పొరుగు రాష్ట్రాల్లో చురుగ్గా మెట్రో
Published Thu, Dec 26 2013 10:52 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం లేఖ రాసింది. ఇతర ప్రాంతాల్లో మెట్రోరైలు ప్రాజెక్టుల నిర్మాణం, కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరించింది. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని కొత్త ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రోత్సహిస్తారని డీఎంఆర్సీ భావిస్తోంది.
న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా వైదొలగడం వల్ల మెట్రో విస్తరణ మరింత చురుగ్గా కొనసాగుతాయని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) భావిస్తోంది. షీలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెలుపల మెట్రో పనులకు అడ్డంకులు సృష్టిం చారనే విమర్శలు ఉన్నాయి. అదనపు రాబడికి వీలుగా తాము కన్సల్టెన్సీ సేవలు ప్రారంభించేం దుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నోయిడా, ఘజియాబాద్, లక్నోలో మెట్రో ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగుతాయని భావిస్తున్నారు.
నిజానికి ఢిల్లీ బయటి ప్రాంతాల్లో పనులు చేపట్టడం వల్ల రాజధానిలో మెట్రో సేవలకు ఎటువంటి ఇబ్బందులూ కలగబోవని డీఎంఆర్సీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీక్షిత్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో పనులు చేపట్టాల్సిందిగా డీఎంఆర్సీపై తాము ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చామని పట్టణాభివృద్ధిశాఖ వర్గాలు తెలిపాయి. ‘లక్నో మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక తయారీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని మార్పులు సూచిస్తూ వ్యాఖ్యలు రాశాం. త్వరలోనే లక్నోలో మెట్రోరైలు నిర్మాణ పనులు మొదలుపెడతాం. బయటి రాష్ట్రాల్లో పనులు చేపట్టడానికి డీఎంఆర్సీ అధికారులు దీక్షిత్‌కు నచ్చజెప్పాల్సి వచ్చేది. అయినప్పటికీ ఢిల్లీలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదు’ అని ఆయన వివరించారు.
ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ మోహన్ స్పోలియా డీఎంఆర్సీకి లేఖ రాశారు. దీక్షిత్ సూచన మేరకే ఆయన ఈ పనిచేశారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని అప్పట్లోనే దీక్షిత్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీలోనే చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. లక్నో మెట్రో ప్రాజెక్టు నుంచి డీఎంఆర్సీ తప్పుకొని ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అయితే కే జ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంతోషంగానే ఉంది. ‘యూపీ రాష్ట్ర పరిధిలోనే మెట్రో ప్రాజెక్టులకు కేజ్రీవాల్ అడ్డుచెప్పే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ కూడా ఆయన పార్టీని విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి మెట్రో విస్తరణకు సహకరిస్తారు’ అని ఒక అధికారి వివరించారు.
చురుగ్గా మూడోదశ
ఢిల్లీలోనూ మెట్రో మూడోదశ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. విస్తరణలో భాగంగా డీఎంఆర్సీ చేపట్టిన మూడోదశ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల మెట్రోమార్గాలు, స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. 2016 కల్లా మూడోదశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడోదశలో మొత్తం 103.05 కిలోమీటర్ల మేర మెట్రోమార్గాలను నిర్మిస్తారు. ముకుంద్‌పూర్-యమునావిహార్ కారిడార్‌ను 55.69 కిలోమీటర్ల పొడవున, జనక్‌పురి వెస్ట్-కాళిందికుంజ్ కారిడార్‌ను 33.49 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీగేట్ మార్గాన్ని 9.37 కిలోమీటర్ల పొడవున, జహంగీర్‌పురి-బద్లి మార్గాన్ని 4.489 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఈ దశలో 67 స్టేషన్లు, 15 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉంటాయి. 2016 నాటికి ఢిల్లీ మెట్రోరైళ్లలో ప్రతినిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తారని భావిస్తున్నారు. మూడోదశ నిర్మాణానికి రూ.35,242 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. మూడోదశలో అనేక మార్గాలను భూగర్భంలో నిర్మిస్తారు. వీటి కోసం సొరంగాలను తవ్వడానికి విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను (టీబీఎం) తెప్పించారు.
Advertisement