Senior cricketers
-
‘వందేళ్ల’ వసంత్ కన్నుమూత
ముంబై: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా నిలిచిన వసంత్ నైసద్రాయ్ రైజీ (100) అనారోగ్యం కారణంగా శనివారం మృతి చెందారు. 1938–1949 మధ్య కాలంలో ముంబై, బరోడా జట్ల తరఫున ఆయన 9 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. మొత్తం 277 పరుగులు చేయగా, ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1920 జనవరి 26న జన్మించిన వసంత్.... మరణించే సమయానికి ప్రపంచంలోని అతి ఎక్కువ వయస్సు ఉన్న ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆయన 100వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా హాజరయ్యారు. ఆట నుంచి తప్పుకొని చార్టెడ్ అకౌంటెంట్‌గా రాణించిన వసంత్ క్రికెట్‌తో మాత్రం తను అనుబంధాన్ని కొనసాగించారు. రంజిత్ సింగ్జీ, దులీప్ సింగ్జీ, సీకే నాయుడు, విక్టర్ ట్రంపర్‌ల బయోగ్రఫీలు ఆయన రచించారు. వసంత్ మృతి పట్ల బీసీసీఐతో పాటు సచిన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
టి– 20 జిల్లా జట్టు ఇదే!
ఒంగోలు: స్థానిక శర్మా కాలేజి గ్రౌండులో టి–20 సీనియర్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ఆదివారం జరిగింది. మొత్తం 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 15 మందిని తుది జట్టుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారు ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏలూరులో జరిగే టి–20 సెంట్రల్ జోన్ క్రికెట్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చింతపల్లి ప్రతాప్‌కుమార్ తెలిపారు. ఎంపిక కోచ్ సుధాకర్ నేతృత్వంలో జరిగింది. సభ్యులు.. టి.వంశీకృష్ణ, సి.హెచ్.క్రాంతికుమార్, కె.క్రాంతికిరణ్, డి.తుమ్మల్, సి.హెచ్.సురేంద్ర, వి.వేణు, ఎ.వినయ్‌కుమార్, షేక్ అబ్దుల్లా, ఆర్.అచ్యుత్, పి.రవీంద్ర, బి.శివారెడ్డి, పి.వి పవన్‌కుమార్, టి.వి.ఎ.ఎం ప్రసాద్, కె.రాధేశ్యాం, జి.సాయికుమార్. జట్టుకు కోచ్/మేనేజర్‌గా కె.సుధాకర్ వ్యవహరిస్తారు. -
సీనియర్లు వెళతారా?
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక 29న ముంబై : వచ్చే నెలలో జరగాల్సిన జింబాబ్వే పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా... ఈనెల 29న భారత జట్టును మాత్రం ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సీనియర్ క్రికెటర్లు కొంతమంది ఈ పర్యటనకు దూరం కానున్నారనే వార్తల నేపథ్యంలో... విశ్రాంతి కావాలని తమకెవరూ ఇప్పటివరకూ చెప్పలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చెప్పారు. ఎవరైనా ఆటగాడు అందుబాటులో లేకపోతే బోర్డు కార్యదర్శి ఠాకూర్‌కు తెలియజేస్తారని ఆయన తెలిపారు. ఏడాది కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున కొందరు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి ద్వితీయ శ్రేణి జట్టును పంపిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. జింబాబ్వే పర్యటన గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. అయితే రెండు బోర్డుల వెబ్సైట్లలో ఈ సిరీస్ షెడ్యూల్ ఉంది. వచ్చే నెల 10, 12, 14 తేదీల్లో 3 వన్డేలు, 17, 19ల్లో రెండు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి.