సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ సర్కారు ప్రతిపాదించిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తేవడానికి ఢిల్లీ మెట్రో దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించింది. సాఫ్ట్‌వేర్ మార్చి టోకెన్లు, స్మార్ట్‌కార్డులు రెండింటినీ మహిళా ప్రయాణీకులు ఉపయోగించేలా చేయడమనేది దీర్ఘకాల ప్రణాళిక కాగా, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక టికెట్ వెండింగ్ మిషన్లు, ప్రత్యేక ప్రవేశ గేట్లు ఏర్పాటుచేసి వారికి పింక్ టోకెన్లు జారీ చేయాలని స్వల్పకాలిక ప్రణాళికలో సూచించారు.
దీర్ఘకాల ప్రణాళికను అమలు చేయడానికి సంవత్సరానికి పైగా సమయం పడుతుందని, స్వల్పకాలిక ప్రణాళికను అమలుచేయడానికి కనీసం ఎనిమిది నెలల సమయం కావాలని ఢిల్లీ మెట్రో తెలిపిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అయితే కేంద్రం నియమించిన చార్జీల నిర్థారణ కమిటీ ఈ ప్రణాళికను అమోదించవలసి ఉంటుందని ఆ తరువాతనే తాము ఈ ప్రణాళికను అమల్లోకి తేగలమని ఢిల్లీ మెట్రో ఢిల్లీ సర్కారుకు సూచించింది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత 30 శాతమున్న మెట్రో మహిళా ప్రయాణీకుల సంఖ్య 50 శాతానికి పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment