న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు అన్‌లాక్-4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. అయితే, కోవిడ్ కేసుల్లో ఆరో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో మెట్రో పునఃప్రారంభం ఏమేరకు ప్రభావం చూపుతుందోనని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో సర్వీసుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ తెలిపారు. సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని ఆదివారం మీడియాకు చెప్పారు.
గతంలో మాదిరిగా ప్రయాణికులకు టోకెన్స్ జారీ చేయమని చెప్పారు. ఎంట్రీ వద్దనే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డులు, ఇతర డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే పేమెంట్లు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దాంతోపాటు లిఫ్టుల్లో కూడా తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగా స్టేషన్లలో మెట్రో రైలు నిలిచే సమయం పెంచుతామని తెలిపారు. కాగా, కోవిడ్ నియంత్రణలో భాగంగా మార్చి నెలలో ఢిల్లీ సర్వీసుల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దాదాపు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఇక మెట్రో పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పాము హల్‌చల్)
Comments
Please login to add a commentAdd a comment