బ్యూనస్ ఎయిర్స్‌లోని అధ్యక్ష నివాసంలో మారడోనా పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్, ఆయన భార్య ఫాబియోలా
మారడోనా... నీవిక రావని, ఇకపై లేవనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేమంటూ దివికెగిన సాకర్‌స్టార్‌కు ఫుట్‌బాల్ ప్రపంచం, జనవాహిని, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ముఖ్యంగా అర్జెంటీనా అంతటా విషాదం అలుముకుంది. అభిమానజనం దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పూల చేతితో, కన్నీటి కళ్లతో నివాళి అర్పించింది.
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): సాకర్ లోకం కన్నీటి సంద్రమైంది. యావత్ అర్జెంటీనా విలపించింది. అభిమాన హీరో ఇక లేడనే వార్తని జీర్ణించుకోలేకపోయింది. గుండెపోటుతో బుధవారం మృతి చెందిన డీగో మారడోనాను కడసారి చూసిన కనులన్నీ నీళ్లతో నిండిపోయాయి. అంతిమ వీడ్కోలు పలికే చేతులు అచేతనమయ్యాయి. బరువెక్కిన హృదయాలు, బాధాతప్త మనసులు మౌనంగానే రోదిస్తే... నిలువెత్తు అభిమానం నింపుకున్న జనం బోరుమంది.
ఆఖరిసారి దిగ్గజాన్ని చూసుకోవాలని పోటీపడిన అభిమానులతో పరిస్థితి కూడా మారిపోయింది. వెంటనే పరిస్థితి చేజారకుండా స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారు. అయిన ఆ లాఠీల దెబ్బలు, పోలీసు జాగిలాల దాడులు అభిమాన లోకాన్ని ఏమాత్రం నియంత్రించలేకపోయాయి. గురువారం ఉదయమే సాధారణ జనానికి నివాళి అర్పించేందుకు అర్జెంటీనా అధ్యక్ష నివాసంలో ఏర్పాటు చేశారు. కానీ రాత్రి నుంచే ‘కరోనా కాలాన్ని’ లెక్కచేయని అభిమానులు వేలసంఖ్యలో వరుస కట్టారు. అనంతరం లాంఛనాలతో అతనికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
అభిమానం... ఆగ్రహం
వేల సంఖ్యలో గుమిగూడిన అభిమానులు, ప్రజలు తమ దేశానికి ప్రపంచకప్ అందించిన దిగ్గజాన్ని ఆఖరిసారిగా చూసేందుకు క్యూ కట్టేందుకు ఎగబడ్డారు. వీరిని నియంత్రించడం బాడీగార్డులు, భద్రతా సిబ్బంది తరం కాలేకపోయింది. అనుమతించడం లేదంటూ ఊగిపోయిన జనాలు ఒక్కసారిగా సహనం కోల్పోయారు. చేతిలో ఉన్న వాటర్ బాటిళ్లు, శ్రద్ధాంజలి ఘటించేందుకు తెచ్చిన పూల బొకేలతో పోలీసులపై విసిరికొట్టారు. దీంతో విషాదంతో బరువెక్కిన అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అది... ఇప్పుడు మారడోనా స్టేడియం
ఇటలీలోని సాన్ పాలో స్టేడియం ఇకపై మారడోనా స్టేడియంగా మారుతోంది. నేపుల్స్ నగరం మేయర్ లూగి డి మాగిస్ట్రిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. నేపుల్స్‌లో ఉన్న ఈ మైదానంలో మారడోనా నేతృత్వంలోని నపోలి జట్టు ఇటాలియన్ ఫుట్‌బాల్ లీగ్ (సెరియా ‘ఎ’)లో రెండు సార్లు (1987, 1990) విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నపోలి క్లబ్ విజేతగా నిలువలేదు. అందుకే అతని సారథ్య విజయానికి ఈ స్టేడియాన్ని అంకితమిస్తున్నట్లు మేయర్ మాగిస్ట్రిస్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పేరు మార్పు ప్రక్రియను వెంటనే ప్రారంభించినట్లు చెప్పారు.
ఫుట్‌బాల్‌ను కట్ చేయను
గ్రేటెస్ట్ సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఆట తనకెంత ప్రాణప్రదమో మైదానంలో చేతల్లో చూపినట్లే... వెలుపల చేష్టల్లోనూ చూపాడు. కేక్‌పై ఫుట్‌బాల్ లోగోను కోయనంటే కోయనని చెప్పాడు. ఈ విషయాన్ని భారత దిగ్గజ ఫుట్‌బాలర్ ఎం. విజయన్ తాజాగా వివరించారు. 2012లో భారత్‌కు విచ్చేసిన డీగో కోసం కన్నుర్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ స్టేడియం ఆకారంలో కేక్‌ను తయారు చేశారు. దానిపై ఫుట్‌బాల్ లోగోను తీర్చిదిద్దారు. మారడోనాను కట్ చేయమంటే తిరస్కరించాడు. తను ప్రేమించే సాకర్ బంతిని కోయనన్నాడు. ఫుట్‌బాల్ భాగాన్ని కాకుండా మిగత కేక్ కోసి ఆటపై తనకున్న మమకారాన్ని గుర్తుచేశాడని విజయన్ చెప్పారు. ‘నిస్సందేహంగా మారడోనా దేవుడు. దేవుడికి మరణం లేదు. సాకర్ ఆరాధించే గుండెల్లో అతను చిరస్థాయిగా ఉంటాడు’ అని విజయ్ నివాళులు అర్పించాడు.
అర్జెంటీనా జెండా... జెర్సీ
జననివాళికి ముందుగా మారడోనా పార్థివ దేహాన్ని కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో ఏకాంతంగా ఉంచారు. వారంతా కన్నీటి నివాళులు అర్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అతని శవపేటికపై జాతీయ పతాకాన్ని కప్పారు. దానిపైనే అతను బరిలోకి దిగిన 10 నంబర్ జెర్సీని ఉంచారు. అందరికంటే ముందుగా డీగో కుమార్తె తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించింది. తర్వాత కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా తమ తుది వీడ్కోలు పలికారు. ఆ తర్వాత 1986 ప్రపంచకప్ విజేత సభ్యులు, అర్జెంటీనా ఫుట్‌బాలర్లు, బోకా జూనియర్స్ ఆటగాళ్లు తమ ఆత్మీయ సూపర్ హీరోను కడసారి చూసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment