మెట్రోకు సోలార్ విద్యుత్?
దేశ రాజధాని ఢిల్లీలో నడుస్తున్న మెట్రో రైళ్లకు మధ్యప్రదేశ్‌లోని సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్తు అందే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కి, ప్రపంచంలోనే అతి పెద్దదైన 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు డెవలపర్లకు మధ్య పీపీఏలు కుదుర్చుకుంటున్నామని మధ్యప్రదేశ్ పునరుత్పాదక ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి మను శ్రీవాస్తవ చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి 'సరి-బేసి' పద్ధతిలో కార్లు నడుపుతున్నా, మెట్రోరైళ్లకు మాత్రం ప్రతిరోజూ విద్యుత్తు కావల్సిందే.
ఇది కూడా సోలార్ విద్యుత్ అయితే విద్యుత్ ఉత్పత్తిలో కాలుష్యం చాలావరకు తగ్గుతుందన్న ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో రేవా జిల్లాలోని బంద్వర్ ప్రాంతంలో 1500 హెక్టార్ల విస్తీర్ణంలో సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక్కడ ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 6 కోట్ల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు అమెరికాలోని కాలిఫోర్నియాలోగల మొజేవే ఎడారిలో ఉంది. అది కేవలం 392 మెగావాట్ల ప్రాజెక్టు. దానికంటే చాలా పెద్ద ప్రాజెక్టును ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తున్నారు.