సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్.. ఈఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా సీనియర్ నేతైన షీలాను బరిలో ఉంచింది. కాంగ్రెస్‌కు కీలకంగా మారిన ఈఎన్నికల్లో షీలా విజయంపై కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. కనీసం నాలుగు స్థానాల్లోనైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈశాన్య ఢిల్లీలో ఆమెపై బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మనోజ్ తీవారి గట్టిపోటిని ఇస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఉత్కంఠ పోటీ నెలకొంది. మరోవైఉ ఆప్ కూడా విజయం కోసం ప్రయత్నిస్తోంది.
1998 నుంచి 2013 వరకు ఏకధాటిగా మూడుసార్లు ఢిల్లీ సీఎం పిఠాన్ని అధిరోహించిన చరిత్ర ఆమెకు ఉంది. జాతీయ రాజధానిలో కాంగ్రెస్ పార్టీని వరుసగా మూడుసార్లు అధికారంలోకి తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. న్యూఢిల్లీ శాసన సభ నుంచి ప్రాతినిథ్యం వహించి సీఎం అయిన షీలా గత ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు. తీవ్ర కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకునేందుకు షీలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకు నిజంచేయగలరనేది ఆసక్తికరంగా మారింది. ఏడు స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరిగినా నేతల మధ్య అవగహనలేకపోవడంతో చివరికి విడివిడిగానే బరిలోకి దిగక తప్పలేదు. కేజ్రీవాల్‌తో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నా షీలా మాత్రం వ్యతిరేకిస్తున్నారని స్థానిక నేతలు చెపుతున్నారు. అయితే జాతీయ రాజధాని ఢిల్లీలో షీలా ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment