మెట్రో స్టేషన్లలో పోలీసుబూత్‌లు
Published Mon, Apr 14 2014 11:33 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్లలో పెరుగుతున్న నేరాలను తగ్గించేందుకు, ప్రతి స్టేషన్‌లో పోలీసుబూత్‌లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జేబుదొంగతనాలు, చోరీలవంటి క్రిమినల్ కేసులు ఏప్రిల్ 10 నాటికే 806 నమోదయ్యాయి. అయితే గత ఏడాది ఇదే సమయానికి కేవలం 140 మాత్రమే జరిగాయి. దీంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ను సంప్రదించిన ఢిల్లీ పోలీసులు 49 మెట్రో స్టేషన్లలో పోలీసు బూత్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసుల ప్రతిపాదనను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అంగీకరించింది. మెట్రో స్టేషన్లలో పోలీసు కేందరాల ఏర్పాటు వల్ల స్టేషన్ లోపల, ఆవరణలో నేరాలను నిరోధించే అవకాశముందంటున్నారు పోలీసు జాయింట్ కమిషనర్ ఎం.కె.మీనా. ఢిల్లీలోని 129 మెట్రో స్టేషన్లు ప్రతిరోజూ 25 వేల మందిని రవాణా చేస్తున్నాయి. వాటిని పరిరక్షించేందుకుగాను 209 పోలీసులతో కేవలం ఎనిమిది పోలీసు మెట్రో పోలీసు స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే మెట్రో స్టేషన్లలో నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
2013లో మెట్రో పోలీసులు 206 మంది నేరస్తులను అరెస్టు చేశారు. వీరు దోపిడీలు, అత్యాచారం, గొలుసు దొంగతనాలు, చిల్లర నేరాలు, వాహనచోరీలు, మాదకద్రవ్యాల రవాణా, ఆయుధాల రవాణా తదితర నేరాల కింద వీరందరినీ అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) గణాంకాల ప్రకారం రైళ్లలో ప్రతినిత్యం 25 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్లలో భద్రత కీలకంగా మారిందని సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న స్టేషన్ల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. కాశ్మీరీగేటు, మండీహౌస్, ఆనంద్ విహార్, న్యూఅశోక్‌నగర్, జహంగీర్‌పురి స్టేషన్లు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక కీలక ప్రాంతాల్లో ఉన్న పటేల్ చౌక్, రేస్‌కోర్సు, ఉద్యోగ్‌భవన్, ఎయిమ్స్ స్టేషన్లలోనూ త్వరలోనే పోలీసుబూత్‌లు ఏర్పాటు చేస్తారు. ఇదిలా ఉంటే మెట్రో స్టేషన్లలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లు కూడా భద్రతా విధులు నిర్వమిస్తున్నారు.
Advertisement
Advertisement