మెట్రో రైలులో ప్రయాణిస్తున్న మోదీ, యూపీ గవర్నర్, సీఎం యోగి
నోయిడా/న్యూఢిల్లీ: పౌరులు వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు తమ సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ఇంధన వినియోగం తగ్గి, తద్వారా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చుతగ్గుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ కొత్తగా నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని మోదీ సోమవారం ప్రారంభించారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ పురీ తదితరులతో కలసి మోదీ మెట్రోరైలులో ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
అప్పుడే సుపరిపాలన సాధ్యం
‘గతంలో కొందరు రాజకీయ నేతలు ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ‘నాకు ఏం లాభం?, నేనెందుకు చేయాలి?’ అని ఆలోచించేవారు. ఆ ఆలోచనా విధానాల్ని మేం రూపుమాపాం. భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశమైనా, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరకపోవడానికి కారణం సరైన పరిపాలన లేకపోవడమే. దానిని సరిదిద్దే బాధ్యతను నా భుజాలకెత్తుకున్నాను’ అని మోదీ వివరించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అప్పటికల్లా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చులను తగ్గించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు.
వాజ్‌పేయినే తొలిసారి ప్రయాణించారు
2002 డిసెంబరు 24న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఢిల్లీలో తొలిసారిగా మెట్రోరైలును ప్రారంభించి, ప్రయాణించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. గ్రామాలకు రోడ్లు నిర్మించడం, ఆ రోడ్లను ప్రధాన రహదారులతో అనుసంధానించడం ఇవన్నీ వాజ్‌పేయి ఆలోచనలేననీ, అభివృద్ధి జరగాలంటే ముందుగా రవాణా సౌకర్యాలే ముఖ్యమని మోదీ అన్నారు. మెజెంటా లైన్‌తో దక్షిణ ఢిల్లీ, నోయిడా మధ్య ప్రయాణ సమయం గతంతో పోలిస్తే అర్ధగంటకు పైగా తగ్గనుంది. ఇప్పటివరకు నోయిడా నుంచి దక్షిణ ఢిల్లీకి 52 నిమిషాల సమయం పడుతుండగా, మెట్రో రైలులో అయితే కేవలం 19 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఢిల్లీ మెట్రోరైళ్లలో పెంచిన చార్జీలను సీఎం కేజ్రీవాల్ తగ్గించమని బహిరంగంగానే కోరతారనే భయంతోనే ఆయనను మెట్రోరైలు మార్గం ప్రారంభానికి పిలవలేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు.
యోగికి మోదీ పొగడ్తలు
నోయిడాలో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులెవరూ మళ్లీ సీఎం కారనే ఒక మూఢనమ్మకం ఆ రాష్ట్రంలో ప్రచారంలో ఉంది. కానీ యోగి ఆదిత్యనాథ్ దానిని పట్టించుకోకుండా నోయిడాకు వచ్చారనీ, ఆయన ధైర్యవంతుడని మోదీ అన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అచ్చం ఇలాంటి వదంతులు ఉన్న ఆరు నుంచి ఏడు ప్రాంతాలకు వెళ్లాననీ, అయినా 20 ఏళ్లు సీఎంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment