భీమ్‌సింగ్ కణ్ణన్
ప్రముఖ ఛాయాగ్రాహకుడు భీమ్‌సింగ్ కణ్ణన్ శనివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కణ్ణన్ ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత, దర్శకుడు భీమ్‌సింగ్ కుమారుడు. బి. కణ్ణన్‌గా అందరికీ తెలిసిన ఈయన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజాతో ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఒక్క భారతీరాజాతోనే దాదాపు 40 సినిమాలు చేశారు కణ్ణన్. అందుకే తమిళనాడులో ‘భారతీరాజా విన్‌కన్‌గళ్’ (భారతీరాజా కళ్లు) గా ఆయన ప్రసిద్ధి. భారతీరాజాతో ఆయన చేసిన చివరి చిత్రం ‘బొమ్మలాట్టమ్’ (2008). తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు కెమెరామేన్‌గా పనిచేశారు కణ్ణన్. తెలుగులో ఆయన కెమెరామేన్‌గా పని చేసిన చిత్రాల్లో ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. కణ్ణన్‌కు భార్య కాంచన, కుమార్తెలు మధుమతి, జనని ఉన్నారు. ఫిల్మ్ మేకర్ బి. లెనిన్‌కి సోదరుడు కణ్ణన్. బి. కణ్ణన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కణ్ణన్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment