న్యూఢిల్లీ: రాబడి పెంపు దిశగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా బోగీలపై త్వరలో ప్రకటనలకు అనుమతించ నుంది. కార్యాచరణేతర రాబడిని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. బొమ్మలు, ముద్రిత సామగ్రి, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే, స్మార్ట్ పోస్టర్లు, హోలోగ్రాఫిక్ చిత్రాలు, విజ్యువల్ డిస్‌ప్లేకి సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించిన హక్కులను ఇప్పటికే ఓ సంస్థకు అప్పగించామన్నారు. ఈ కాంట్రాక్టు పది సంవత్సరాలపాటు ఉంటుందన్నారు. మెట్రో బోగీలు లోపలిభాగంతోపాటు, స్టేషన్ పరిసరాల్లో ప్రకటనలను ఇప్పటికే అనుమతిస్తున్నామన్నారు. ఈ సంస్థల కార్యకలాపాలను తాము నిరంతరం నిశితంగా పరిశీలిస్తుంటామన్నారు. ఈ ప్రకటనల నాణ్యత ప్రపంచశ్రేణి విమానాశ్రయాలు, మెట్రో రైళ్ల ప్రమాణాలకు ధీటుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కాగా ప్రస్తుతం డీఎంఆర్‌సీ 200 మెట్రో రైళ్లను నడుపుతోంది. 60 రైళ్లకు ఎనిమిది బోగీలు ఉండగా, మరో 80 రైళ్లకు ఆరు బోగీలు ఉన్నాయి.
వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ ప్రారంభం
పర్యావరణ అనుకూల నిర్మాణాలకు ప్రోత్సాహమిచ్చే దిశగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అడుగులు వేసింది. ఇందులోభాగంగా సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీవరకూ వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వారాన్ని నిర్వహిస్తోంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా భారత్‌తోపాటు ప్రపంచంలోని వంద దేశాల్లో కూడా సోమవారం నుంచి వారం రోజులపాటు రల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల ఆరంభంలో డీఎంఆర్‌సీ... ఐజీబీసీతో కలసి గ్రీన్ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఎంఆర్‌టీఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి విదితమే. ఈ కార్యక్ర మాన్ని డీఎంఆర్‌సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ ప్రారంభించారు.
నేటినుంచి ఫీడర్ బస్సుల సేవలు
శివాజీ స్టేడియం మెట్రో రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. మంగళవారం నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బస్సులు ఉదయం ఎనిమిది గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటలవరకూ అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు పటేల్ చౌక్, ఆకాశ్‌శాణి భవన్, కృషి భవన్, పాటియాలా హౌస్, హైకోర్టు, ప్రగతిమైదాన్, సుప్రీంకోర్టు ఐటీఓ, ఢిల్లీ గేట్, న్యూఢిల్లీ మెట్రో స్టేషన్, మింట్ రోడ్, స్టేట్స్‌మన్ హౌస్ తదితర ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో ప్రస్తుతానికి శీతలేతర బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతారు. ప్రతి 20 నిమిషాలకొకటి చొప్పున ఈ బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల స్పందననుబట్టి వీటి సేవలను పెంచుతామని సదరు ప్రకటనలో డీఎంఆర్‌సీ పేర్కొంది. కాగా ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లైన్ ఈ తరహా సేవలను అందిస్తోంది.
మెట్రో బోగీలపై త్వరలో ప్రకటనలు
Published Mon, Sep 22 2014 11:09 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement