
షీలాదీక్షిత్ అంతిమయాత్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిశాయి. ఇక్కడి నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు.
షీలాకు నివాళులర్పించిన వారిలో బీజేపీ కురువృద్ధ నేత ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎంలు అశోక్ గహ్లోత్, కమల్‌నాథ్ తదితరులు ఉన్నారు. ఆమె నివాసం నుంచి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతోపాటు, చివరగా బాధ్యతలు నిర్వహించిన ఢిల్లీ కాంగ్రెస్ విభాగం కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా అనేక రంగాలకు చెందిన ప్రజలు ఆమెకు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment