'నన్ను రాజకీయాల్లోకి ఆ ముఖ్యమంత్రే తెచ్చారు'
సాక్షి, కేరళ : తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చినవారిలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా ముఖ్యమైనవారు అని కేంద్ర పర్యాటక శాఖామంత్రి అల్ఫాన్స్ కణ్ణన్‌థానమ్ (ఇండిపెండెంట్) అన్నారు. ఆయనతో కలిసి పనిచేసి కేరళలో రాజకీయ హత్యలు అనేవి లేకుండా చేస్తానని చెప్పారు. బీఫ్ తినడానికి విదేశీ పర్యాటకులు ఇండియాకు రావొద్దు అంటూ ప్రకటించి ఆయన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా సంస్థ ఆయనను ఇంటర్వ్యూ చేసి పలు విషయాలపై వివరణ కోరింది.
ముఖ్యంగా మీరు చేసిన బీఫ్ తినడానికి రావొద్దనే వ్యాఖ్యలు కొంత ఆందోళన కలిగించాయని, తొలుత బీఫ్ తింటే బీజేపీకి ఎలాంటి సమస్య లేదని చెప్పిన మీరే.. బీఫ్‌పై ఇలా వ్యాఖ్యానించడం ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించగా.. 'నా మాటలు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం బీఫ్ తినడం కోసమే భారత్ రావొద్దని చెప్పడం నా ఉద్దేశం. భారత్ ప్రజాస్వామ్య దేశం. ఈ దేశ ప్రజలే ఏమీ తినాలో, ఏమీ తినకూడదో నిర్ణయిస్తారు.
ఇది చాలా సుస్పష్టం. ఏ ఒక్కరూ కూడా మితిమీరిన స్వేచ్ఛతో వ్యవహరించడానికి వీల్లేదు. ఇది ఆహ్వానించగదగింది కూడా కాదు' అంటూ చెప్పుకొచ్చారు. గతంలో సీపీఐ మద్దతుతో గెలిచిన మీరు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.. విజయన్‌తో ఎలా పనిచేయనున్నారని ప్రశ్నించగా.. 'నాకు పినరయ్ విజయన్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనతో పనిచేస్తూ రాజకీయ హత్యలు కేరళలో లేకుండా చేస్తాను. నన్ను రాజకీయాల్లోకి తెచ్చినవారిలో ఆయన కూడా ఒకరు. నా పని ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు' అని తెలిపారు.