Delhi Metro Rail
-
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన దేవెగౌడ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీ వాసులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఢిల్లీ మెట్రో రైలులో దేవెగౌడ ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా దేవెగౌడ మెట్రో ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన వీడియోను దేవెగౌడ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. VIDEO | Former Prime Minister of India HD Devegowda (@H_D_Devegowda) travels in Delhi metro.(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/Oa6WJSYcQT— Press Trust of India (@PTI_News) August 4, 2024 91 ఏళ్ల వయసున్న దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన 1996 నుంచి 1997 దాకా దేశ ప్రధానిగా పనిచేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టుకు బీజం పడింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పుడే రూపొందించారు. దేవెగౌడ కుమారుడు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ చీఫ్ కుమారస్వామి ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. -
ఢిల్లీ మెట్రోలో మరోసారి అమ్మాయిల రచ్చ: వీడియో వైరల్
సోషల్ మీడియా పిచ్చితో మెట్రో రైళ్లలో కొంతమంది తీరు అభ్యంతరకరంగా, తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే, తాజాగా ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.इन रील्स वालों के लिए एक दो मेट्रो कही साइड में खड़ी कर दो यार जहां देखो वहां चालू हो जाते है । #DelhiMetro में तो ये चल ही रहा है कही #MumbaiMetro में भी ये चालू न हो जाए pic.twitter.com/l8pzDHKxpy— Mahendra Singh (@mahendrasinh280) June 11, 2024సోషల్ మీడియాలో యూజర్ల రీల్స్‌తో గతంలో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతీ యువకుల ఆకతాయి పనులకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్సింగ్ వీడియోనే ఇందుకు ఉదాహరణ. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న కనీస స్పృహను కూడా మర్చిపోయిన అమ్మాయిలు భోజ్‌పురి పాటకి రాడ్ పక్కన నిలబడి స్టెప్పు లేశారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు చూసీ చూడనట్టు కొందరు, మరి కొందరు అసహనం వ్యకం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో పోస్ట్ అయింది. మహేంద్ర సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ రీల్స్ చేసేవాళ్ల కోసం ఒకటి రెండు మెట్రోలు సైడ్‌కి నిలపండి రా బాబూ, ఎక్కడ చూసినా ఈ రీల్స్ గోలే.. ఈ జాడ్యం ముంబై మెట్రోకి కూడా విస్తరించకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
మెట్రో ట్రైన్లో నిర్మలా సీతారామన్ .. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
140 కోట్ల భారతీయులున్న దేశానికి ఆర్థిక మంత్రి. 3937 బిలియన్ డాలర్ల మూలధన లెక్కలను చూసే నాయకురాలు ఢిల్లీ మెట్రో ఎక్కి ప్రయాణం చేస్తే ఆశ్చర్యపోరా మరి.!అవును కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధాసీదా ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రో రైలులో లక్ష్మీ నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.అయితే నిర్మలా సీతారామన్ మెట్రో ట్రైన్లో ప్రయాణించడంపై మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం 2024 లోక్ సభ ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణిస్తున్న వీడియోపై నెటిజన్లు ఇలా స్పందించారు ‘పన్ను సంబంధిత ప్రశ్న అడగాలి’ అని ఒక యూజర్ అంటుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాను ఎంచుకుని, తోటి ప్రయాణికులతో మమేకమవడం సంతోషంగా ఉంది. సహచరులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. మరో యూజర్ మాత్రం.. నిర్మలా సీతారామన్ మెట్రో ప్రయాణం ఎన్నికల స్టంట్. ఎందుకంటే.. అధికారంలో ఉన్న 10ఏళ్లలో ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించారా? సాధారణ ప్రయాణికులతో ఎప్పుడైనా ముచ్చటించారా అని వ్యాఖ్యానించారు. Smt @nsitharaman travels in Delhi Metro to Laxmi Nagar and interacts with fellow commuters. pic.twitter.com/HYSq3oUiAo— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 17, 2024 -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు కొత్త మెట్రో లైన్లను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైల్ ఫేజ్-4లో భాగంగా ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు, లజపతి నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ వరకు నిర్మాణం చేపట్టనుంది. రూ. 8,339 కోట్లతో ఈ రెండు కొత్త కారిడార్ల నిర్మాణం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమవేశమైన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు 8.4 కి.మీ మెట్రో లైన్ ఎనిమిది స్టేషన్లను కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.4 కి.మీ పొడవు ఉంటుందని పేర్కొన్నారు. వీటి మధ్య పది స్టేషన్లు ఉండనున్నట్లు తెలిపారు. మార్చి 29 నాటికి వీటి నిర్మాణం పూర్తవ్వనున్నట్లు చెప్పారు. దీనితో రాజధాని మెట్రో నెట్వర్క్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 450 కి.మీకి విస్తరించనుంది. ప్రధాని మోదీ అధ్యతన సమవేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. మార్చి 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ టర్మ్‌కు ఇదే చివరి కేబినెట్ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. చదవండి: బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం -
రెండో దశ మెట్రో రూట్ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులు చేసే అంశంపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ (27 కి.మీ)మార్గం ఏర్పాటుపై గతంలో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ రూపొందించిన నివేదికలో సూచించిన అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రూట్లో ఎస్ఆర్డీపీ పథకం కింద నూతనంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్దారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మెట్రో మార్గాన్ని ఫ్లైఓవర్ల వద్ద అత్యంత ఎత్తున ఏర్పాటు చేయడం అనేక వ్యయ ప్రయాసలతో కూడుకోవడమే కారణమని సమాచారం. గతంలో ఈ మార్గానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రెండేళ్ల క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సిద్ధం చేసిన విషయం విదితమే. బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ మెట్రో రూట్ ఇలా.. ఈ మార్గాన్ని బీహెచ్ఈఎల్, మదీనాగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ జంక్షన్, షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డికాపూల్ రూట్లో ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఈ రూట్లోనే తాజాగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడంతో మెట్రో మార్గానికి అడ్డొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని దాటుతూ మెట్రోను ఏర్పాటు చేసేందుకు అధిక వ్యయం కావడం, ప్రధాన రహదారిపై పనులు చేపట్టేందుకు వీలుగా రైట్ఆఫ్ వే ఏర్పాటు చేయడం వీలుకానందున మెట్రో మార్గంలో స్వల్ప మార్పులు అనివార్యమని హెచ్ఎంఆర్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మార్పులపై మెట్రో వర్గాల మౌనం.. మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) ఉన్నతాధికారులను ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించగా.. ఈ అంశం తమ పరిధిలోది కాదని.. మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. డీఎంఆర్సీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంశాలివే.. బీహెచ్ఎఈఎల్–లక్డికాపూల్ మార్గంలో 22 మెట్రో స్టేషన్ల ఏర్పాటు. బీహెచ్ఈఎల్లో మెట్రో డిపో ఏర్పాటుకు 70 ఎకరాల స్థలం కేటాయింపు. రెండోదశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక,ట్రాక్‌ల నిర్మాణం. భద్రతా పరమైన చర్యలు. టికెట్ ధరల నిర్ణయం. రెండోదశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ. వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన. ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూలు ఖరారు. (చదవండి: పోలీసు కొలువు కొట్టేలా!) -
7 న మెట్రో పునఃప్రారంభం, చర్యలివే!
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు అన్‌లాక్-4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. అయితే, కోవిడ్ కేసుల్లో ఆరో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో మెట్రో పునఃప్రారంభం ఏమేరకు ప్రభావం చూపుతుందోనని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో సర్వీసుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ తెలిపారు. సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని ఆదివారం మీడియాకు చెప్పారు. గతంలో మాదిరిగా ప్రయాణికులకు టోకెన్స్ జారీ చేయమని చెప్పారు. ఎంట్రీ వద్దనే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డులు, ఇతర డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే పేమెంట్లు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దాంతోపాటు లిఫ్టుల్లో కూడా తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగా స్టేషన్లలో మెట్రో రైలు నిలిచే సమయం పెంచుతామని తెలిపారు. కాగా, కోవిడ్ నియంత్రణలో భాగంగా మార్చి నెలలో ఢిల్లీ సర్వీసుల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దాదాపు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఇక మెట్రో పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: ఢిల్లీ మెట్రో స్టేషన్లో పాము హల్చల్) -
భర్త మరణాన్ని తట్టుకోలేక దారుణం..!
న్యూఢిల్లీ : భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కన్న కూతురికి ఉరివేసి చంపేసి.. తనూ ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన నొయిడాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. నొయిడా 1 సీఐ శ్వేతాబ్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన వ్యక్తి (33) ఇక్కడి ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య(30), ఒక కూతురు(5).. ఢిల్లీలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్న తన తమ్ముడితో కలిసి సెక్టార్ 128లో గత నాలుగు నెలలుగా నివాసముంటున్నాడు. అయితే, శుక్రవారం ఉయదం 11.30 గంటల సమయంలో అతను జవహర్లాల్ నెహ్రూ మెట్రో స్టేషన్లో రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మనోహర్‌లాల్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన అతని భార్య, తమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాత్రి కావడంతో వదిన, చిన్నారిని ఇంటికి పంపించిన మృతుని సోదరుడు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శనివారం ఉదయం చూసేసరికల్లా వారి ప్లాట్‌లో తల్లీ కూతుళ్లు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. భర్త మరణం తట్టుకోలేకనే మహిళ తన కూతురు ప్రాణాలు తీసి.. తనూ బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
ఉచిత ప్రయాణానికి నో చెప్పిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేజ్రీవాల్ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధానిలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం గురువారం తిరస్కరించింది. కాగా ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల జరుగునున్న విషయం తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలకు ఆప్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించింది. ఇందుకు అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా కేంద్రం తాజా నిర్ణయంతో కేజ్రీవాల్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చదవండి: త్వరలో మహిళలకు మెట్రోలో ఫ్రీ జర్నీ ఢిల్లీ మహిళలకు శుభవార్త -
త్వరలో మహిళలకు మెట్రోలో ఫ్రీ జర్నీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ సర్కారు ప్రతిపాదించిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తేవడానికి ఢిల్లీ మెట్రో దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించింది. సాఫ్ట్వేర్ మార్చి టోకెన్లు, స్మార్ట్‌కార్డులు రెండింటినీ మహిళా ప్రయాణీకులు ఉపయోగించేలా చేయడమనేది దీర్ఘకాల ప్రణాళిక కాగా, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక టికెట్ వెండింగ్ మిషన్లు, ప్రత్యేక ప్రవేశ గేట్లు ఏర్పాటుచేసి వారికి పింక్ టోకెన్లు జారీ చేయాలని స్వల్పకాలిక ప్రణాళికలో సూచించారు. దీర్ఘకాల ప్రణాళికను అమలు చేయడానికి సంవత్సరానికి పైగా సమయం పడుతుందని, స్వల్పకాలిక ప్రణాళికను అమలుచేయడానికి కనీసం ఎనిమిది నెలల సమయం కావాలని ఢిల్లీ మెట్రో తెలిపిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అయితే కేంద్రం నియమించిన చార్జీల నిర్థారణ కమిటీ ఈ ప్రణాళికను అమోదించవలసి ఉంటుందని ఆ తరువాతనే తాము ఈ ప్రణాళికను అమల్లోకి తేగలమని ఢిల్లీ మెట్రో ఢిల్లీ సర్కారుకు సూచించింది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత 30 శాతమున్న మెట్రో మహిళా ప్రయాణీకుల సంఖ్య 50 శాతానికి పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. -
పాలనాదక్షుడు...
స్వేచ్ఛా వాణిజ్యానికీ, సరళతర ఆర్థిక విధానాలకు దన్ను ఇచ్చిన వాజ్‌పేయి ఆర్థిక సంస్కరణల్లో తనదైన ముద్రవేశారు. 1991లో పీవీ నరసింహరావు ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాల స్ఫూర్తిని వాజ్‌పేయి కొనసాగించారు. వాజ్‌పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే తరువాతి ప్రధానులు కొనసాగించారు. దేశాన్ని నూతన శకంవైపు నడిపించడానికి రాజమార్గాలు వేశారు. ప్రధానంగా ‘పెట్టుబడుల ఉపసంహరణ’‘ఆర్థిక దుబారా’లాంటి ఆర్థిక సంస్కరణలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. వాజ్‌పేయి హయాంలో ఆర్థిక సంస్కరణలు.. మౌలిక సదుపాయాల కల్పన: మౌలిక సదుపాయాల కల్పనకు వాజ్‌పేయి ప్రభుత్వం పెట్టింది పేరు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా విడివడి ఉన్న గ్రామాలన్నింటినీ కలిపే గొప్పకార్యాన్ని చేపట్టారు. దీంతో గ్రామాల నుంచి వ్యవసాయ ఉత్పాదనలు దేశ వ్యాప్తంగా రవాణా చేసేందుకు వీలు అయ్యింది. అలాగే చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నిర్మించడంలో కృత కృత్యులయ్యారు. ఆర్థిక దుబారా నియంత్రణకు చట్టం... ఆర్థిక దుబారాని నియంత్రించేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం కృషి చేసింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆర్థిక దుబారా నియంత్రణకు వాజ్‌పేయి ప్రభుత్వం పూనుకుంది. 2000 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 0.8 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పొదుపుని 2005 కల్లా 2.3 శాతానికి వృద్ధి చేసిన ఘనత వాజ్‌పేయిదే. జీడీపీ సైతం రెండంకెల స్థాయికి చేరువయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేటైజేషన్... వ్యాపార రంగంలో ప్రభుత్వ పాత్రను వాజ్‌పేయి వ్యతిరేకించేవారు. అందులో భాగంగానే పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సహించారు. దానికి ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఆర్థికశాఖా మంత్రి అరున్జైట్లీయే ఆ శాఖకు తొలి మంత్రి. భారత్ అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్ జింక్, ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే వీఎస్ఎన్ఎల్లు నాటి ప్రధాన పెట్టుబడుల ఉపసంహరణల్లోనివి. టెలికం విప్లవం... దేశంలో మొబైల్ ఫోన్ విప్లవానికి ఆద్యుడు వాజ్‌పేయి. కాల్‌రేట్లను తగ్గించి, టెలికాం కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారులువేస్తూ సరికొత్త టెలికాం విధానానికి శ్రీకారం చుట్టారు. నిర్ణీత లైసెన్స్ ఫీజు, ఆదాయం పంచుకునే పద్ధతి స్థానంలో సరికొత్త టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు వాజ్‌పేయి. టెలికాం రంగంలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ని ఏర్పాటుచేసి, ప్రభుత్వ నియంత్రణ, వివాదాల పరిష్కారాల పాత్రను వేరుచేసారు. ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ ఎంతగా ఎదిగిందంటే ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి మంత్రం అయిన జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం–జామ్)లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఢిల్లీ మెట్రో రైలుకి అంకురార్పణ... ఢిల్లీలో మెట్రో రైలు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది వాజ్‌పేయి హయాంలోనే. మెట్రో రాకతో పట్టణ ప్రజల రవాణా సమస్య పరిష్కార మైంది. టెలికం విధానం ప్రవేశపెట్టడం ద్వారా టెలికాం రంగంలో విప్లవాన్ని సృష్టించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టుల్లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కి నిధులు ... భారతదేశంలోనే తొలి ఆధునిక మెట్రోరైలు ప్రాజెక్టుకి అంకురార్పణ. విద్యా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలు విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యాన్ని గర్తించి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం ఢిల్లీ లాహోర్ బస్సు ప్రారంభంతో పాకిస్తాన్‌తో స్నేహానికి దారులు వేసారు... -
ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆగిన ‘మెట్రో’ సమ్మె
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు తీర్పుతో దేశ రాజధాని వాసులకు ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను మెట్రోరైల్ సిబ్బంది వాయిదా వేసుకున్నారు. వేతన పెంపుతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు మెట్రో క్షేత్రస్థాయి సిబ్బంది నోటీసులిచ్చారు. దీంతో వారితో శుక్రవారం రెండు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావటంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమ్మె న్యాయబద్ధంగా లేదనీ, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని కోర్టు సూచించింది. సమ్మె కారణంగా 25 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతారంది. దీంతో సమ్మెను నిలిపి వేస్తున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని మెట్రోలో పనిచేసే సుమారు 12వేల మందిలో 9వేల మంది క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉన్నారు. -
మద్యం మత్తులో మహిళ మెట్రో ఎక్కబోతే..
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరవైన క్రమంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. మద్యం మత్తులో ఉన్న మహిళని క్షేమంగా ఇంటికి చేరేలా చేశారు. దక్షిణ ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల ఓ మహిళ సోమవారం రాత్రి 10.45 గంటలకు సమయ్‌పూర్ బాడ్లీ మెట్రో స్టేషన్‌కి చేరుకుంది. అప్పటికే ఆమె అతిగా మద్యం సేవించి నడవలేని స్థితిలో ఉంది. ఆమె పరిస్థితిని అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది గమనించి లోపలికి అనుమతించలేదు. మద్యం మత్తులో ఆమె ఒంటరిగా ప్రయాణించడం సాధ్యం కాదని యువతిని క్షేమంగా గమ్యం చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఫోన్ నుంచి మహిళ భర్తకి కాల్ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెని తన భర్తకి అప్పగించి, క్షేమంగా ఇంటికి చేరడానికి సహకరించారు. దీనిపై సీఐఎస్ఎఫ్ అధికారులు స్పందిస్తూ.. మద్యం సేవించిన వారిని మెట్రో ప్రయాణానికి అనుమతిస్తే మిగతవారికి ఇబ్బందిగా ఉంటుదన్నారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కలేని స్థితిలో ఉందన్నారు. అందుకే ఆమెని అడ్డుకున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రత ముఖ్యం కాబట్టి, ఆమెకి తోడుగా ఒక లేడి కానిస్టేబుల్, ఒక మేల్ కానిస్టేబుల్లని పంపి క్షేమంగా తన భర్తకి అప్పగించామన్నారు. -
ప్రజా రవాణాను బాగా వాడండి
నోయిడా/న్యూఢిల్లీ: పౌరులు వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు తమ సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ఇంధన వినియోగం తగ్గి, తద్వారా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చుతగ్గుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ కొత్తగా నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని మోదీ సోమవారం ప్రారంభించారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ పురీ తదితరులతో కలసి మోదీ మెట్రోరైలులో ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. అప్పుడే సుపరిపాలన సాధ్యం ‘గతంలో కొందరు రాజకీయ నేతలు ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ‘నాకు ఏం లాభం?, నేనెందుకు చేయాలి?’ అని ఆలోచించేవారు. ఆ ఆలోచనా విధానాల్ని మేం రూపుమాపాం. భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశమైనా, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరకపోవడానికి కారణం సరైన పరిపాలన లేకపోవడమే. దానిని సరిదిద్దే బాధ్యతను నా భుజాలకెత్తుకున్నాను’ అని మోదీ వివరించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అప్పటికల్లా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చులను తగ్గించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. వాజ్‌పేయినే తొలిసారి ప్రయాణించారు 2002 డిసెంబరు 24న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఢిల్లీలో తొలిసారిగా మెట్రోరైలును ప్రారంభించి, ప్రయాణించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. గ్రామాలకు రోడ్లు నిర్మించడం, ఆ రోడ్లను ప్రధాన రహదారులతో అనుసంధానించడం ఇవన్నీ వాజ్‌పేయి ఆలోచనలేననీ, అభివృద్ధి జరగాలంటే ముందుగా రవాణా సౌకర్యాలే ముఖ్యమని మోదీ అన్నారు. మెజెంటా లైన్‌తో దక్షిణ ఢిల్లీ, నోయిడా మధ్య ప్రయాణ సమయం గతంతో పోలిస్తే అర్ధగంటకు పైగా తగ్గనుంది. ఇప్పటివరకు నోయిడా నుంచి దక్షిణ ఢిల్లీకి 52 నిమిషాల సమయం పడుతుండగా, మెట్రో రైలులో అయితే కేవలం 19 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఢిల్లీ మెట్రోరైళ్లలో పెంచిన చార్జీలను సీఎం కేజ్రీవాల్ తగ్గించమని బహిరంగంగానే కోరతారనే భయంతోనే ఆయనను మెట్రోరైలు మార్గం ప్రారంభానికి పిలవలేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. యోగికి మోదీ పొగడ్తలు నోయిడాలో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులెవరూ మళ్లీ సీఎం కారనే ఒక మూఢనమ్మకం ఆ రాష్ట్రంలో ప్రచారంలో ఉంది. కానీ యోగి ఆదిత్యనాథ్ దానిని పట్టించుకోకుండా నోయిడాకు వచ్చారనీ, ఆయన ధైర్యవంతుడని మోదీ అన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అచ్చం ఇలాంటి వదంతులు ఉన్న ఆరు నుంచి ఏడు ప్రాంతాలకు వెళ్లాననీ, అయినా 20 ఏళ్లు సీఎంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. -
మెట్రోలో రేట్ల దెబ్బకు 3 లక్షల మంది తగ్గారు!
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ మెట్రో టికెట్ రేట్లు పెంచడంతో అందులో రోజూ ప్రయాణించేవారిలో 3 లక్షల మంది(11 శాతం) తగ్గిపోయారు. మెట్రోలో సెప్టెంబర్ నెలలో రోజుకు సగటున 27.4 లక్షల మంది ప్రయాణించగా.. ఈ సంఖ్య అక్టోబర్‌లో 24.2 లక్షలకు పడిపోయింది. ఈ మేరకు ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) జవాబిచ్చింది. -
మెట్రోకు సోలార్ విద్యుత్?
దేశ రాజధాని ఢిల్లీలో నడుస్తున్న మెట్రో రైళ్లకు మధ్యప్రదేశ్‌లోని సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్తు అందే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కి, ప్రపంచంలోనే అతి పెద్దదైన 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు డెవలపర్లకు మధ్య పీపీఏలు కుదుర్చుకుంటున్నామని మధ్యప్రదేశ్ పునరుత్పాదక ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి మను శ్రీవాస్తవ చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి 'సరి-బేసి' పద్ధతిలో కార్లు నడుపుతున్నా, మెట్రోరైళ్లకు మాత్రం ప్రతిరోజూ విద్యుత్తు కావల్సిందే. ఇది కూడా సోలార్ విద్యుత్ అయితే విద్యుత్ ఉత్పత్తిలో కాలుష్యం చాలావరకు తగ్గుతుందన్న ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో రేవా జిల్లాలోని బంద్వర్ ప్రాంతంలో 1500 హెక్టార్ల విస్తీర్ణంలో సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక్కడ ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 6 కోట్ల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు అమెరికాలోని కాలిఫోర్నియాలోగల మొజేవే ఎడారిలో ఉంది. అది కేవలం 392 మెగావాట్ల ప్రాజెక్టు. దానికంటే చాలా పెద్ద ప్రాజెక్టును ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తున్నారు. -
ఢిల్లీలో దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మెట్రో రైల్లో సీటు కోసం జరిగిన ఘర్షణ బాలుడి ప్రాణాలు బలిగొంది. సీటు కోసం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. విచక్షణ కోల్పోయిన విద్యార్థులు ఇషు(16) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపారు. కింగ్స్ వే క్యాంప్ సమీపంలో జరిగిన ఈ ఘటన మెట్రో రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో
దేశరాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు నరకం చూపించింది. అందులో ఓ సాంకేతిక లోపం తలెత్తడంతో పలు రైళ్లు చాలా ఆలస్యంగా నడచాయి, చాలా సేపటి పాటు కొన్ని స్టేషన్లలో ఆగిపోయాయి. దాంతో వాటిలో జనం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి నోయిడా సిటీ సెంటర్ / వైశాలి ప్రాంతానికి వెళ్లే బ్లూలైనులో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. నోయిడా నుంచి బయల్దేరిన ఒక రైలు ద్వారకా సెక్టార్ 14 స్టేషన్ వద్ద ఆగిపోయిందని ఢిల్లీ మెట్రో రైలు అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత రైలును పక్కకు తీసుకెళ్లిపోయి సమీపంలోని డిపోలో మరమ్మతులు చేయించామని, అందులో ఉన్న ప్రయాణికులందరినీ దించేశామని చెప్పారు. అయితే, ప్రయాణికులు చెప్పేది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తాను ఉదయం 9.15 గంటలకు ద్వారకా సెక్టార్ 9 స్టేషన్ వద్ద రైలు ఎక్కానని, అది 10 గంటల వరకు అక్కడే ఉండిపోయిందని, తాను మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఆఫీసుకు వెళ్లలేకపోయానని సంగీత అనే ప్రయాణికురాలు చెప్పారు. బ్లూలైన్ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. -
అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులకు సూచించారు. మెట్రో రైలును ప్రోత్సహించడంతోపాటు ప్రయాణికుల సాధక బాధకాలను ఆలకించేందుకు ఆయన సోమవారం ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు స్టేషన్ నుంచి శివాజీ పార్కు స్టేషన్ వరకూ ప్రయాణించారు. వీటి సేవలు ప్రజాదరణ పొందేలా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ప్రయాణ చార్జీల భారం తగ్గించేం దుకు కృషి చేస్తామన్నారు. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోం దంటూఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌పై ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. మెట్రో రైలు వ్యవస్థ బాగుందన్నారు. ‘నిజంగా సకాలంలో, అత్యంత సౌకర్యవంతంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునేవారికి ఇదొక చక్కని ప్రజారవాణా వ్యవస్థ అని నేను భావిస్తున్నా. ఢిల్లీ మెట్రోతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న ఈ వ్యవస్థ నవీన భారతానికి సూచిక .మనం కనుక మంచి అవకాశాలు కల్పించగలిగితే వాటిని సద్వినియోగం చేసుకోగల సామర్థ్యం మన ప్రజలకు ఉంది. వారు అద్భుతాలు సృష్టించగలుగుతారు’ అని అన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య... పలువురు ప్రయాణికులతో ముచ్చటించి వారి సాధక బాధకాలను ఎంతో ఓపిగ్గా ఆలకించారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించారు. ప్రయా ణ చార్జీలు, ఆయా స్టేషన్లలో వెసులుబాట్లు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు తదితర అంశాలపై వారితో ఆయన మాట్లాడారు. ‘ప్రయాణికులతో మాట్లాడేందుకు నాకో సువర్ణావకాశం లభించింది. వారితో అనేక అంశాలపై మాట్లాడాను. చార్జీలు ఎక్కువగా ఉన్నాయని వారు నాతో చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలించాలని, వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని సంబంధిత అధికారులకు సూచించా. ఢిల్లీ మెట్రో- ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్( డీటీసీ)లను అనుసంధానం చేయడంద్వారా కనె క్టివిటీ పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించా. ఇందువల్ల ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇదంతా జరిగేందుకు కొంత సమయం పడుతుంది. ఎల్లకాలం ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడడం మంచిది కాదు’ అని అన్నారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఏటీఎంలు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడంతో ప్రకటనలకు అవకాశం కల్పిస్తే డీఎం ఆర్సీ ఆదాయం పెరుగుతుందన్నారు. ఢిల్లీ మెట్రో సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్టు వెంకయ్య నాయుడు చెప్పారు. జాతీయ రాజధాని నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లకు వెళ్లే ప్రయాణికులకు దీనిని అనువుగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందన్నారు. రాజధానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రతిరోజూ రాకపోకలు సాగించేవారికి ఇది అనువుగా ఉండడమనేది అత్యం త ముఖ్యమన్నారు. రహదార్లపై రాకపోకలు సాగి స్తున్న వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోం దని, దీంతో నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మెట్రో రైలులో ప్రయాణం వల్ల తనకు 40 నిమిషాల సమయం ఆదా అయిందని తెలిపారు. రహదారులపై ప్రయాణంవల్ల సమయం వృథా అవడమే కాకుండా అలసట కలుగుతుందన్నారు. తన మాదిరిగానే తన సహచర మంత్రులు కూడా దీనిలో ప్రయాణించాలని ఆయన సూచించారు. -
మెట్రో స్టేషన్లలో పోలీసుబూత్లు
న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్లలో పెరుగుతున్న నేరాలను తగ్గించేందుకు, ప్రతి స్టేషన్లో పోలీసుబూత్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జేబుదొంగతనాలు, చోరీలవంటి క్రిమినల్ కేసులు ఏప్రిల్ 10 నాటికే 806 నమోదయ్యాయి. అయితే గత ఏడాది ఇదే సమయానికి కేవలం 140 మాత్రమే జరిగాయి. దీంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ను సంప్రదించిన ఢిల్లీ పోలీసులు 49 మెట్రో స్టేషన్లలో పోలీసు బూత్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసుల ప్రతిపాదనను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అంగీకరించింది. మెట్రో స్టేషన్లలో పోలీసు కేందరాల ఏర్పాటు వల్ల స్టేషన్ లోపల, ఆవరణలో నేరాలను నిరోధించే అవకాశముందంటున్నారు పోలీసు జాయింట్ కమిషనర్ ఎం.కె.మీనా. ఢిల్లీలోని 129 మెట్రో స్టేషన్లు ప్రతిరోజూ 25 వేల మందిని రవాణా చేస్తున్నాయి. వాటిని పరిరక్షించేందుకుగాను 209 పోలీసులతో కేవలం ఎనిమిది పోలీసు మెట్రో పోలీసు స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే మెట్రో స్టేషన్లలో నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2013లో మెట్రో పోలీసులు 206 మంది నేరస్తులను అరెస్టు చేశారు. వీరు దోపిడీలు, అత్యాచారం, గొలుసు దొంగతనాలు, చిల్లర నేరాలు, వాహనచోరీలు, మాదకద్రవ్యాల రవాణా, ఆయుధాల రవాణా తదితర నేరాల కింద వీరందరినీ అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) గణాంకాల ప్రకారం రైళ్లలో ప్రతినిత్యం 25 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్లలో భద్రత కీలకంగా మారిందని సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న స్టేషన్ల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. కాశ్మీరీగేటు, మండీహౌస్, ఆనంద్ విహార్, న్యూఅశోక్‌నగర్, జహంగీర్‌పురి స్టేషన్లు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక కీలక ప్రాంతాల్లో ఉన్న పటేల్ చౌక్, రేస్‌కోర్సు, ఉద్యోగ్‌భవన్, ఎయిమ్స్ స్టేషన్లలోనూ త్వరలోనే పోలీసుబూత్లు ఏర్పాటు చేస్తారు. ఇదిలా ఉంటే మెట్రో స్టేషన్లలో సీఐఎస్ఎఫ్ జవాన్లు కూడా భద్రతా విధులు నిర్వమిస్తున్నారు. -
మంటల వదంతులు.. ఆగిన మెట్రో రైలు
ఢిల్లీ మెట్రో రైల్లో అగ్నిప్రమాదం జరిగినట్లు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మెట్రో రైలు సర్వీసులు దాదాపు అరగంట పాటు నిలిచిపోయాయి. అర్జన్‌గఢ్- ఘితోర్ని మధ్య నడిచే మెట్రో రైలు జహంగీర్‌పురి నుంచి హుడా సిటీ సెంటర్ మధ్య ప్రాంతంలో ఉండగా ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో రైల్లోని చివరి బోగీలో కొంతమంది ప్రయాణికులు నిప్పు రవ్వలు, పొగ చూశారు. వెంటనే వాళ్లు డ్రైవర్‌కు సమాచారం అందించగా డ్రైవర్ అత్యవసర బ్రేకులు వాడి రైలును ఆపేశారు. అయితే, బోగీలో పూర్తిగా పరిశీలించగా మంటలు ఏవీ రాలేదని తేలింది. అయినా రైలును మాత్రం తదుపరి పరీక్షల కోసం సర్వీసు నిలిపివేశారు. మంటలు కనిపించకపోయినా.. నిప్పు నెరుసులు ఎగసిన మాట మాత్రం వాస్తవమేనని ప్రాథమిక విచారణలో తేలింది. రైలుకు గానీ, ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని మెట్రో రైలు అధికార ప్రతినిధి తెలిపారు. అరగంట తర్వాత రైలు రాకపోకలను పునరుద్ధరించారు. -
మెట్రో రైళ్లలో ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో ఇప్పటిదాకా కేంద్ర పారిశ్రామిక బలగాలే భద్రతా విధులను నిర్వర్తించాయి. కాగా ఇకపై ఢిల్లీ పోలీసులు కూడా ఈ విధులను నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిపై, జేబుదొంగలపై వీరు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర పారిశ్రామిక బలగాలకు వీరు అదనంగా పనిచేస్తారని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాల ప్రకారం... మొత్తం 20 మందితో ఉన్న ఈ పోలీస్ బృందంలో పది మంది మహిళా పోలీసులు కూడా ఉంటారు. వేర్వేరు ప్రాంతాల్లో, వే ర్వేరు రైళ్లలోని కంపార్ట్మెంట్లలో వీరు విధులు నిర్వర్తిస్తారు. పయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిద్వారానే తెలుసుకొని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారు. ఇలా మెట్రో ప్రయాణికులతో మమేకం కావడంద్వారా ఢిల్లీ పోలీసులపై వారికి నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయాన్ని డీసీపీ(రైల్వేస్) సంజయ్ భాటియా తెలిపారు. అంతేకాకుండా కశ్మీరీగేట్, దిల్షాద్ గార్డెన్, చాందినీ చౌక్, కీర్తినగర్, షహదరా, ఇంద్రలోక్, విశ్వవిద్యాలయ, ఎయిమ్స్, సెంట్రల్ సెక్రటేరియట్, ప్రగతి మైదాన్, కర్కర్దూమా, నెహ్రూ ప్లేస్, దౌలాకువా తదితర స్టేషన్లలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. మెట్రో రైళ్లలో విధులు నిర్వర్తించేవారు సాధారణ దుస్తుల్లో కూడా ఉంటారని, 24 గంటలపాటు విధుల్లో ఉంటారని చెప్పారు. దొంగతనాలను, మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆగడాలను అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
మొదలైన మెట్రో ఫేజ్-3 ట్రయల్న్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోరైలు ఫేజ్-3లో భాగంగా నిర్మించిన సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌస్ మధ్య మెట్రోరైలు ట్రయల్ రన్ సోమవారం ప్రారంభమైంది. ఢిల్లీ మెట్రోరైలు చైర్మన్ డా.సుధీర్‌కృష్ణ, డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. 24 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేసి డీఎంఆర్సీ అధికారులు సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు మంగూసింగ్ తెలిపారు. రెండు నెలలపాటు ఈ ట్రయల్ రన్‌ను కొనసాగించనున్నట్టు చెప్పారు. సెంట్రల్ సెక్రటేరియట్-క శ్మీరీగేట్ కారిడర్లో భాగంగా మూడు కిలోమీటర్ల సొరంగమార్గం పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. 2014 మార్చి వరకు ఈ కారిడర్ మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌస్ మార్గం అందుబాటులోకి వస్తే రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌పై ప్రయాణికుల రద్దీ చాలా వరకు తగ్గనుంది. మొదటి రోజు ట్రయల్ రన్ విజయవంతం అయినట్టు డీఎంఆర్సీ అధికారులు ప్రకటించారు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆజాద్పురలో మరో టీబీఎం పనులు షురూ డీఎంఆర్సీ ఫేజ్-3లో భాగంగా ఆజాద్పుర్లో మరో టన్నెల్ బోరింగ్ మిషన్(టీడీఎం) పనులు సోమవారం ప్రారంభించినట్టు అధికారులు తెలిపా రు. ముకుంద్పుర-శివ్‌విహార్ కారిడర్లో భాగంగా చేపట్టిన ఈ పనులను డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ ప్రారంభించారు. 2014 జూన్ వరకు ఈ టీబీ ఎం 1.4 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వేలా లక్ష్యం పెట్టుకున్నట్టు చెప్పారు. ఇదికాకుండా ఫేజ్-3లో మొత్తం 12 టీబీఎంలు పనిచేస్తున్నట్టు చెప్పారు. -
పొరుగు రాష్ట్రాల్లో చురుగ్గా మెట్రో
ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం లేఖ రాసింది. ఇతర ప్రాంతాల్లో మెట్రోరైలు ప్రాజెక్టుల నిర్మాణం, కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరించింది. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని కొత్త ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రోత్సహిస్తారని డీఎంఆర్సీ భావిస్తోంది. న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా వైదొలగడం వల్ల మెట్రో విస్తరణ మరింత చురుగ్గా కొనసాగుతాయని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) భావిస్తోంది. షీలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెలుపల మెట్రో పనులకు అడ్డంకులు సృష్టిం చారనే విమర్శలు ఉన్నాయి. అదనపు రాబడికి వీలుగా తాము కన్సల్టెన్సీ సేవలు ప్రారంభించేం దుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నోయిడా, ఘజియాబాద్, లక్నోలో మెట్రో ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగుతాయని భావిస్తున్నారు. నిజానికి ఢిల్లీ బయటి ప్రాంతాల్లో పనులు చేపట్టడం వల్ల రాజధానిలో మెట్రో సేవలకు ఎటువంటి ఇబ్బందులూ కలగబోవని డీఎంఆర్సీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీక్షిత్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో పనులు చేపట్టాల్సిందిగా డీఎంఆర్సీపై తాము ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చామని పట్టణాభివృద్ధిశాఖ వర్గాలు తెలిపాయి. ‘లక్నో మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక తయారీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని మార్పులు సూచిస్తూ వ్యాఖ్యలు రాశాం. త్వరలోనే లక్నోలో మెట్రోరైలు నిర్మాణ పనులు మొదలుపెడతాం. బయటి రాష్ట్రాల్లో పనులు చేపట్టడానికి డీఎంఆర్సీ అధికారులు దీక్షిత్‌కు నచ్చజెప్పాల్సి వచ్చేది. అయినప్పటికీ ఢిల్లీలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదు’ అని ఆయన వివరించారు. ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ మోహన్ స్పోలియా డీఎంఆర్సీకి లేఖ రాశారు. దీక్షిత్ సూచన మేరకే ఆయన ఈ పనిచేశారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని అప్పట్లోనే దీక్షిత్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీలోనే చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. లక్నో మెట్రో ప్రాజెక్టు నుంచి డీఎంఆర్సీ తప్పుకొని ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అయితే కే జ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంతోషంగానే ఉంది. ‘యూపీ రాష్ట్ర పరిధిలోనే మెట్రో ప్రాజెక్టులకు కేజ్రీవాల్ అడ్డుచెప్పే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ కూడా ఆయన పార్టీని విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి మెట్రో విస్తరణకు సహకరిస్తారు’ అని ఒక అధికారి వివరించారు. చురుగ్గా మూడోదశ ఢిల్లీలోనూ మెట్రో మూడోదశ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. విస్తరణలో భాగంగా డీఎంఆర్సీ చేపట్టిన మూడోదశ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల మెట్రోమార్గాలు, స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. 2016 కల్లా మూడోదశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడోదశలో మొత్తం 103.05 కిలోమీటర్ల మేర మెట్రోమార్గాలను నిర్మిస్తారు. ముకుంద్‌పూర్-యమునావిహార్ కారిడార్‌ను 55.69 కిలోమీటర్ల పొడవున, జనక్‌పురి వెస్ట్-కాళిందికుంజ్ కారిడార్‌ను 33.49 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీగేట్ మార్గాన్ని 9.37 కిలోమీటర్ల పొడవున, జహంగీర్‌పురి-బద్లి మార్గాన్ని 4.489 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఈ దశలో 67 స్టేషన్లు, 15 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉంటాయి. 2016 నాటికి ఢిల్లీ మెట్రోరైళ్లలో ప్రతినిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తారని భావిస్తున్నారు. మూడోదశ నిర్మాణానికి రూ.35,242 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. మూడోదశలో అనేక మార్గాలను భూగర్భంలో నిర్మిస్తారు. వీటి కోసం సొరంగాలను తవ్వడానికి విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను (టీబీఎం) తెప్పించారు. -
మెట్రోరైలుకు 12 ఏళ్లు
డీఎంఆర్సీ సేవలకు 12 ఏళ్లు నిండడంతో ఈ సంస్థ మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భవిష్యత్‌లోనూ మెట్రో విస్తరణ పనులు చురుగ్గా కొనసాగిస్తామని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కార్యనిర్వాహక అధికారి అనుజ్ దయాళ్ అన్నారు. న్యూఢిల్లీ: ప్రతినిత్యం లక్షలాది మందికి సేవలు అందిస్తున్న ఢిల్లీ మెట్రోరైలుకు ఈ నెల 24తో 12 ఏళ్లు నిండాయి. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సేవలు 2002, డిసెంబర్ 24న లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ‘మేం తొలుత 8.5 కిలోమీటర్ల మేర, ఆరు స్టేషన్లతో షహద్రా నుంచి తీస్‌హజారీ మార్గంలో చేపట్టిన సేవలను అప్పటి ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అప్పుడు ఆరు రైళ్లను ఒకేరోజు 775 కిలోమీటర్లు తిప్పాం’ అని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కార్యనిర్వాహక అధికారి అనుజ్ దయాళ్ అన్నారు. పస్తుతం ఢిల్లీ మెట్రోరైళ్లు ప్రతినిత్యం 70 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 23 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయని వివరించారు. ఆయన కథనం ప్రకారం.. డీఎంఆర్సీ 2002 డిసెంబర్‌నాటికి నిత్యం లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఈ ఏడాది ఆగస్టు ఎనిమిది నాటికి ఈ సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఆగస్టు 19న ఏకంగా 26 లక్షల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారు. పుష్కర వ్యవధిలో ఇన్ని లక్షల మందికి సేవలు అందించినందుకు గర్విస్తున్నామని దయాళ్ అన్నారు. ఈ కాలం లో డీఎంఆర్సీ సాధించిన విజయాలను కూడా ఆయన ప్రస్తావించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి మెట్రోరైలు మొదటికోచ్ను మహిళలకు మాత్రమే రిజర్వు చేశామని వివరించారు. చురుగ్గా మూడోదశ నిర్మాణ పనులు విస్తరణలో భాగంగా డీఎంఆర్సీ చేపట్టిన మూడోదశ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల మెట్రోమార్గాలు, స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. 2016 కల్లా మూడోదశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడోదశలో మొత్తం 103.05 కిలోమీటర్ల మేర మెట్రోమార్గాలను నిర్మిస్తారు. ముకుంద్‌పూర్-యమునావిహార్ కారిడార్‌ను 55.69 కిలోమీటర్ల పొడవున, జనక్‌పురి వెస్ట్-కాళిందికుంజ్ కారిడార్‌ను 33.49 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీగేట్ మార్గాన్ని 9.37 కిలోమీటర్ల పొడవున, జహంగీర్‌పురి-బద్లి మార్గాన్ని 4.489 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఈ దశలో 67 స్టేషన్లు, 15 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉంటాయి. 2016 నాటికి ఢిల్లీ మెట్రోరైళ్లలో ప్రతినిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మూడోదశ నిర్మాణానికి రూ.35,242 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. మూడోదశలో అనేక మార్గాలను భూగర్భంలో నిర్మిస్తారు. వీటి కోసం సొరంగాలను తవ్వడానికి విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను (టీబీఎం) తెప్పించారు. అంతేకాదు పలు మార్గాల్లోని రైళ్ల బోగీల సంఖ్యను నాలుగు నుంచి ఆరుకు పెంచారు. టికెట్ల కొనుగోలు కోసం వెండింగ్ మెషీన్లు, టోకెన్ల వంటి సదుపాయాలు కల్పించారు.