
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు తీర్పుతో దేశ రాజధాని వాసులకు ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను మెట్రోరైల్ సిబ్బంది వాయిదా వేసుకున్నారు. వేతన పెంపుతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు మెట్రో క్షేత్రస్థాయి సిబ్బంది నోటీసులిచ్చారు. దీంతో వారితో శుక్రవారం రెండు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావటంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమ్మె న్యాయబద్ధంగా లేదనీ, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని కోర్టు సూచించింది. సమ్మె కారణంగా 25 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతారంది. దీంతో సమ్మెను నిలిపి వేస్తున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని మెట్రోలో పనిచేసే సుమారు 12వేల మందిలో 9వేల మంది క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment