సాక్షి, సిటీబ్యూరో: బ్యాగేజ్ లిఫ్టింగ్... ఒకప్పుడు విమాన ప్రయాణికులను తీవ్రస్థాయిలో కలవరపెట్టిన సమస్య. విమానం ఎక్కేప్పుడు తమ బ్యాగేజ్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బందికి అప్పగించే ప్రయాణికులు తిరిగి దిగిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బ్యాగేజ్‌లు.. లేదా వాటిలో ఉండే వస్తువులు మాయమయ్యేవి. ఇటీవల కాలంలో విమానాశ్రయాల్లో పెరిగిన సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ సమస్య చాలావరకు తీరింది. అయినప్పటికీ ఇప్పుడూ బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులు నమోదవుతున్నాయని ఎయిర్‌పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంస్థ వెల్లడించింది. ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వాటికి సంబంధించిన గణాంకాలు, కారణాలను సైతం నివేదించింది. 2012 నుంచి 2015 వరకు ఈ నివేదిక ప్రకారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసుల్లో దేశంలో మూడో స్థానంలో ఉంది. ఈ నాలుగేళ్లలో 34 కేసులు నమోదయ్యాయి.
దేశంలోని ఇతర మెట్రోల విషయానికి వస్తే 144 కేసులతో ఢిల్లీ ప్రథమ, 40 కేసులతో ముంబై రెండు, మూడు కేసులతో బెంగళూరు నాలుగు, మూడు కేసులతో చెన్నై ఐదో స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు ఈ కేసుల సంఖ్య వందల్లో ఉండేదని, ఏఏఐతో పాటు విమానాశ్రయాలకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) తీసుకుంటున్న చర్యల కారణంగా గణనీయంగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, బ్యాగేజ్‌ల వ్యవహారాలు చూసే వారిపై నిఘా పెంచడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం ఫలితాలు ఇచ్చిందని ఏఏఐ పేర్కొంది. అయితే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించే విమానాలతో పాటు బ్యాగేజ్ సంఖ్య భారీగా ఉండటం, వీటి నిర్వహణకు ఒకటి కంటే ఎక్కువ సంస్థలను వినియోగిస్తుండటం ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు ఏఏఐ స్పష్టం చేసింది.
బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులను పూర్తిగా రూపుమాపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల్లో బ్యాగేజ్‌ల నిర్వహణ ఒకే సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోనుంది. ఈ సంస్థలో పని చేసే వారిపై నిత్యం కన్నేసి ఉంచేలా ఆదేశాలు జారీ చేయనుంది. సాధారణంగా బ్యాగేజ్ నిర్వహణ పని చేసే వారు తమతో తీసుకువెళ్ల సొంత వస్తువుల్లోనే బ్యాగేజ్ నుంచి తస్కరించిన వాటిని పెట్టుకుని పట్టుకుపోతున్నట్లు గుర్తించామన్న ఏఏఐ... ఆయా ఉద్యోగులు విమానాశ్రయం లోపలకు సొంత బ్యాగులు వంటివి తీసుకువెళ్లకుండా కట్టడిచేసే అంశాన్నీ పరిశీలిస్తున్నామని ఏఏఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment