చల్తే చల్తే మేరే యే గీత్‌ యాద్‌ రఖ్‌నా | Singer-composer Bappi Lahiri passes away | Sakshi
Sakshi News home page

చల్తే చల్తే మేరే యే గీత్‌ యాద్‌ రఖ్‌నా

Published Thu, Feb 17 2022 5:48 AM | Last Updated on Thu, Feb 17 2022 4:26 PM

Singer-composer Bappi Lahiri passes away - Sakshi

స్పీకర్‌ బాక్సులు బద్దలయ్యాయి. స్తంభాలకు కట్టిన హారన్‌లు కేకపెట్టాయి. టేప్‌ రికార్డర్ల మోతకు అంతే లేదు. రేడియోలు మళ్లీ మళ్లీ పాడాయి. ‘జిమ్మీ.. జిమ్మీ.. ఆజా... ఆజా’... ‘హరి ఓం హరి... హరి ఓం హరి’... ‘మేరే దిల్‌ గాయేజా జు..జు.. జుబి జుబి జూబీ’... ‘పగ్‌ ఘంగురూ బాంద్‌ మీరా నాచెరె’... బప్పీ లహిరి అనే పేరు 1980లలో హోరై దేశాన్ని చుట్టేసింది. గంతులు రాని వాళ్లు గంతులేశారు. చిందులు వేయని వాళ్లు చిందులేశారు. ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచి బప్పీ లహిరి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ నృత్య సంగీతభరిత కాలం మరి తిరిగి రాదు.

బప్పీ లహిరి ఇంటర్‌ వరకు కూడా చదువుకోలేదు. కాని ఉన్న చోటే ఉండిపోవడం మాత్రం బతుక్కు చేటు అని ముందే తెలుసుకున్నాడు. కోల్‌కతా మహా నగరం. తల్లిదండ్రులు అపరేష్‌ లహిరి, బాన్సురి లహిరి ఆ నగరంలో అంతో ఇంతో పేరున్న సంగీతకారులు. తల్లి క్లాసికల్‌ కచేరీలు ఇస్తుంది. బప్పీ ఒక్కగానొక్క కొడుకు. అయినా సరే ఉన్న చోటే ఉండటం సరికాదు అనుకున్నాడు బప్పీ. ముంబై వెళ్లాలి... సాధించాలి అనుకున్నాడు. సంగీత దర్శకుడుగా. 21 ఏళ్లు అప్పటికి. ముంబై చేరుకున్నాడు. కిశోర్‌ కుమార్‌ అతనికి దూరపు చుట్టం. హీరోయిన్‌ కాజోల్‌ తండ్రి సోము ముఖర్జీ దగ్గరి చుట్టం. సోము తీస్తున్న ‘నన్హా షికారి’ (1973) సినిమాకు సంగీతం చేశాడు. ఓకే అనిపించింది. ఆ తర్వాత తాహిర్‌ హుసేన్‌ తీసిన ‘జఖ్మీ’ (1975)తో గుర్తింపు వచ్చింది.

1977లో వచ్చిన ‘ఆప్‌ కీ ఖాతిర్‌’లోని ‘బంబై సే ఆయా మేరా దోస్త్‌... దోస్త్‌కో సలామ్‌ కరో’... పాట ఆల్మోస్ట్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. కాని అలాంటి గుర్తింపు కాదు బప్పీ కోరుకుంటున్నది. ఇంకా ఏదో చేయాలి. అప్పుడే అమెరికాలో కచేరీ చేసే చాన్స్‌ వచ్చింది. లోకం చూస్తే విషయం తెలుస్తుంది అని బయలు దేరాడు. పారే నీరే ఒండ్రుమట్టిని తోడు తీసుకుంటుంది. బప్పీ అమెరికాలోని చికాగోలో ఆ రాత్రి ఒక పబ్‌కు వెళ్లాడు. పబ్‌లో అంతా హోరుగా ఉంది. వెలిగే ఆరే దీపాలు. డాన్స్‌ చేస్తున్న జంటలు. ఒకతను మ్యూజిక్‌ ప్లే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్‌ నచ్చిన బప్పీ అతని దగ్గరకు వెళ్లి ‘నువ్వు ప్లే చేస్తున్న సంగీతం ఏమిటి?’ అని అడిగాడు. ‘నేను డిస్క్‌ ప్లే చేస్తున్నాను. పబ్‌లో అందరూ డాన్స్‌ చేయడానికి ప్లే చేస్తున్నాను కనుక ఇది డిస్కో’ అన్నాడు. ఆ సౌండ్‌ బప్పీకి నచ్చింది. ఆ బీట్‌ కూడా. అది ఇండియాలో మొదలు కానున్న డిస్కో కాలానికి ఆరంభ క్షణం.
∙∙
పోటీదారుల్ని అర్థం చేసుకోకపోతే పోటీలో నిలవడం కష్టం. 1970ల కాలంలో బాలీవుడ్‌ సినిమా రంగం ఘనంగా ఉంది. పోటీలో గండర గండలు. ఎస్‌.డి. బర్మన్, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్, ఆర్‌.డి. బర్మన్, కళ్యాణ్‌జీ–ఆనంద్‌జీ... వీళ్లంతా టాప్‌లో ఉన్నారు. వీళ్ల మధ్య బప్పీ నిలబడాలి. అతను చిన్నప్పటి నుంచి తబలా ప్లేయర్‌. ఏ బీట్‌ శ్రోతలకు హుషారునిస్తుందో తెలుసు. అదే సమయంలో తల్లి ద్వారా విన్న శాస్త్రీయ సంగీతం వల్ల ఏ స్వరం చెవికి ఇంపుగా ఉంటుందో కూడా తెలుసు. ఈ మెలోడీని, బీట్‌ని సరిగ్గా కలపగలిగితే చాలు అనుకున్నాడు బప్పీ. కొత్త సంగీత పరికరాలతో ఎప్పటికప్పుడు పోటీ పడే ఆర్‌.డి. బర్మన్‌ను ఎదుర్కొనాలంటే డిస్కో ఒక మార్గంగా కనిపించింది. అదే సమయంలో అమితాబ్‌ స్టార్‌డమ్‌ను తట్టుకోవడానికి మిథున్‌ చక్రవర్తి ప్రయత్నిస్తున్నాడు. మిథున్‌ను పెంచడానికి కూడా కొంత మంది ట్రై చేస్తున్నారు.

బి.సుభాష్‌ అనే బి గ్రేడ్‌ దర్శకుడు బప్పీకి స్నేహితుడు. బప్పీ అప్పటికే డిస్కో బీట్‌తో ఒకటి రెండు పాటలు చేయడంతో ఇదేదో బాగుందే అనుకుని ‘డిస్కో డాన్సర్‌’ అనే కథను తయారు చేశాడు. మిథున్‌ హీరో. కాని బప్పీకి అర్థమైంది. ‘ఈ సినిమా నాది’ అనుకున్నాడు. డిస్కో మ్యూజిక్‌ నేపథ్యంలో పాటలు పుట్టాయి. 1982. సినిమా రిలీజైంది. నిజానికి పెద్దగా డాన్స్‌ రాని మిథున్‌ చక్రవర్తి డాన్సింగ్‌ స్టార్‌ అయ్యాడు. బప్పీ లహిరి డిస్కో కింగ్‌ అయ్యాడు. ఆ సినిమాలోని ప్రతి పాట వీధి వీధి వాడ వాడ మార్మోగి పోయింది. స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో, తిరునాళ్లలో, పెళ్లిళ్ల లో అందరూ ‘ఐ యామ్‌ ఏ డిస్కో డాన్సర్‌’ పాటకు డాన్స్‌ వేయడమే. ‘యాద్‌ ఆ రహా హై తేర ప్యార్‌’, ‘గోరోంకి నా కాలోంకి దునియా హై దిల్‌ వాలోంకి’, ‘కోయి యహా అహ నాచే నాచే’ హిట్టు మీద హిట్టు. దేశం ఇక డిస్కోలోకి మేల్కొంది.
∙∙
కృష్ణకు ఒక హిట్‌ ఎలాగైనా ఇవ్వాలని పట్టుదలగా కె.రాఘవేంద్రరావు తీసిన ‘ఊరికి మొనగాడు’ హిట్‌ కావడం బప్పీ లహిరికి లాభించింది. దానిని కృష్ణ ‘హిమ్మత్‌వాలా’ పేరుతో హిందీలో తీయాలని అనుకున్నప్పుడు బప్పీ లహిరిని సంగీతానికి ఎంచుకున్నాడు. ‘ఒక పాటలో బోలెడన్ని కుండలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాట చేయండి’ అని రాఘవేంద్రరావు అడిగితే ట్యూన్‌ కట్టేటప్పుడు తన ఎదురుగా ఐదారు తబలాల వరుస పెట్టుకుని ఉండే బప్పీ ఒక ట్యూన్‌ వినిపించాడు. పాట ఓకే అయ్యింది. షూటింగ్‌కు జితేంద్ర హాజరయ్యాడు. శ్రీదేవితో పాట. నగరాలో పాట విని ‘ఇదేం పాట డైరెక్టరు గారూ... ఇవేం స్టెప్పులు’ అని పైకే అనేశాడు. కాని చేయక తప్పలేదు.

‘హిమ్మత్‌వాలా’ రిలీజైంది. ఒక్క పాట. ‘నైనోమే సప్‌నా సప్‌నోమే సజ్‌నీ సజ్‌నీ పే దిల్‌ హోగయా’... ఎక్కడ చూసినా అదే. ‘హిమ్మత్‌వాలా’తో పాటు బప్పీ పాటా హిట్‌ అయ్యాయి. ఇక కె.రాఘవేంద్రరావు, జితేంద్ర, బప్పీ లహిరి ఒక టీమ్‌ అయ్యారు. తెలుగులో హిట్‌ అయిన ‘దేవత’ హిందీలో ‘తోఫా’(1984) గా రీమేక్‌ అయితే ‘తోఫా.. తోఫా.. తోఫా... లాయా లాయా లాయా’ హిట్‌. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమా ‘మవ్వాలి’గా రీమేక్‌ అయితే ‘ఉయ్యమ్మ.. ఉయ్యమ్మ ముష్కిల్‌ ఏ క్యా హోగయీ’ మాస్‌ హిట్‌. ‘ముందడుగు’ రీమేక్‌ ‘మక్సద్‌’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘ఖైదీ’... ఈ సినిమాలన్నింటికీ బప్పీ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇదంతా ముంబై నుంచి హైదరాబాద్‌కు బప్పీ రావడానికి కారణమైంది.
∙∙
కృష్ణ ఏది చేసినా ఘనంగా చేయాలనుకుంటాడు. ‘సింహాసనం’ (1986) రెండు భాషల్లో తీయ తలపెట్టిన భారీ జానపద చిత్రం. తెలుగులో తాను. హిందీలో జితేంద్ర. రెండు భాషల్లో హిట్‌ పాటలు తప్పవు కనుక బప్పీ లహిరిని రంగంలోకి దించాడు. నిజానికి కృష్ణకు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడటం లేదు. రాజ్‌ సీతారాంతో సర్దుకోవాలి. కాని ఆ మైనస్‌ను కూడా పట్టించుకోని స్థాయిలో బప్పీ లహిరి భారీ హిట్‌ పాటలు అందించాడు. ‘ఆకాశంలో ఒక తార’ నేటికీ మోగుతూనే ఉంది. ఆ సినిమాలో ‘ఇది కల అని నేననుకోనా’, ‘గుమ్మా గుమ్మా’, ‘వహవ్వా నీ యవ్వనం’ మాస్‌ను క్యాసెట్లు కొనేలా చేశాయి.

ఆ తర్వాత కృష్ణ హీరోగా భారీ ఖర్చుతో తీసిన సాధారణ సినిమా ‘తేనె మనసులు’కు, ‘నసీబ్‌’ రీమేక్‌గా చేసిన ‘త్రిమూర్తులు’కు పాటలు ఇచ్చాడు. కాని చిరంజీవి– బప్పీ లహిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్టేట్‌రౌడీ’ కలెక్షన్లలో అంతగా ఘనంగా లేకపోయినా పాటల్లో ఊపేసింది. ‘చుక్కల పల్లకిలో’, ‘రాధా రాధా మదిలో మన్మధ బాధ’కు తెర మీద కాగితపు ముక్కలు ఎగిరాయి. అయితే బప్పీ లహిరి అసలు సిసలు హిట్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’తో దక్కింది. ఆ సినిమాలో పాటలు చిరంజీవిని మాస్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరకు చేర్చాయి. ‘జీ ఏ ఎన్‌ జీ గ్యాంగ్‌ గ్యాంగ్‌’... ఎంత ఫాస్ట్‌ బీటో ‘భద్రాచలం కొండ’ అంత పల్లె బీట్‌తో ఆకట్టుకున్నాయి. ‘వానా వానా వెల్లువాయే’ పాట ‘రచ్చ’ సినిమాలో రీ మిక్స్‌ అయ్యేంత ఫ్రెష్‌గా నేటికీ ఉంది. ఆ పాటలో చిరంజీవి, విజయశాంతి గుర్తుండిపోయారు జల్లు కురిసే వానలాగా.  చిరంజీవికే ‘రౌడీ అల్లుడు’ చేసిన బప్పీ బాలకృష్ణకు ‘రౌడీ ఇన్స్‌పెక్టర్‌’, ‘నిప్పురవ్వ’ చేశాడు.
∙∙
కె.జె.ఏసుదాస్‌ ‘చిత్‌చోర్‌’తో హిందీ దేశానికి తెలిశాడని అనుకుంటాం కాని దానికి ముందే బప్పీ అతని చేత ‘టూటే ఖిలోనే’లో పాడించాడు. శేఖర్‌ కపూర్‌ హీరో. షబానా ఆజ్మీ హీరోయిన్‌. ‘మానాహో తుమ్‌ బేహద్‌ హసీన్‌’ పాట ఇప్పటికీ బాగుంటుంది. ఆ తర్వాత తెలుగులో మోహన్‌బాబు కోసం చేసిన పాటల్లో ఏసుదాస్‌కు మంచి పాటలు ఇచ్చాడు. ‘రౌడీ గారి పెళ్లాం’ ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’... ‘బ్రహ్మ’లో ‘ముసి ముసి నవ్వులలోనా’ పాటలు హిట్‌.
∙∙
బప్పీ లహిరి చాలా ప్రయోగాలు చేశాడు. డిస్కోలో ఇండియన్‌ మ్యూజిక్‌ ‘ఫ్యూజన్‌’ను ఆ రోజుల్లోనే ప్రయత్నించాడు. ‘నమక్‌ హలాల్‌’లో 12 నిమిషాల పాట ‘పగ్‌ ఘంగురూ బాంద్‌ మీరా నాచెరె’లో డిస్కోను, క్లాసికల్‌ను కలిపాడు. కిశోర్‌ కుమార్‌ దగ్గరకు ఈ పాట కోసం వెళితే సహనం తక్కువగా ఉండే ఆయన (ఎంత పెద్ద పాట పాడినా అదే పారితోషికం కనుక) ‘ఇంత పెద్ద పాట నా వల్ల కాదు. ఇలాంటివి రఫీ సాబ్‌ కదా పాడేది’ అన్నాట్ట. కాని బప్పీ పట్టుబట్టి పాడించాడు. ఆ పాట పెద్ద హిట్‌ అయ్యింది. మన జయప్రద అమితాబ్‌తో కలిసి నటించిన ‘షరాబీ’, ‘ఆజ్‌ కా అర్జున్‌’ సినిమాల్లో పాటలు బప్పీ చేయగా హిట్‌ అయ్యాయి. ‘షరాబీ’లో ‘దేదే ప్యార్‌ దే ప్యార్‌ దే’, ‘ఇంతెఖాల్‌ హోగయీ ఇంతెజార్‌కీ’... పాటలు ‘ఆజ్‌ కా అర్జున్‌’లో ‘గోరిహి కలాయియా’ పాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉన్నాయి.
∙∙
1982 నుంచి 1990 వరకూ దాదాపు ఒక ప్రభంజనంలా బప్పీ కొనసాగాడు. డిస్కో తర్వాత బ్రేక్‌ను తెచ్చాడు. గోవిందా తొలి సినిమా ‘ఇల్జామ్‌’లో ‘ఐ యామ్‌ ఏ స్ట్రీట్‌ డాన్సర్‌’ పాటతో బ్రేక్‌ డాన్స్‌ పాటలు ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ట్రెండ్‌ కొంతకాలం సౌత్‌లో కూడా కొనసాగింది. చివరకు ఆనంద్‌– మిలింద్, నదీమ్‌ – శ్రావణ్‌ వచ్చే వరకూ అతనికి ఎదురు లేకపోయింది.
∙∙
బప్పీ లహిరి మాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. అలా ఉండటానికే అతడు ఇష్టపడ్డాడు. బాలీవుడ్‌ కూడా అలాగే అతణ్ణి ఉంచింది. పెద్ద పెద్ద సినిమాలు, సీరియస్‌ కథాంశాలు అతని దాకా రాలేదు. క్లాసిక్స్‌ అంటూ చెప్పుకోవడానికి అతనికి ఏమీ లేవు. కాని అతడు మంచి పాటలు చేయగలడు. ‘ప్యార్‌ మే కభీ కభీ ఐసాహి హోతాహై’ (చల్తే చల్తే), ‘కిసీ నజర్‌ కో తేరా ఇంతెజార్‌ ఆజ్‌ భీ హై’ (ఐత్‌బార్‌), ‘జిద్‌ నా కరో అబ్‌ తో రుకో ఏ రాత్‌ నహీ ఆయేగీ’ (లహూ కే దో రంగ్‌) వంటి మంచి మెలోడీలు చేశాడు.

బప్పీని సంగీత పండితులు నిరాకరించినా అన్ని పాటల్లో అతను తబలాను వాడే పద్ధతిని విశేషంగా మెచ్చుకుంటారు. అతడికి తబలా అంటే ఇష్టం కనుక ఎంతటి బీట్‌ ఆధారిత పాటలో కూడా తబలాను చాలా ప్రతిభావంతంగా ఇముడ్చుతాడు. బప్పీ లహిరిని 1980ల మాస్‌ పాటలకు ఐకాన్‌గా భావిస్తారు. అందుకే ‘డర్టీ పిక్చర్‌’ను తీసేప్పుడు ఆ కాలం మాస్‌ పాటకు సంకేతంగా బప్పీ స్టయిల్‌లో ‘ఊలాల ఊలాల’ పాట చేయించి అతని చేతే పాడించారు.

బప్పీ, అలీషా చినాయ్, షరోన్‌ ప్రభాకర్‌ లాంటి గాయనులను సినిమాల్లోకి తెచ్చాడు. అతడు వెలుగుతున్నప్పుడు నిర్మాత దర్శకులే కాదు గాయనీ గాయకులు కూడా అతని ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. చివరి రోజుల్లో అతడు తనకు కనీసం ‘పద్మశ్రీ’ వస్తే బాగుండు అనుకున్నాడు. రాలేదు. ఒక కాలపు మాస్‌ ప్రేక్షకులు తనకు తెర మీద చిల్లర నాణేలు విరజిమ్ముతూ చేసిన సత్కారమే చాలనుకున్నాడు. అతను చేసిన మంచి పాటతోనే అతనికి వీడ్కోలు చెప్పవచ్చు.
చల్తే చల్తే మేరే ఏ గీత్‌ యాత్‌ రఖ్‌నా
కభి అల్విదా నా కెహెనా
కభి అల్విదా నా కెహెనా...

