మెట్రో రైళ్లలో ఢిల్లీ పోలీసులు
Published Mon, Mar 10 2014 10:38 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో ఇప్పటిదాకా కేంద్ర పారిశ్రామిక బలగాలే భద్రతా విధులను నిర్వర్తించాయి. కాగా ఇకపై ఢిల్లీ పోలీసులు కూడా ఈ విధులను నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిపై, జేబుదొంగలపై వీరు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర పారిశ్రామిక బలగాలకు వీరు అదనంగా పనిచేస్తారని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాల ప్రకారం... మొత్తం 20 మందితో ఉన్న ఈ పోలీస్ బృందంలో పది మంది మహిళా పోలీసులు కూడా ఉంటారు. వేర్వేరు ప్రాంతాల్లో, వే ర్వేరు రైళ్లలోని కంపార్ట్‌మెంట్లలో వీరు విధులు నిర్వర్తిస్తారు.
పయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిద్వారానే తెలుసుకొని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారు. ఇలా మెట్రో ప్రయాణికులతో మమేకం కావడంద్వారా ఢిల్లీ పోలీసులపై వారికి నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయాన్ని డీసీపీ(రైల్వేస్) సంజయ్ భాటియా తెలిపారు. అంతేకాకుండా కశ్మీరీగేట్, దిల్షాద్ గార్డెన్, చాందినీ చౌక్, కీర్తినగర్, షహదరా, ఇంద్రలోక్, విశ్వవిద్యాలయ, ఎయిమ్స్, సెంట్రల్ సెక్రటేరియట్, ప్రగతి మైదాన్, కర్కర్దూమా, నెహ్రూ ప్లేస్, దౌలాకువా తదితర స్టేషన్లలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. మెట్రో రైళ్లలో విధులు నిర్వర్తించేవారు సాధారణ దుస్తుల్లో కూడా ఉంటారని, 24 గంటలపాటు విధుల్లో ఉంటారని చెప్పారు. దొంగతనాలను, మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆగడాలను అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Advertisement