Soumitra
-
తొలి తరం నటుడు సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబర్ 14న ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ‘అపుర్ సంసార్’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం. ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ తదితర చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన ఛటర్జీ బెంగాలీ చిత్రసీమకు ఎంతో వన్నె తెచ్చారు. సోనార్ ఖెల్లా, జోయ్ బాబా ఫెలునాథ్, ఘరె బైరె వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన. బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారాయన. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు ఛటర్జీ. వీటితో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారాయన. కాగా సౌమిత్ర ఛటర్జీ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. యస్–యస్–సక్సెస్ సౌమిత్ ఛటర్జీ అనగానే సత్యజిత్ రేతో ఆయనకున్న అనుబంధం గుర్తురాక మానదు. ప్రపంచ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్–డైరెక్టర్ కాంబినేషన్లలో ఈ ఇద్దరి పేర్లు తప్పక ప్రస్తావించాల్సిందే. సౌమిత్ర ఛటర్జీను ప్రపంచ సినిమాకు పరిచయం చేసింది సత్యజిత్ రేయే. రే తీస్తున్న ‘జల్సాగర్’ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లారట సౌమిత్ర. అప్పటికి ఆయనకు తెలియదు రే ఇచ్చే పెద్ద హిట్లలో హీరో వేషం తనే వేస్తానని, రే ఫ్యావరెట్ హీరో అవుతానని. ఆ చిత్రీకరణ చూడటానికి వెళ్లే సమయానికే సౌమిత్రను ‘అపుర్ సంసార్’ (1959) చిత్రానికి హీరోగా ఫిక్స్ అయ్యారు రే. ‘అపుర్..’ షూటింగ్ స్టార్ట్ అయ్యి, మొదటి సన్నివేశం తీసే వరకూ కూడా సౌమిత్రకు తన మీద తనకు నమ్మకం అంతగా లేదట. మొదటి షాట్ సింగిల్ టేక్‌లో ఓకే అయ్యాక నమ్మకం వచ్చింది. తన జన్మకారణం ఇదే (నటన) అని అర్థం అయిపోయింది. సౌమిత్ర ఛటర్జీ – సత్యజిత్ రే ఇద్దరూ కలసి సుమారు 14 సినిమాలు చేశారు. సౌమిత్రలోని నటుడిలో ఉన్న అన్ని కోణాలను సత్యజిత్ కథలు ఆవిష్కరించాయి. కొన్ని కథలు రాసే సమయంలో సౌమిత్రను మనసులో పెట్టుకొని రాశారట సత్యజిత్ రే. ‘ఫెలుదా’లోని బెంగాలీ డిటెక్టివ్ ఫెలుదా పాత్ర సౌమిత్రకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఫెలుదా పాత్రకు సంబంధించిన నవలల్లో సౌమిత్ర ఛటర్జీ రూపురేఖల ఆధారంగా బొమ్మలు వేయించారట రే. సౌమిత్ర, నిర్మల్యా ఆచార్య స్థాపించిన మేగజీన్‌కి పేరు పెట్టమని రేని కోరితే ‘ఎక్కోన్’ అని పేరు పెట్టారు. ‘ఎక్కోన్’ అంటే ‘ఇప్పుడు’ అని అర్థం. పేరుతో పాటు కవర్ పేజీ డిజైన్ కూడా చేసి పెట్టారట. వీరి కాంబినేషన్లో ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ వంటి సినిమాలు పాపులారిటీ పొందాయి. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయాను. మా నాన్నగారిది, ఆయన (సౌమిత్ర)ది అద్భుతమైన కెమిస్ట్రీ. నాన్న సృష్టించిన పాత్రను తనదైన ఆలోచనతో చేశారాయన. ‘ఆషానీ సంకేత్’లోని గంగాచరణ్ పాత్ర సౌమిత్రగారికి ఎంతో ఇష్టం. ఆయన సినిమాలో ఎంతగా లీనమయ్యేవారంటే ఒకసారి ట్రాలీ తోసే మనుషులు తక్కువైతే ఆయనే తోశారు. అంతటి గొప్ప వ్యక్తి. – దర్శకుడు సందీప్ రే, సత్యజిత్ రే తనయుడు -
స్పృహలో లేరు; విషమించిన నటుడి ఆరోగ్యం
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం విషమించింది. కరోనా సోకడంతో ఇరవై రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని, ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. సౌమిత్ర ఛటర్జీని రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నామని, అయితే వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కొన్నిసార్లు చికిత్సకు స్పందించడం లేదని తెలిపారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోయిందని, యూరియా, సోడియం స్థాయి విపరీతంగా పెరిగినట్లు వెల్లడించారు. (చదవండి: కరోనా: భారత్‌లో 79 లక్షలు దాటిన కేసులు) అయితే ఆయన ఊపిరితిత్తులు, గుండె బాగానే పనిచేస్తున్నాయని, కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ బోర్డు ఈరోజు సమావేశమై తదుపరి చికిత్స విధానాల గురించి చర్చిస్తుందని, ఇందుకు సౌమిత్ర ఛటర్జీ కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తే, వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభిస్తామని తెలిపారు. ప్లాస్మామార్పిడి ద్వారా ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా కోవిడ్ బారిన పడిన సౌమిత్ర ఛటర్జీని అక్టోబరు 6న, కోల్‌కతాలోని బెల్లే వ్యూ క్లినిక్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 85 ఏళ్ల ఈ దిగ్గజ నటుడు గతంలో కాన్సర్ బారిన పడి కోలుకున్నారు. -
సేన్, రేల మధ్య వైరుధ్య బంధం
సాక్షి, న్యూఢిల్లీ : ‘కళాత్మక చిత్రాలు తీస్తామని చెప్పుకునే వారందరికి విదేశాల్లో జరిగే చలన చిత్రోత్సవాల్లో పొల్గొనాలనే ధ్యాస తప్పించి, భారత ప్రేక్షకులను ఆకర్షించాలనే దృష్టి లేదు. కథ ఎలా చెప్పాలో తెల్సిన మృణాల్ సేన్ కూడా వారిలో ఒకరే’ అని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్ రాయ్ రాసిన ఓ లేఖలోని వ్యాఖ్యలివి. మృణాల్ సేన్ తీసిన దాదాపు అన్ని సినిమాల గురించి విమర్శనాత్మక దృక్పథంతోనే మాట్లాడిన సత్యజిత్ రే ఆయన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ విమర్శకుడు చిదానంత గుప్తాకు (1991, జూన్‌లో) రాసిన ఆఖరి లేఖలోనిది ఈ వ్యాఖ్య. ఈ లేఖ ప్రతిని ఓ జాతీయ పత్రిక 1991, అక్టోబర్‌లో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలను చూసిన మృణాల్ సేన్ బాగా నొచ్చుకున్నారు. అప్పటికే సత్యజిత్ రే ఆస్పత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నారు. సినీ పాత్రికేయ లోకం మృణాల్ సేన్‌ను చుట్టుముట్టి, సత్యజిత్ రే చేసిన విమర్శలపై స్పందించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సత్యజిత్ రే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఆయన ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన వేలకు మందులు తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. అందుకని కళాత్మక విలువల గురించి. సినీ కళ గురించి నేనిప్పుడు చర్చించ దల్చుకోలేదు’ అని సేన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆశించినట్లు సత్యజిత్ రే కోలుకోకుండా 1992, ఏప్రిల్ 23వ తేదీన కన్నుమూశారు. రే ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆయన దహన సంస్కారాల వరకు మృణాల్ సేన్, రే కుటుంబం వెన్నంటే ఉన్నారు. అయితే అన్ని రోజులూ ఆయన కళ్లలో వెలుగు కోల్పోయిన ఛాయలే కనిపించాయి. సత్యజిత్ రే విమర్శలకు మృణాల్ సేన్ నొచ్చుకోవడం అదే మొదటి సారి కాదు. 1965లో ఆయన తీసిన ‘ఆకాశ్ కుసమ్’ నుంచి 1969లో హిందీలో తీసిన తొలి చిత్రం ‘భువన్ షోమ్’ (కరీర్లో 9వ చిత్రం) మొదలుకొని దాదాపు అన్ని చిత్రాలపై సత్యజిత్ విమర్శలు చేశారు. తెలుగులో తీసిన ‘ఒక ఊరి కథ’తోపాటు ఒకటి రెండు హిందీ చిత్రాలను మెచ్చుకున్నారు. కేవలం రెండు లక్షల రూపాయలను మాత్రమే వెచ్చించి తీసిన హిందీ చిత్రం ‘భువన్ షోమ్’ సినీ విమర్శకులనే కాకుండా కమర్షియల్‌గా కూడా ఎంతో హిట్టయింది. కొత్త తరంగ చిత్రంగా సినీ విమర్శకులు దాన్ని కొనియాడగా, ఆ అందులో ఏముందీ, ప్రేక్షకులకు ఆకట్టుకునే కొన్ని పాపులర్ టెక్నిక్‌లు తప్ప అని సత్యజిత్ రే విమర్శించారు. ‘ఏ బిగ్ బ్యాడ్ బ్యూరోక్రట్ రిఫామ్డ్ బై రస్టిక్ బెల్లి’ అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాంకోయా ట్రూఫాట్ చిత్రాల స్ఫూర్తితో మృణాల్ సేన్, సౌమిత్ర ఛటర్జీ, అపర్ణా సేన్ జంటగా ‘ఆకాశ్ కుసమ్’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయింది. నాడు ‘స్టేట్స్‌మేన్’ పత్రిక ఈ సినిమాపై బహిరంగ చర్చను నిర్వహించింది. సినీ విమర్శకులు కొందరు సేన్ వైపు నిలువగా, మరికొందరు రే వైపు వ్యాఖ్యానాలు చేశారు. ఈ విషయం చినికి చినికి గాలివానగా మారడంతో 1965, సెప్టెంబర్ 13వ తేదీన చర్చను నిలిపివేస్తున్నట్లు స్టేట్స్‌మేన్ పత్రిక ప్రకటించింది. రే చేసిన దాదాపు అన్ని విమర్శలకు సేన్ సమాధానం ఇచ్చినా రే అంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. రే తీసిన ‘పథేర్ పాంచాలి’, అపరాజిత సిరీస్ చిత్రాలను ప్రశంసించిన మృణాల్ సేన్ ‘పరాస్ పత్తర్’ చిత్రాన్ని తీవ్రంగానే విమర్శించారు. ఈ ఇరువురు మహా దర్శకులు వర్తమాన జీవన వైరుధ్యాలపై తమదైన దృక్పథంతో సినిమాలు తీసి సామాజిక ప్రయోజనానికి దోహదపడ్డారు. వీరిద్దరు తీసిన ‘పునస్క–మహానగర్, ప్రతివాండీ–ఇంటర్వ్యూ, బైషే శ్రావణ–ఆశని సంకేత్, కోరస్–హీరక్ రాజర్ దిశే’ చిత్రాల్లో కథాంశం దాదాపు ఒకటే అయినా భిన్న కోణాలు కల్పిస్తాయి. ఒకప్పుడు మంచి మిత్రులే ఒడ్డూ, పొడువు, ఛామన ఛాయలో ఒకే తీరుగా కనిపించే మృణాల్ సేన్, సత్జిత్ రేలు చర్చా వేదికలపై ఒకరినొకరు విమర్శించుకుంటూ గంభీరంగానే కనిపించేవారు. అంతకుముందు వారు చాలా సన్నిహిత మిత్రలు. చాప్లిన్ మీద మృణాల్ సేన్ రాసిన పుస్తకం కవర్ పేజీని సత్యజిత్ రే స్వయంగా డిజైన్ చేశారు. లేక్ టెంపుల్ రోడ్డులోని సత్యజిత్ రే ఫ్లాట్‌కు సేన్ తరచూ వెళ్లి గంటల తరబడి సినిమా ముచ్చట్లు పెట్టేవారు. భిన్నత్వంలో ఏకత్వంలా వైరుధ్యంలో ఏకత్వంగా వారి మధ్య మిత్రత్వం ఉండేది. రే జ్ఙాపకాలతో మృణాల్ సేన్ నిన్న, అంటే ఆదివారం లోకం విడిచి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. -
‘దాన వీర శూర కర్ణ ’ మూవీ స్టిల్స్