మైక్‌ టైసన్‌  ‘జింగిల్‌’
ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌  2018లో ఎమ్‌ఎమ్‌ఏ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత్‌ వచ్చినప్పుడు ఆయన్ను స్వాగతిస్తూ జింగిల్‌ పాటను బప్పీ పాడాడు. ‘ఓమ్‌ స్వాగతమ్‌..’ అని ప్రారంభమయ్యే ఈపాట మైక్‌ టైసన్‌ ను కొనియాడుతూనే బప్పీ మార్క్‌ను చూపింది.

బప్పీ... ది గోల్డ్‌ మ్యాన్‌
‘నడిచే నగల దుకాణం’... బప్పీ లహిరి గురించి చాలామంది సరదాగా అనుకునే మాట ఇది. ఇక అందరూ ఆయన్ను ‘గోల్డ్‌ మ్యాన్‌  ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. ఎందుకంటే మెడలో కొబ్బరి తాడుని తలపించే బంగారు గొలుసులు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతులకు కడియాలు, మణికట్టు గొలుసులు... ఇలా బప్పీ ఒంటిపై బంగారం మెరిసేది. నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలన్నది ఆయన ఆకాంక్ష. అలాగే బంగారాన్ని అదృష్టంగా భావించి ఎప్పుడూ కనీసం ఎనిమిది చెయిన్‌ లను మెడలో వేసుకునేవారు. 1974లో బప్పీవాళ్ల అమ్మగారు తొలి బంగారపు గొలుసు ఇచ్చారు. తొలిసారి వేసుకున్న ఈ గొలుసు పేరు ‘ఏ హరే కృష్ణ చెయిన్‌ ’.

తర్వాత భార్య చిత్రాణి 1977లో బంగారపు గొలుసు ఇచ్చారు. ఈ రెండింటికి తోడు మరికొన్ని బంగారపు గొలుసులు వేసుకుంటూ గోల్డ్‌ మ్యాన్‌, బ్లింగ్‌ మ్యాన్‌గా ప్రఖ్యాతిగాంచారు. అలాగే వినూత్న వస్త్రధారణ, ప్రత్యేకమైన సన్‌ గ్లాసెస్‌ ధరించేవారు బప్పీ. ఏదైనా సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాలంటే ముందు రోజే ఏ డ్రెస్‌ వేసుకోవాలి? ఏ గ్లాసెస్‌ పెట్టుకోవాలి? ఏ ఆభరణాలు ధరించాలి? అనేది ప్లాన్‌ చేసేసుకునేవారట. విశేషం ఏంటంటే... వెరైటీ డ్రెస్సింగ్‌ మీద భర్తకి ఉన్న ఆసక్తి గమనించి, భార్య చిత్రాణి లహిరి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, సలహాలు ఇచ్చేవారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బప్పీయే స్వయంగా చెప్పారు కూడా.


కలసి రాని రాజకీయాలు
2014లో బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు ప్రస్తావిస్తూ, తనకు 754 గ్రాములు, భార్యకు 967 గ్రాముల బంగారం ఉందని, ఇద్దరిదీ కలిపి 13.5 కిలోల వెండి, కొన్ని విలువైన వజ్రాలున్నాయనీ బప్పీ పేర్కొన్నారు. అయితే సంగీత ప్రపంచంలో హిట్‌ రాగాలిచ్చిన బప్పీకి రాజకీయ జీవితం మాత్రం ఫ్లాప్‌ రాగం అనాలి. ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

– కె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement