![Music Director Shravan Rathod very criticalafter testing positive for Covid-19 - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/20/Shravan%20Rathod.jpg.webp?itok=9JMsu-ce)
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సినీరంగాన్ని కోవిడ్-19 పట్టి పీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ కరోనాతో అత్యంత "క్లిష్టమైన" స్థితిలో చికిత్స పొందుతున్నారు. దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్‌కు (నదీమ్- శ్రావణ్ ) ఇటీవల కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్ (66) పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉందని ఆయన కుమారుడు, మ్యూజిక్ కంపోజర్ సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. ఎస్ఎల్ రహేజా హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న, తన తండ్రి ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.
మరోవైపు దీర్ఘకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వైరస్ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని సంజీవ్ తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ఇతర సంగీత దర్శకులు ఆకాంక్షిస్తున్నారు. శ్రావణ్, త్వరగా కోలుకోవాలంటూ మరో సంగీత దర్శకుడు నదీమ్ సైఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తన భాగస్వామి శ్రావణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు,అభిమానులందరినీ వేడుకున్నారు. (కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్)
శ్రవణ్ రాథోడ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉన్నదని అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు కీర్తి భూషణ్ చెప్పారు. ఆయన చికిత్సం నిమిత్తం ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కాగా ఆషిఖీ, సాజన్, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు. (కరోనా రోగులకు డీఆర్‌డీవో అద్భుత పరికరం)
Comments
Please login to add a commentAdd a comment