చమర్తి వెంకట్రాజు
‘గూండారాజ్యం, టూటౌన్ రౌడీ, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, చక్రం’.. వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత చమర్తి వెంకట్రాజు(సి.వెంకట్రాజు) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా సిద్దిరాజు కండ్రిగ గ్రామంలో 1948 మే 25న చమర్తి నారపరాజు, వెంకటమ్మ దంపతులకు జన్మించారాయన. సిద్దిరాజు కండ్రిగ గ్రామానికే చెందిన గుంటుమడుగు శివరాజుతో(జి.శివరాజు) కలిసి శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకాన్ని స్థాపించారు వెంకట్రాజు.
తొలిచిత్రంగా కృష్ణ హీరోగా ‘గూండారాజ ్యం’(1989) నిర్మించారు. ఆ తర్వాత ‘టూటౌన్ రౌడీ, నియంత, అహంకారి, ఆదర్శం, ఆరంభం’ వంటి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత గీత చిత్ర ఇంటర్నేషనల్ అనే పతాకాన్ని స్థాపించిన వీరిద్దరూ ‘లేడీబాస్, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, శ్రీమతి వెళ్లొస్తా, ఘర్షణ, చక్రం’ వంటి పలు విజయవంతమైన సినిమాలు తీశారు. ‘పవిత్రబంధం’ సినిమాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా బంగారు నందిని బహూకరించింది. సి.వెంకట్రాజు మృతికి పలువురు సినీ ప్రముఖులతో పాటు ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ సంతాపం తెలిపింది. కాగా ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఈరోజు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment