Shela Dikshit
-
షీలాకు కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిశాయి. ఇక్కడి నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. షీలాకు నివాళులర్పించిన వారిలో బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎంలు అశోక్ గహ్లోత్, కమల్‌నాథ్ తదితరులు ఉన్నారు. ఆమె నివాసం నుంచి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతోపాటు, చివరగా బాధ్యతలు నిర్వహించిన ఢిల్లీ కాంగ్రెస్ విభాగం కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా అనేక రంగాలకు చెందిన ప్రజలు ఆమెకు నివాళులర్పించారు. -
కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ (81) మృతి పట్ల ఆ పార్టీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మూడుసార్లు (1998-2013) దేశ రాజధాని ఢిల్లీ సీఎంగా, ఓసారి లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకుంది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె.. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి అత్యంత ఆప్తురాలుగా గుర్తింపు పొందారు. 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తాలో జన్మించిన షీలా కపూర్.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. కాలేజీ రోజుల నుంచే కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తింపుపొంది అంచెలంచెలు ఎదిగారు. తొలుత కాంగ్రెస్ మహిళా విభాగానికి నాయకత్వం వహించిన షీలా.. ఇందిరా గాంధీ ట్రస్ట్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. చివరి వరకు కాంగ్రెస్‌తోనే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణాంతరం జరిగిన తొలి ఎన్నికల్లో (1984) ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. అప్పుడు మొదలైన ఆమె ప్రస్థానం చివరి వరకు కాంగ్రెస్‌తోనే కొనసాగింది. తొలిసారి ఎంపీగా గెలిచినప్పటికీ రాజీవ్ హయాంలో కేంద్రమంత్రిగా, కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా, లోక్‌సభ అంచనాల కమిటీ సభ్యురాలిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి లాల్‌బిహరి తివారీ చేతిలో తొలిసారి ఓటమి చవిచూశారు. ఆ ఓటమే ఆమెకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. 1998లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆమె సీఎం పీఠం అధిరోహించారు. ఆ ఎన్నికల్లో ఆమె బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని బీజేపీని ఓడించి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి 2013 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు. సీఎంగా ఓటమి.. గవర్నర్‌గా బాధ్యతలు రెండుసార్లు గోలే మార్కెట్, ఓసారి న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. ఆ తరువాత 2012లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ఆద్మీ పార్టీ జీవం పోసుకోవడంతో.. సీఎంగా తొలి పరాజయాన్ని చవిచూశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవ్వడంతో.. అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్ 2012 మార్చి 11న నియమించింది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెంది.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో పాటు షీలా తన గవర్నర్ పదవిని కూడా కోల్పోయారు. కేంద్రం పిలుపుమేరకు 2014 ఆగస్ట్ 25న తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన షీలా.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయంతో నష్టపోయిన పార్టీకి ఊపిరి అందించే ప్రయత్నం చేశారు. రెండు రాష్ట్రాలకు సీఎం అభ్యర్థిగా.. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణ వర్గానికి చెందిన షీలాను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికీ జాతీయ స్థాయిలో తీవ్ర అవరోధాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు షీలా అభ్యర్థిత్వం కూడా పనిచేయలేక పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరజాయం పాలైంది. దీంతో రెండు రాష్ట్రాలకు సీఎం అభ్యర్థిగా ప్రకటించబడిన ఘనతను దక్కించుకున్నారు. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో చురుకుగా కనిపించిన ఆమె.. ఢిల్లీ సీఎం అరవింద్‌పై పెద్ద పోరాటమే చేశారు. అదే పోరాటపటిమతో 81 ఏళ్ల వయసులో కూడా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఢిల్లీ బీజేపీ చీఫ్ మనీష్ తివారీ చేతిలో దారుణ ఓటమిని చవిచూశారు. ఓవైపు ఓటమి, మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గత నెల రోజులుగా చికిత్స పొందుతూ.. శనివారం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆమె మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. -
మూడుసార్లు సీఎం.. ఈసారి విజయం సాధించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్.. ఈఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా సీనియర్ నేతైన షీలాను బరిలో ఉంచింది. కాంగ్రెస్‌కు కీలకంగా మారిన ఈఎన్నికల్లో షీలా విజయంపై కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. కనీసం నాలుగు స్థానాల్లోనైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈశాన్య ఢిల్లీలో ఆమెపై బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మనోజ్ తీవారి గట్టిపోటిని ఇస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఉత్కంఠ పోటీ నెలకొంది. మరోవైఉ ఆప్ కూడా విజయం కోసం ప్రయత్నిస్తోంది. 1998 నుంచి 2013 వరకు ఏకధాటిగా మూడుసార్లు ఢిల్లీ సీఎం పిఠాన్ని అధిరోహించిన చరిత్ర ఆమెకు ఉంది. జాతీయ రాజధానిలో కాంగ్రెస్ పార్టీని వరుసగా మూడుసార్లు అధికారంలోకి తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. న్యూఢిల్లీ శాసన సభ నుంచి ప్రాతినిథ్యం వహించి సీఎం అయిన షీలా గత ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు. తీవ్ర కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకునేందుకు షీలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకు నిజంచేయగలరనేది ఆసక్తికరంగా మారింది. ఏడు స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరిగినా నేతల మధ్య అవగహనలేకపోవడంతో చివరికి విడివిడిగానే బరిలోకి దిగక తప్పలేదు. కేజ్రీవాల్‌తో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నా షీలా మాత్రం వ్యతిరేకిస్తున్నారని స్థానిక నేతలు చెపుతున్నారు. అయితే జాతీయ రాజధాని ఢిల్లీలో షీలా ఎన్నిక ఆసక్తికరంగా మారింది. -
రేపే ఆరోదశ.. పోటీలో కీలక నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పలు రాష్ట్రాల్లో 59 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఘండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ చేతిలో తీవ్ర పరాభావానికి గురైన కాంగ్రెస్ ఈసారి కనీసం గౌరప్రదమైన స్థానాలను గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా షీలా విజయంపై పార్టీ గంపెడు ఆశాలను పెట్టుకుంది. ఆమెతో బీజేపీ సీనియర్ నేత మనోజ్ తివారి బరిలో ఉన్నారు. దేశ రాజధానికి మూడు సార్లు ఏకంగా సీఎంగా వ్యవహించడం, సీనియర్ నేత కావడంతో విజయావకాశాలు ఎక్కువగా తమకే ఉన్నాయని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మరో సీనియర్ నేత అజయ్ మాకెన్ బరిలో ఉన్నారు. 2004, 09 ఎన్నికల్లో విజయం సాధించిన మాకెన్ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మీనాక్షిలేఖిపై పరాజయం పాలైయ్యారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుంటున్నారు. కాగా ఈస్థానంలో ఎవరు గెలిస్తే ఆపార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే సాంప్రదాయం కూడా ఇక్కడుంది. గత రెండు దశాబ్ధాలుగా అదే జరుగుతూ వస్తోంది. ఈస్ట్ ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. ఎన్నికల బరిలో నిలవడంతో వివాదాలు గంభీర్‌ను చుట్టుముట్టుతున్నాయి. ఆప్ అభ్యర్థి ఆతిషి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీర్‌కు నోటీసులు కూడా పంపారు. మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి మధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈయనకు కీలక పదవి దక్కింది. ఇప్పటి వరకు గుణలో నాలుగు సార్లు విజయం సాధించిన సింథియా ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ ఆయన తరఫున గెలుపు బాధ్యతలను ఆయన భార్య ప్రియదర్శినీ రాజే మోస్తున్నారు. గెలపు తథ్యమనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తండ్రి ములాయం సింగ్ విజయం సాధించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలో నిలిచారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. రాజకీయాలకు కొత్తయినా ప్రచారం దూసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ నుంచి బీజేపీ తరపున వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తల్లి కేంద్రమంత్రి మేనకా గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో వరుణ్ సుల్తాన్ పూర్ నుంచి విజయం సాధించారు. ఈసారి వారిద్దరూ స్థానాలు మార్చుకున్నారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీపడుతున్నారు. ఈస్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాద్వీ ప్రజ్ఞాసింగ్ పోటీలో ఉన్నారు. -
నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరగట్లేదు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిర్భయ లాంటి అత్యాచార ఘటనలు ఎన్నో జరుగుతున్నా ఇప్పటికీ వెలుగులోకి రావడంలేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ ఉద్దంతం జరిగినప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న తన ప్రభుత్వంపై నిందవేయడానికి కొందరు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. 2012 డిసెంబర్ 16న ఫారామెడికల్ విద్యార్థిని గ్యాంగ్‌రేప్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో షీలా ఢిల్లీ సీఎంగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా కేవలం నిర్భయ ఘటనను కేంద్రంగా చేసుకుని తమ ప్రభుత్వంపై ఆరోపణలకు దిగినట్లు ఆమె గుర్తుచేశారు. శనివారం ఆమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించారు. నిర్భయ లాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎన్ని జరగట్లేదని ఆమె ప్రశ్నించారు. 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్లు సీఎంగా వ్యవహరించానని, ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కావడం మూలంగా భద్రతా వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, ఆ సమయంలో తాము చేసేందేమీ లేదని ఆమె అన్నారు. ప్రభుత్వాలు మారినా ఇప్పటికి కూడా చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నార్త్ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షీలా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన జాతీయ పార్టీఅని, ఆప్ ఇటీవల పుట్టిన చిన్న ప్రాంతీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని షీలా ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 12న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. -
పొరుగు రాష్ట్రాల్లో చురుగ్గా మెట్రో
ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం లేఖ రాసింది. ఇతర ప్రాంతాల్లో మెట్రోరైలు ప్రాజెక్టుల నిర్మాణం, కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరించింది. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని కొత్త ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రోత్సహిస్తారని డీఎంఆర్సీ భావిస్తోంది. న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా వైదొలగడం వల్ల మెట్రో విస్తరణ మరింత చురుగ్గా కొనసాగుతాయని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) భావిస్తోంది. షీలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెలుపల మెట్రో పనులకు అడ్డంకులు సృష్టిం చారనే విమర్శలు ఉన్నాయి. అదనపు రాబడికి వీలుగా తాము కన్సల్టెన్సీ సేవలు ప్రారంభించేం దుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నోయిడా, ఘజియాబాద్, లక్నోలో మెట్రో ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగుతాయని భావిస్తున్నారు. నిజానికి ఢిల్లీ బయటి ప్రాంతాల్లో పనులు చేపట్టడం వల్ల రాజధానిలో మెట్రో సేవలకు ఎటువంటి ఇబ్బందులూ కలగబోవని డీఎంఆర్సీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీక్షిత్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో పనులు చేపట్టాల్సిందిగా డీఎంఆర్సీపై తాము ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చామని పట్టణాభివృద్ధిశాఖ వర్గాలు తెలిపాయి. ‘లక్నో మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక తయారీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని మార్పులు సూచిస్తూ వ్యాఖ్యలు రాశాం. త్వరలోనే లక్నోలో మెట్రోరైలు నిర్మాణ పనులు మొదలుపెడతాం. బయటి రాష్ట్రాల్లో పనులు చేపట్టడానికి డీఎంఆర్సీ అధికారులు దీక్షిత్‌కు నచ్చజెప్పాల్సి వచ్చేది. అయినప్పటికీ ఢిల్లీలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదు’ అని ఆయన వివరించారు. ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ మోహన్ స్పోలియా డీఎంఆర్సీకి లేఖ రాశారు. దీక్షిత్ సూచన మేరకే ఆయన ఈ పనిచేశారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని అప్పట్లోనే దీక్షిత్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీలోనే చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. లక్నో మెట్రో ప్రాజెక్టు నుంచి డీఎంఆర్సీ తప్పుకొని ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అయితే కే జ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంతోషంగానే ఉంది. ‘యూపీ రాష్ట్ర పరిధిలోనే మెట్రో ప్రాజెక్టులకు కేజ్రీవాల్ అడ్డుచెప్పే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ కూడా ఆయన పార్టీని విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి మెట్రో విస్తరణకు సహకరిస్తారు’ అని ఒక అధికారి వివరించారు. చురుగ్గా మూడోదశ ఢిల్లీలోనూ మెట్రో మూడోదశ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. విస్తరణలో భాగంగా డీఎంఆర్సీ చేపట్టిన మూడోదశ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల మెట్రోమార్గాలు, స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. 2016 కల్లా మూడోదశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడోదశలో మొత్తం 103.05 కిలోమీటర్ల మేర మెట్రోమార్గాలను నిర్మిస్తారు. ముకుంద్‌పూర్-యమునావిహార్ కారిడార్‌ను 55.69 కిలోమీటర్ల పొడవున, జనక్‌పురి వెస్ట్-కాళిందికుంజ్ కారిడార్‌ను 33.49 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీగేట్ మార్గాన్ని 9.37 కిలోమీటర్ల పొడవున, జహంగీర్‌పురి-బద్లి మార్గాన్ని 4.489 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఈ దశలో 67 స్టేషన్లు, 15 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉంటాయి. 2016 నాటికి ఢిల్లీ మెట్రోరైళ్లలో ప్రతినిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తారని భావిస్తున్నారు. మూడోదశ నిర్మాణానికి రూ.35,242 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. మూడోదశలో అనేక మార్గాలను భూగర్భంలో నిర్మిస్తారు. వీటి కోసం సొరంగాలను తవ్వడానికి విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను (టీబీఎం) తెప్పించారు.