సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిర్భయ లాంటి అత్యాచార ఘటనలు ఎన్నో జరుగుతున్నా ఇప్పటికీ వెలుగులోకి రావడంలేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ ఉద్దంతం జరిగినప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న తన ప్రభుత్వంపై నిందవేయడానికి కొందరు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. 2012 డిసెంబర్ 16న ఫారామెడికల్ విద్యార్థిని గ్యాంగ్‌రేప్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో షీలా ఢిల్లీ సీఎంగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా కేవలం నిర్భయ ఘటనను కేంద్రంగా చేసుకుని తమ ప్రభుత్వంపై ఆరోపణలకు దిగినట్లు ఆమె గుర్తుచేశారు. శనివారం ఆమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించారు.
నిర్భయ లాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎన్ని జరగట్లేదని ఆమె ప్రశ్నించారు. 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్లు సీఎంగా వ్యవహరించానని, ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కావడం మూలంగా భద్రతా వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, ఆ సమయంలో తాము చేసేందేమీ లేదని ఆమె అన్నారు. ప్రభుత్వాలు మారినా ఇప్పటికి కూడా చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో నార్త్‌ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షీలా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన జాతీయ పార్టీఅని, ఆప్ ఇటీవల పుట్టిన చిన్న ప్రాంతీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని షీలా ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 12న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment