కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే | Congress Senior Leaders Sheila Dixit Passed Away | Sakshi
Sakshi News home page

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

Published Sat, Jul 20 2019 5:14 PM | Last Updated on Sat, Jul 20 2019 7:46 PM

Congress Senior Leaders Sheila Dixit Passed Away - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ (81) మృతి పట్ల ఆ పార్టీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక‍్తం చేసింది.   మూడుసార్లు (1998-2013) దేశ రాజధాని ఢిల్లీ సీఎంగా, ఓసారి లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకుంది. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఆమె.. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి అత్యంత ఆప్తురాలుగా గుర్తింపు పొందారు. 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తాలో జన్మించిన షీలా కపూర్‌.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. కాలేజీ రోజుల నుంచే కాంగ్రెస్‌ కార్యకర్తగా గుర్తింపుపొంది అంచెలంచెలు ఎదిగారు. తొలుత కాంగ్రెస్‌ మహిళా విభాగానికి నాయకత్వం వహించిన షీలా.. ఇందిరా గాంధీ ట్రస్ట్‌ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

చివరి వరకు కాంగ్రెస్‌తోనే
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణాంతరం జరిగిన తొలి ఎన్నికల్లో (1984) ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. అప్పుడు మొదలైన ఆమె ప్రస్థానం చివరి వరకు కాంగ్రెస్‌తోనే కొనసాగింది. తొలిసారి ఎంపీగా గెలిచినప్పటికీ రాజీవ్‌ హయాంలో కేంద్రమంత్రిగా, కేంద్ర మహిళా కమిషన్‌ సభ్యురాలిగా, లోక్‌సభ అంచనాల కమిటీ సభ్యురాలిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత 1998లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి లాల్‌బిహరి తివారీ చేతిలో తొలిసారి ఓటమి చవిచూశారు. ఆ ఓటమే ఆమెకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. 1998లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆమె సీఎం పీఠం అధిరోహించారు. ఆ ఎన్నికల్లో ఆమె బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ నేతృత్వంలోని బీజేపీని ఓడించి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి 2013 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు.

సీఎంగా ఓటమి.. గవర్నర్‌గా బాధ్యతలు
రెండుసార్లు గోలే మార్కెట్‌, ఓసారి న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. ఆ తరువాత 2012లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆమ్‌ఆద్మీ పార్టీ జీవం పోసుకోవడంతో.. సీఎంగా తొలి పరాజయాన్ని చవిచూశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలవ్వడంతో.. అప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్‌ 2012 మార్చి 11న నియమించింది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెంది.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో పాటు షీలా తన గవర్నర్‌ పదవిని కూడా కోల్పోయారు. కేంద్రం పిలుపుమేరకు 2014 ఆగస్ట్‌ 25న తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన షీలా.. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయంతో నష్టపోయిన పార్టీకి ఊపిరి అందించే ప్రయత్నం చేశారు.

రెండు రాష్ట్రాలకు సీఎం అభ్యర్థిగా..
2017లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు  జరిగిన విషయం తెలిసిందే. అయితే సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణ వర్గానికి చెందిన షీలాను యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికీ జాతీయ స్థాయిలో తీవ్ర అవరోధాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు షీలా అభ్యర్థిత్వం కూడా పనిచేయలేక పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరజాయం పాలైంది. దీంతో రెండు రాష్ట్రాలకు సీఎం అభ్యర్థిగా ప్రకటించబడిన ఘనతను దక్కించుకున్నారు. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో చురుకుగా కనిపించిన ఆమె.. ఢిల్లీ సీఎం అరవింద్‌పై పెద్ద పోరాటమే చేశారు. అదే పోరాటపటిమతో 81 ఏళ్ల వయసులో కూడా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనీష్‌ తివారీ చేతిలో దారుణ ఓటమిని చవిచూశారు. ఓవైపు ఓటమి, మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గత నెల రోజులుగా చికిత్స పొందుతూ.. శనివారం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆమె మృతిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement