తనకు పద్మభూషణ్ అవార్డ్(padma Bhushan Award) ప్రకటించడంపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ (Ajith Kumar) స్పందించారు. ఈ అవార్డ్ ప్రకటించినందుకు ముందుగా భారత ప్రభుత్వం, సినిమా రంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు చూడటానికి మా నాన్న పి సుబ్రమణ్యం బతికుంటే ఇంకా సంతోషపడే వాడినని అన్నారు. అలాగే నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లి మోహిని, భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన వారిలో అజిత్‌కుమార్, నందమూరి బాలకృష్ణ, శోభనతో పాటు మరికొందరికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
"భారత రాష్ట్రపతి నుంచి గౌరవ పద్మ అవార్డును స్వీకరిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత స్థాయిలో గుర్తింపు పొందడం, అలాగే దేశానికి నా కృషిని గుర్తించినందుకు కృతజ్ఞుడను. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. చాలా మంది సమిష్టి కృషి, మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేరణ, సహకారం, మద్దతు నా ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి " అని అజిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా.. ప్రస్తుతం అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment