మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (సచీ) కన్నుమూశారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో సమస్య రావడంతో సచీకి గుండెపోటు వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన్ను జాయిన్ చేశారు బంధువులు. కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై సచీకి చికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2007లో వచ్చిన మలయాళ చిత్రం ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఆ తర్వాత ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. సచీ ఒక్కరే ‘రన్ బేబీ రన్’, ‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ (దర్శకత్వం కూడా), ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (దర్శకత్వం కూడా) చిత్రాలకు కథ అందించారు. ‘అనార్కలి’ (2015) చిత్రంతో సచీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దర్శకుడిగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజూ మీనన్ నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ వారు ఈ హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత – నటుడు జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నారు. సచీ మృతి పట్ల మలయాళ ఇండస్ట్రీ, ఇతర సినీరంగ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment