సౌమిత్ర ఛటర్జీ
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబర్ 14న ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు.
అయితే ఉన్నట్టుండి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు.
1935 జనవరి 19న పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ‘అపుర్ సంసార్’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం.
‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ తదితర చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన ఛటర్జీ బెంగాలీ చిత్రసీమకు ఎంతో వన్నె తెచ్చారు. సోనార్ ఖెల్లా, జోయ్ బాబా ఫెలునాథ్, ఘరె బైరె వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన.
బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారాయన. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు ఛటర్జీ. వీటితో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారాయన. కాగా సౌమిత్ర ఛటర్జీ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.
యస్–యస్–సక్సెస్
సౌమిత్ ఛటర్జీ అనగానే సత్యజిత్ రేతో ఆయనకున్న అనుబంధం గుర్తురాక మానదు. ప్రపంచ సినిమాల్లో సక్సెస్‌ఫుల్ యాక్టర్–డైరెక్టర్ కాంబినేషన్లలో ఈ ఇద్దరి పేర్లు తప్పక ప్రస్తావించాల్సిందే. సౌమిత్ర ఛటర్జీను ప్రపంచ సినిమాకు పరిచయం చేసింది సత్యజిత్ రేయే. రే తీస్తున్న ‘జల్‌సాగర్’ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లారట సౌమిత్ర. అప్పటికి ఆయనకు తెలియదు రే ఇచ్చే పెద్ద హిట్లలో హీరో వేషం తనే వేస్తానని, రే ఫ్యావరెట్ హీరో అవుతానని. ఆ చిత్రీకరణ చూడటానికి వెళ్లే సమయానికే సౌమిత్రను ‘అపుర్ సంసార్’ (1959) చిత్రానికి హీరోగా ఫిక్స్ అయ్యారు రే. ‘అపుర్..’ షూటింగ్ స్టార్ట్ అయ్యి, మొదటి సన్నివేశం తీసే వరకూ కూడా సౌమిత్రకు తన మీద తనకు నమ్మకం అంతగా లేదట. మొదటి షాట్ సింగిల్ టేక్‌లో ఓకే అయ్యాక నమ్మకం వచ్చింది. తన జన్మకారణం ఇదే (నటన) అని అర్థం అయిపోయింది.
సౌమిత్ర ఛటర్జీ – సత్యజిత్ రే ఇద్దరూ కలసి సుమారు 14 సినిమాలు చేశారు. సౌమిత్రలోని నటుడిలో ఉన్న అన్ని కోణాలను సత్యజిత్ కథలు ఆవిష్కరించాయి. కొన్ని కథలు రాసే సమయంలో సౌమిత్రను మనసులో పెట్టుకొని రాశారట సత్యజిత్ రే. ‘ఫెలుదా’లోని బెంగాలీ డిటెక్టివ్ ఫెలుదా పాత్ర సౌమిత్రకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఫెలుదా పాత్రకు సంబంధించిన నవలల్లో సౌమిత్ర ఛటర్జీ రూపురేఖల ఆధారంగా బొమ్మలు వేయించారట రే. సౌమిత్ర, నిర్మల్యా ఆచార్య స్థాపించిన మేగజీన్‌కి పేరు పెట్టమని రేని కోరితే ‘ఎక్కోన్’ అని పేరు పెట్టారు. ‘ఎక్కోన్’ అంటే ‘ఇప్పుడు’ అని అర్థం. పేరుతో పాటు కవర్ పేజీ డిజైన్ కూడా చేసి పెట్టారట. వీరి కాంబినేషన్‌లో ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ వంటి సినిమాలు పాపులారిటీ పొందాయి.
‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయాను. మా నాన్నగారిది, ఆయన (సౌమిత్ర)ది అద్భుతమైన కెమిస్ట్రీ. నాన్న సృష్టించిన పాత్రను తనదైన ఆలోచనతో చేశారాయన. ‘ఆషానీ సంకేత్’లోని గంగాచరణ్ పాత్ర సౌమిత్రగారికి ఎంతో ఇష్టం. ఆయన సినిమాలో ఎంతగా లీనమయ్యేవారంటే ఒకసారి ట్రాలీ తోసే మనుషులు తక్కువైతే ఆయనే తోశారు. అంతటి గొప్ప వ్యక్తి.
– దర్శకుడు సందీప్ రే, సత్యజిత్ రే తనయుడు
Comments
Please login to add a commentAdd a comment