
సచిన్, వసంత్, స్టీవ్ వా (ఫైల్)
ముంబై: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా నిలిచిన వసంత్ నైసద్రాయ్ రైజీ (100) అనారోగ్యం కారణంగా శనివారం మృతి చెందారు. 1938–1949 మధ్య కాలంలో ముంబై, బరోడా జట్ల తరఫున ఆయన 9 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. మొత్తం 277 పరుగులు చేయగా, ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1920 జనవరి 26న జన్మించిన వసంత్.... మరణించే సమయానికి ప్రపంచంలోని అతి ఎక్కువ వయస్సు ఉన్న ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆయన 100వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా హాజరయ్యారు. ఆట నుంచి తప్పుకొని చార్టెడ్ అకౌంటెంట్‌గా రాణించిన వసంత్ క్రికెట్‌తో మాత్రం తను అనుబంధాన్ని కొనసాగించారు. రంజిత్ సింగ్‌జీ, దులీప్ సింగ్‌జీ, సీకే నాయుడు, విక్టర్ ట్రంపర్‌ల బయోగ్రఫీలు ఆయన రచించారు. వసంత్ మృతి పట్ల బీసీసీఐతో పాటు సచిన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.