దేశం నలుమూలల విస్తరించేందుకు వ్యూహాలు పన్నుతున్న కాషాయ దళపతి అమిత్ షా.. కేరళపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో సీట్లు గెలవలేకపోయినా.. గణనీయమైన ఓటు బ్యాంక్‌ను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేరళలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
తిరువనంతపురం: కేరళ శాసనసభకు 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవచ్చని మొదట అందరూ అంచనా వేశారు. అయితే కేవలం ఒక్క సీటుతోనే పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీట్లురాకపోయినా మంచి ఓటు బ్యాంక్‌ను పార్టీ సాధించింది. మైనారిటీలు, క్రైస్తవులు అధికంగా ఉండే కేరళలో బీజేపీ గత ఎన్నికల్లో హిందుత్వ వాదాన్ని పెద్దగా నెత్తికెత్తుకోలేదు. అయితే దారుణ ఓటమి తరువాత కూడా ఉత్తర భారతంలో అనుసరించిన హిందూ విధానాన్నే కేరళలో అనుసరించాలని బీజేపీ భావిస్తున్నట్లు కనబడుతోంది. కేరళలో తమ పార్టీ మూలాలు బలపడితే.. మొత్తం దక్షిణాదిలో పాగా వేయవచ్చిన బీజేపీ అధినాయకత్వం ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కేరళలో జనరక్ష యాత్రకు సిద్ధమయ్యారు.
వ్యూహాత్మక అడుగులు
అమిత్ షా కేరళలో చేస్తున్న యాత్రపై రాజకీయ విశ్లేషకలు స్పందిస్తూ.. కమల దళపతి అసాధారణ వ్యూహాలతోనే ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కేరళ ప్రజలను మత ప్రాతిపదికన విడిదీసి.. స్థిరమైన ఓటు బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఈ యాత్ర అని సీనియర్ జర్నలిస్ట్ ఎన్‌పీ చెకుట్టి అంటున్నారు. కమ్యూనిస్ట్‌లకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న హిందువులను తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. అతివాద హిందుత్వం వల్ల ముస్లింలు, క్రైస్తవులకు భవిష్యత్‌లో ప్రమాదమేనని ఆయన విశ్లేషించారు.
విభజన సాధ్యమా?
కేరళ ప్రజలను మత ప్రాతిపదికగా విభజించడం అసాధ్యమరి మరికొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీని ఇక్కడి హిందువులు దారుణంగా ఓడించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేరళలోని బలమైన ఎజువా వర్గం వారిని బీజేపీ కోల్పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎజువా సామాజిక వర్గం చేతిలో ఉన్న భారతీయ ధర్మ జన సేనను బీజేపీ నిర్లక్ష్యం చేసిందని.. అందుకు తగిన మూల్యం ఆ పార్టీ చెల్లించుకుంటోందని చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం
2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి కనీసం 12 పార్లమెంట్ స్థానాలు సాధించాలనేది ప్రస్తుత బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అమిత్ షా ఈ యాత్ర చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల చరిత్రలో బీజేపీ ఇప్పటివరకూ కేరళ నుంచి ఒక్క పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు.
షా వ్యూహాలు
కేరళలో పాగా వేసేందుకు అమిత్ షా విభిన్నమైన వ్యూహాలను రచిస్తున్నారు. కేరళలో ఒక్క హిందూ ఓటు బ్యాంక్‌తో విజయం సాధించడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు.. క్రైస్తవులు కూడా 28 శాతం వరకూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ, ముస్లిం వర్గాలను చీల్చితేనే అధికారంగానీ.. సీట్లుగానీ సాధించడం జరుగుతుంది. అందులో భాగంగానే కేరళకు చెందిన అల్ఫోన్స్ కన్నన్ థామన్‌కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం.. ఆయన కొంత కాలంగా కేరళలోని క్రైస్తవ సంఘాలతో చర్చలు జరపడం జరుగుతోంది. షా వ్యూహాలు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ ప్రయత్నాలు కొంతవరకూ ఫలిస్తే.. కేరళలో బీజేపీ పాగా వేయడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment