న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేందుకు మీరు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారా? స్వదేశానికి వచ్చేందుకు మీ బంధువులెవరైనా విమానాశ్రయంలో దిగుతున్నారా? అయితే మీ లగేజీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేశ రాజధానిలో నిరంతరం కట్టుదిట్టమై భద్రత ఉండే ఈ విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల లగేజీ మాయమవుతోంది. గత రెండేళ్లుగా ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు.
ఇవీ సంఘటనలు...
2012లో ఐజీఐ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో లగేజీలు మాయం అయిన కేసులు 36 నమోదు అయ్యాయి. 2013లో 56 కేసులు నమోదు అయ్యాయి. 2014లోని మొదటి ఎనిమిది నెలల్లో ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. 2012లో నమోదు అయిన కేసులతో పోల్చితే ఈ సంవత్సరం ఆగస్టు 28 వరకూ 60 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. 2012లో నమోదైన 36 కేసుల్లో 15 కేసులను ఛేదించి, 22 మందిని అరెస్ట్ చేశారు. 2013లో 10 కేసుల్లో, 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 11 కేసుల్లో 14 మందిని అరెస్ట్ చేశారు. గత మూడేళ్లలో 80 శాతం లగేజీలు చోరీకి గురయ్యాయి. అయితే సామగ్రిని లోడ్‌చేసే వాళ్లే బ్యాగ్‌ల చోరీలకు పాల్పడుతున్నట్లు ఎయిర్‌పోర్టు గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ గుర్తించిందని ఐజీఐ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎంఐ హైదర్ పేర్కొన్నారు. సహ ప్రయాణికులు కూడా లగేజీలను మాయం చేసిన సంఘటనలు ఉన్నాయని, అయితే ఇలాంటి కేసులు అతితక్కువగా నమోదు అయ్యాయని తెలిపారు.
తాజా ఘటన..
ఆగస్టు 17న ఉదయం 4 గంటలకు షాహుల్ హమీద్ మహ్మద్ ఇక్బాల్ అనే ప్రయాణికుడు ఢిల్లీలోని ఐజీఐ టెర్మినల్-3లో దిగాడు. యూఎస్ నుంచి తిరుగు ప్రయాణంలో గల్ఫ్ విమానంలో వయా ఫ్రాంక్‌ఫర్ట్- బహ్రెయిన్ మీదుగా ఇక్కడకు చేరుకొన్నాడు. కానీ, అతడి నాలుగు లగేజీ బ్యాగుల్లో నుంచి ఒక బ్యాగ్ కనిపించలేదు. ఈ విషయాన్ని ఐజీఐ ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు తెలియజేశాడు. బహ్రెయిన్ ఎయిర్‌పోర్టులో లగేజీని దించలేదని చెప్పాడు. బ్యాగ్ గల్లంతైందని ఫిర్యాదు చేయాలని మేనేజర్ ప్రయాణికుడికి సూచించాడు. 24 గంటల్లో ఆ బ్యాగ్‌ను అప్పజెప్పుతామని చెప్పాడు.. ఇలాంటి ఘటనలు ఇంధిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.ఎయిర్‌పోర్టులో బ్యాగ్‌లను లోడింగ్-అన్‌లోడింగ్ చేసేవాళ్లే బ్యాగుల చోరీకి పాల్పడుతున్నట్లు చాలా ఘటనల్లో రుజువైంది. అందుకే తాజా ఘటన కూడా వారి పనే అయి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. ఆ దిశగా ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐజీఐ ఎయిర్‌పోర్టులో ఇంటిదొంగలు
Published Sun, Aug 31 2014 10:22 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement