాదిలో పాగా వేయవచ్చిన బీజేపీ అధినాయకత్వం ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కేరళలో జనరక్ష యాత్రకు సిద్ధమయ్యారు. వ్యూహాత్మక అడుగులు అమిత్ షా కేరళలో చేస్తున్న యాత్రపై రాజకీయ విశ్లేషకలు స్పందిస్తూ.. కమల దళపతి అసాధారణ వ్యూహాలతోనే ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కేరళ ప్రజలను మత ప్రాతిపదికన విడిదీసి.. స్థిరమైన ఓటు బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఈ యాత్ర అని సీనియర్ జర్నలిస్ట్ ఎన్పీ చెకుట్టి అంటున్నారు. కమ్యూనిస్ట్‌లకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న హిందువులను తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. అతివాద హిందుత్వం వల్ల ముస్లింలు, క్రైస్తవులకు భవిష్యత్‌లో ప్రమాదమేనని ఆయన విశ్లేషించారు. విభజన సాధ్యమా? కేరళ ప్రజలను మత ప్రాతిపదికగా విభజించడం అసాధ్యమరి మరికొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీని ఇక్కడి హిందువులు దారుణంగా ఓడించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేరళలోని బలమైన ఎజువా వర్గం వారిని బీజేపీ కోల్పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎజువా సామాజిక వర్గం చేతిలో ఉన్న భారతీయ ధర్మ జన సేనను బీజేపీ నిర్లక్ష్యం చేసిందని.. అందుకు తగిన మూల్యం ఆ పార్టీ చెల్లించుకుంటోందని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి కనీసం 12 పార్లమెంట్ స్థానాలు సాధించాలనేది ప్రస్తుత బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అమిత్ షా ఈ యాత్ర చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల చరిత్రలో బీజేపీ ఇప్పటివరకూ కేరళ నుంచి ఒక్క పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు. షా వ్యూహాలు కేరళలో పాగా వేసేందుకు అమిత్ షా విభిన్నమైన వ్యూహాలను రచిస్తున్నారు. కేరళలో ఒక్క హిందూ ఓటు బ్యాంక్‌తో విజయం సాధించడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు.. క్రైస్తవులు కూడా 28 శాతం వరకూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ, ముస్లిం వర్గాలను చీల్చితేనే అధికారంగానీ.. సీట్లుగానీ సాధించడం జరుగుతుంది. అందులో భాగంగానే కేరళకు చెందిన అల్ఫోన్స్ కన్నన్ థామన్కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం.. ఆయన కొంత కాలంగా కేరళలోని క్రైస్తవ సంఘాలతో చర్చలు జరపడం జరుగుతోంది. షా వ్యూహాలు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ ప్రయత్నాలు కొంతవరకూ ఫలిస్తే.. కేరళలో బీజేపీ పాగా వేయడం ఖాయం. -
'నన్ను రాజకీయాల్లోకి ఆ ముఖ్యమంత్రే తెచ్చారు'
సాక్షి, కేరళ : తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చినవారిలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా ముఖ్యమైనవారు అని కేంద్ర పర్యాటక శాఖామంత్రి అల్ఫాన్స్ కణ్ణన్థానమ్ (ఇండిపెండెంట్) అన్నారు. ఆయనతో కలిసి పనిచేసి కేరళలో రాజకీయ హత్యలు అనేవి లేకుండా చేస్తానని చెప్పారు. బీఫ్ తినడానికి విదేశీ పర్యాటకులు ఇండియాకు రావొద్దు అంటూ ప్రకటించి ఆయన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా సంస్థ ఆయనను ఇంటర్వ్యూ చేసి పలు విషయాలపై వివరణ కోరింది. ముఖ్యంగా మీరు చేసిన బీఫ్ తినడానికి రావొద్దనే వ్యాఖ్యలు కొంత ఆందోళన కలిగించాయని, తొలుత బీఫ్ తింటే బీజేపీకి ఎలాంటి సమస్య లేదని చెప్పిన మీరే.. బీఫ్‌పై ఇలా వ్యాఖ్యానించడం ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించగా.. 'నా మాటలు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం బీఫ్ తినడం కోసమే భారత్ రావొద్దని చెప్పడం నా ఉద్దేశం. భారత్ ప్రజాస్వామ్య దేశం. ఈ దేశ ప్రజలే ఏమీ తినాలో, ఏమీ తినకూడదో నిర్ణయిస్తారు. ఇది చాలా సుస్పష్టం. ఏ ఒక్కరూ కూడా మితిమీరిన స్వేచ్ఛతో వ్యవహరించడానికి వీల్లేదు. ఇది ఆహ్వానించగదగింది కూడా కాదు' అంటూ చెప్పుకొచ్చారు. గతంలో సీపీఐ మద్దతుతో గెలిచిన మీరు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.. విజయన్‌తో ఎలా పనిచేయనున్నారని ప్రశ్నించగా.. 'నాకు పినరయ్ విజయన్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనతో పనిచేస్తూ రాజకీయ హత్యలు కేరళలో లేకుండా చేస్తాను. నన్ను రాజకీయాల్లోకి తెచ్చినవారిలో ఆయన కూడా ఒకరు. నా పని ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు' అని తెలిపారు.