Baggage theft
-
మూడో స్థానంలో ‘శంషాబాద్’!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాగేజ్ లిఫ్టింగ్... ఒకప్పుడు విమాన ప్రయాణికులను తీవ్రస్థాయిలో కలవరపెట్టిన సమస్య. విమానం ఎక్కేప్పుడు తమ బ్యాగేజ్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బందికి అప్పగించే ప్రయాణికులు తిరిగి దిగిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బ్యాగేజ్లు.. లేదా వాటిలో ఉండే వస్తువులు మాయమయ్యేవి. ఇటీవల కాలంలో విమానాశ్రయాల్లో పెరిగిన సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ సమస్య చాలావరకు తీరింది. అయినప్పటికీ ఇప్పుడూ బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులు నమోదవుతున్నాయని ఎయిర్‌పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంస్థ వెల్లడించింది. ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వాటికి సంబంధించిన గణాంకాలు, కారణాలను సైతం నివేదించింది. 2012 నుంచి 2015 వరకు ఈ నివేదిక ప్రకారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసుల్లో దేశంలో మూడో స్థానంలో ఉంది. ఈ నాలుగేళ్లలో 34 కేసులు నమోదయ్యాయి. దేశంలోని ఇతర మెట్రోల విషయానికి వస్తే 144 కేసులతో ఢిల్లీ ప్రథమ, 40 కేసులతో ముంబై రెండు, మూడు కేసులతో బెంగళూరు నాలుగు, మూడు కేసులతో చెన్నై ఐదో స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు ఈ కేసుల సంఖ్య వందల్లో ఉండేదని, ఏఏఐతో పాటు విమానాశ్రయాలకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తీసుకుంటున్న చర్యల కారణంగా గణనీయంగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, బ్యాగేజ్ల వ్యవహారాలు చూసే వారిపై నిఘా పెంచడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం ఫలితాలు ఇచ్చిందని ఏఏఐ పేర్కొంది. అయితే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించే విమానాలతో పాటు బ్యాగేజ్ సంఖ్య భారీగా ఉండటం, వీటి నిర్వహణకు ఒకటి కంటే ఎక్కువ సంస్థలను వినియోగిస్తుండటం ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు ఏఏఐ స్పష్టం చేసింది. బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులను పూర్తిగా రూపుమాపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల్లో బ్యాగేజ్ల నిర్వహణ ఒకే సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోనుంది. ఈ సంస్థలో పని చేసే వారిపై నిత్యం కన్నేసి ఉంచేలా ఆదేశాలు జారీ చేయనుంది. సాధారణంగా బ్యాగేజ్ నిర్వహణ పని చేసే వారు తమతో తీసుకువెళ్ల సొంత వస్తువుల్లోనే బ్యాగేజ్ నుంచి తస్కరించిన వాటిని పెట్టుకుని పట్టుకుపోతున్నట్లు గుర్తించామన్న ఏఏఐ... ఆయా ఉద్యోగులు విమానాశ్రయం లోపలకు సొంత బ్యాగులు వంటివి తీసుకువెళ్లకుండా కట్టడిచేసే అంశాన్నీ పరిశీలిస్తున్నామని ఏఏఐ పేర్కొంది. -
ఐజీఐ ఎయిర్‌పోర్టులో ఇంటిదొంగలు
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేందుకు మీరు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారా? స్వదేశానికి వచ్చేందుకు మీ బంధువులెవరైనా విమానాశ్రయంలో దిగుతున్నారా? అయితే మీ లగేజీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేశ రాజధానిలో నిరంతరం కట్టుదిట్టమై భద్రత ఉండే ఈ విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల లగేజీ మాయమవుతోంది. గత రెండేళ్లుగా ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఇవీ సంఘటనలు... 2012లో ఐజీఐ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో లగేజీలు మాయం అయిన కేసులు 36 నమోదు అయ్యాయి. 2013లో 56 కేసులు నమోదు అయ్యాయి. 2014లోని మొదటి ఎనిమిది నెలల్లో ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. 2012లో నమోదు అయిన కేసులతో పోల్చితే ఈ సంవత్సరం ఆగస్టు 28 వరకూ 60 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. 2012లో నమోదైన 36 కేసుల్లో 15 కేసులను ఛేదించి, 22 మందిని అరెస్ట్ చేశారు. 2013లో 10 కేసుల్లో, 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 11 కేసుల్లో 14 మందిని అరెస్ట్ చేశారు. గత మూడేళ్లలో 80 శాతం లగేజీలు చోరీకి గురయ్యాయి. అయితే సామగ్రిని లోడ్‌చేసే వాళ్లే బ్యాగ్‌ల చోరీలకు పాల్పడుతున్నట్లు ఎయిర్‌పోర్టు గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ గుర్తించిందని ఐజీఐ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎంఐ హైదర్ పేర్కొన్నారు. సహ ప్రయాణికులు కూడా లగేజీలను మాయం చేసిన సంఘటనలు ఉన్నాయని, అయితే ఇలాంటి కేసులు అతితక్కువగా నమోదు అయ్యాయని తెలిపారు. తాజా ఘటన.. ఆగస్టు 17న ఉదయం 4 గంటలకు షాహుల్ హమీద్ మహ్మద్ ఇక్బాల్ అనే ప్రయాణికుడు ఢిల్లీలోని ఐజీఐ టెర్మినల్-3లో దిగాడు. యూఎస్ నుంచి తిరుగు ప్రయాణంలో గల్ఫ్ విమానంలో వయా ఫ్రాంక్ఫర్ట్- బహ్రెయిన్ మీదుగా ఇక్కడకు చేరుకొన్నాడు. కానీ, అతడి నాలుగు లగేజీ బ్యాగుల్లో నుంచి ఒక బ్యాగ్ కనిపించలేదు. ఈ విషయాన్ని ఐజీఐ ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు తెలియజేశాడు. బహ్రెయిన్ ఎయిర్‌పోర్టులో లగేజీని దించలేదని చెప్పాడు. బ్యాగ్ గల్లంతైందని ఫిర్యాదు చేయాలని మేనేజర్ ప్రయాణికుడికి సూచించాడు. 24 గంటల్లో ఆ బ్యాగ్‌ను అప్పజెప్పుతామని చెప్పాడు.. ఇలాంటి ఘటనలు ఇంధిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.ఎయిర్‌పోర్టులో బ్యాగ్‌లను లోడింగ్-అన్లోడింగ్ చేసేవాళ్లే బ్యాగుల చోరీకి పాల్పడుతున్నట్లు చాలా ఘటనల్లో రుజువైంది. అందుకే తాజా ఘటన కూడా వారి పనే అయి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. ఆ దిశగా ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.